- మహిళలను వేధించడంలో రాష్ట్రానికి మూడోస్థానం
- నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదికలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, అత్యాచారాలు, మోసాలు, సైబర్ నేరాలు రోజురోజుకూ అధికమవుతున్నాయి. గంటకు 14 నేరాలు, రోజుకు 24 చొప్పున మోసాలు జరుగుతున్నాయి. రోజుకు 4 హత్యలు జరుగుతున్నాయి. మహిళను వేధించడం, అవమానించడంలో దేశంలో రాష్ట్రం మూడోస్థానంలో నిలిచింది. సైబర్ నేరాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) 2014కు సంబంధించిన నివేదికను వెల్లడించింది.
ఈ నివేదికలో రాష్ట్రానికి సంబంధించిన వివరాలు బెంబేలెత్తిస్తున్నాయి. 2014లో రాష్ట్రంలో పోలీసులకు 1,28,737 ఫిర్యాదులందగా.. వాటిలో 1,27,706 కేసులు నమోదయ్యాయి. 2014లో 1308 హత్య, 1159 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. చీటీల పేరుతో, బ్యాంకుల్లో తప్పుడు పత్రాలతో రుణాలు తీసుకోవడం తదితర ఆర్థిక నేరాలకు సంబంధించి 9,413 కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత స్థానంలో తెలంగాణ నిలిచింది. 703 సైబర్ నేరాలు చోటు చేసుకున్నాయి.
మహిళలపై అఘాయిత్యాలూ అధికమే!: రాష్ట్రంలో మహిళలపై చోటు చేసుకుంటున్న నేరాలు శృతి మించుతున్నాయి. మహిళలను కించపరచడంలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. వీటికి సంబంధించి రాష్ట్రంలో 1,142 కేసులు నమోదయ్యాయి. లైంగిక వేధింపుల్లోనూ 620 కేసులతో పదోస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 979 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. మొత్తం 1091 మహిళలపై వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో మూడోస్థానంలో ఉంది.
గత ఏడాది బాలబాలికపై నేరాలకు సంబంధించి 1,930 నేరాలు నమోదయ్యాయి. 708 మంది చిన్నారులు కిడ్నాప్‌నకు గురికాగా 588 మందిపై అత్యాచారాలు జరిగాయి. మరో 292 మంది బాలికలు ప్రేమపేరిట కిడ్నాప్‌నకు గురయ్యారు. 2013లో నమోదైన కేసుల్లో 44,266 దర్యాప్తు దశలో ఉండగా... వీటికి గత ఏడాది మరో 1,06,830 అదనంగా వచ్చి చేరాయి. ఈ మొత్తం 1,51,096 కేసుల్లో 44,866 కేసులు దర్యాప్తు దశలోనే ఉండిపోయాయి. గత ఏడాది మొత్తం 55,548 కేసుల విచారణ పూర్తికాగా వీటిలో కేవలం 21,445 మందికి మాత్రమే శిక్షలు పడ్డాయి.