48 గంటలు.. రూ. 48 లక్షలు | 48 hours .. Rs. 48 lakh | Sakshi
Sakshi News home page

48 గంటలు.. రూ. 48 లక్షలు

Published Sat, May 14 2016 4:55 AM | Last Updated on Tue, Oct 30 2018 5:04 PM

48 గంటలు.. రూ. 48 లక్షలు - Sakshi

48 గంటలు.. రూ. 48 లక్షలు

నాచారం డివిజన్‌లోనే తిండి, నిద్ర
‘సాక్షి’ జనసభలో ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ ప్రకటన
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు


నాచారం: సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘సాక్షి’ దినపత్రిక చేపట్టిన ‘జనసభ’లకు అనూహ్య స్పందన లభిస్తోంది. సమస్యలపై ‘సాక్షి’ సమరానికి అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ ఒకడుగు ముందుకు వేసి నాచారం డివిజన్‌లో 48 గంటలపాటు పర్యటిస్తానని, రూ.48 లక్షలు నిధులు ఖర్చుచేస్తానని ప్రకటించారు. డివిజన్‌లోనే తిండి, నిద్ర అంటూ స్పష్టం చేశారు. తాను ఇంటికి సైతం వెళ్లనని.. రెండు రోజుల పాటు డివిజన్‌లోనే పర్యటిస్తానన్నారు. ఉదయం అల్పాహారం ఒకరింట.. భోజనం మరొకరి ఇంట.. రాత్రి బస ఇంకొకరి ఇంట్లోనే ఉండేలా తన పర్యటన ఉంటుందని సభికుల హర్షాతిరేకాల నడుమ ప్రకటించారు. నాచారం హెచ్‌ఎంటీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో శుక్రవారం ‘సాక్షి’ జనసభ జరిగింది.

ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ... డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. ఈ ప్రాంతంలో విద్యుత్ లో వోల్టేజీ సమస్యను, రోడ్డు నిర్మాణాన్ని ఒక వ్యక్తి అడ్డుకుంటున్నారని గుర్తుచేశారు. వ్యక్తి ప్రయోజనాల కన్నా... వ్యవస్థ ప్రయోజనాలే ముఖ్యమని, అభివృద్ధిని అడ్డుకునేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. హెచ్‌ఎంటీ నగర్‌లోని ఫుత్‌పాత్‌లపై చిరువ్యాపారాల వల్ల పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు ఆయన దృష్టికితెచ్చారు.


19, 20 తేదీల్లో డివిజన్‌లోనే...
నాచారం డివిజన్ అభివృద్ధికి రూ. 48 లక్షలు కేటాయించి డివిజన్‌ను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఈ నెల 19, 20 తేదీల్లో డివిజన్‌లో కార్పొరేటర్ సాయిజేన్ శాంతితో కలసి 48 గంటల పాటు పర్యటించి వెలుగులోకి వచ్చిన సమస్యలకు రూ. 48 లక్షలను కేటాయించి పరిష్కరిస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీహాల్స్‌ను త్వరితగతిన పూర్తి చేయిస్తామన్నారు.

హెచ్‌ఎంటీనగర్ పార్కులో ఉచిత వైఫై ఏర్పాటు చేయిస్తామని హెచ్‌ఎంటీ నగర్, ఎర్రకుంట పటేల్‌కుంట చెరువులను సుందరీకరిస్తామన్నారు. నాచారం డివిజన్ నుంచి బంగారు తెలంగాణకు నాంది పలుకుతామన్నారు.  స్థానికులు పలువురు ఎమ్మెల్యే చొరవను అభినందిస్తూ ఇందుకు వేదికగా మారిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement