
ఏం కష్టం వచ్చిందో?
శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం వూసరవానిపేటలో విషాదం నెలకొంది.
శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాలు సాక్ష్యం కాగా... మృతులది శ్రీకాకుళం రూరల్ మండలం కరజాడ కావడం తో ఆ గ్రామంలో విషాదం అలముకుంది. గంగిట్ల శ్రీనివాసరావు(36), అతని భార్య సరోజని(32), ఇద్దరు ఆడపిల్లలు జగదీశ్వరి(12), ఉమామహేశ్వరి(10)లు రైలు పట్టాలపై ముక్కలై కనిపించిన దృశ్యం అందరినీ కలచివేసింది.
* రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య
* మృతుల్లో దంపతులు, ఇద్దరు పిల్లలు
* ఆర్థిక ఇబ్బందులే ఈ ఘోరానికి కారణమనే అనుమానం
* గ్రామ పెద్దల నిర్ణయంతో కుమిలిపోయిన ఇంటి పెద్ద!
* విషాదంలో కరజాడ గ్రామం
ఆమదాలవలస/శ్రీకాకుళం సిటీ/శ్రీకాకుళం రూరల్: కరజాడ గ్రామానికి చెందిన గంగిట్ల శ్రీనివాసరావుకు భార్య సరోజని, ఇద్దరు ఆడపిల్లలు జగదీశ్వరి, ఉమామహేశ్వరి అంటే ఎంతో ఇష్టం. ఎన్ని కష్టాలు ఉన్నా సంతోషంగానే ఉండేవారు. శ్రీనివాసరావు, సరోజనీలకు వ్యవసాయపనులే జీవనాధారం. పనులకు వెళ్లగా వచ్చే కూలి డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. పిల్లలు జగదీశ్వరిని ఆమదాలవలసలోని కేజీబీవీ విద్యాలయంలో ఆరో తరగతి, ఉమామహేశ్వరిని కరజాడ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదివిస్తున్నారు.
శ్రీనివాసరావుకు చెల్లి కృష్ణవేణి చెల్లి, తమ్ముడు చిన్నబాబు ఉన్నారు. కృష్ణవేణికి వివాహమై హైదరాబాదులో ఉంటుండగా, తమ్ముడు చిన్నబాబు శ్రీనివాసరావు ఇంటిపక్కనే ఉంటున్నారు. చిన్న కుమార్తె ఉమామహేశ్వరిని రోజూ ఇంటి సమీపంలో ఉన్న పాఠశాలకు శ్రీనివాసరావే తీసుకెళ్లి తీసుకువస్తాడని స్థానికులు చెబుతున్నారు.
అసలేం జరిగిందంటే
కరజాడలో శ్రీనివాసరావు, బమ్మిడి అటకేశం ఇళ్లకు సమీపంలో మూడు సెంట్ల ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలం తమదంటే.. తమదని వీరిద్దరూ తగాదాలు పడేవారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఇద్దరూ శ్రీకాకుళం రూరల్ పోలీసులను ఈ ఏడాది మే 29వ తేదీన ఆశ్రయించారు. అయితే ఈ సమస్యను పోలీసులు పరిష్కరించలేదు. దీంతో నాలుగు రోజుల క్రితం గ్రామ పెద్దలు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించారు. అరుుతే స్థలం విషయంలో తన కుటుంబానికి అన్యాయం జరిగిందని శ్రీనివాసరావు మదన పడేవారని స్థానికులు కొంతమంది చెబుతన్నారు.
దీనికి తోడు వ్యవసాయ అవసరాలకు స్థానికంగా ఉన్న బ్యాంకులో 19.9 గ్రాముల బంగారు ఆభరణాలను కుదవ పెట్టి 29 వేల రూపాయలను 2015 మార్చి 23వ తే దీన రుణంగా తీసుకున్నాడు. అది ప్రస్తుతం వడ్డీతో కలిపి రూ.37 వేలకు చేరింది. బంగారం తాకట్టుపెట్టి ఏడాది దాటడంతో బ్యాంకు అధికారులు వాటిని విడిపించుకోవాలని శ్రీనివాసరావుపై ఒత్తిడి పెంచారు. అలాగే ప్రైవేటు వ్యక్తుల వద్ద కూడా లక్ష రూపాయల వరకూ అప్పుగా తీసుకోవడం, తిరిగి ఇవ్వాలని వారిని నుంచి ఒత్తిడి పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యూడు.
ఈ క్రమంలో గార మండలం కోళ్లపేటలో ఉన్న తాతగారి ఇంటికి వెళ్తున్నామని చెప్పి శ్రీనివాసరావు, భార్య, పిల్లలు ద్విచక్ర వాహనంపై ఆమదాలవలస చేరుకున్నాడు. అక్కడ తాండ్రంకి మెట్ట వద్ద రైల్వేట్రాక్‌పై గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలిచారు.
నన్ను చంపేశారు
సంఘటనా స్థలంలో మృతుడు శ్రీనివాసరావు జేబులో సూసైడ్ నోటు, ఖాళీ ప్రాంసరి పత్రాలు దొరికినట్టు జీఆర్‌పీ ఎస్సై మధుసూదనరావు తెలిపారు. సూసైడ్ నోట్‌లో నన్ను చంపేశారు అని రాసి ఉండడంతో పాటు... కొంతమంది పేర్లు రాసి ఉన్నట్టు పేర్కొన్నారు. సూసైడ్ నోట్ ప్రకారం అప్పులు బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.