
నాటుకోడి పులుసు... బెల్లం జిలేబీ
- ప్లీనరీలో నోరూరించే 50 రకాల వంటకాలతో విందు
- తెలంగాణతోపాటు ఆంధ్రా రుచులు కూడా..
- 120 మంది ఏపీ, తెలంగాణ నిపుణుల నేతృత్వంలో వంటలు
- 10 వేల మందికి సరిపోయేలా ఏర్పాట్లు
ఖమ్మం: టీఆర్‌ఎస్ ప్లీనరీలో ప్రతినిధులను 50 రకాల వంటకాలతో పసందైన విందు భోజనం అలరించనుంది. అతిథులందరినీ ఆకట్టుకునేలా నోరూరించే విభిన్నమైన వంటకాలు నోరూరించనున్నాయి. తెలంగాణ వంటకాలతో పాటు ఆంధ్రా రుచులనూ వడ్డించనున్నారు. ఖమ్మం జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న ప్లీనరీకి ఘనంగా ఏర్పాట్లు చేయడంతోపాటు అందుకు తగినట్లుగా వంటకాలూ సిద్ధం చేస్తున్నారు. 120 మందికి పైగా ఆంధ్రా, తెలంగాణ వంట నిపుణులు మంగళవారం నుంచే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్లీనరీకి 4 వేల మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశముండగా... వారితో వచ్చే సహచరులు, అనుచరులను దృష్టిలో ఉంచుకొని ముందుజాగ్రత్తగా సుమారు 10,000 మందికి భోజనం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అల్పాహరం ఉదయం 7 గంటల నుంచి ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు అల్పాహారం అందించనున్నారు. ఇడ్లీ, పూర్ణం, వడ, ఉప్మా, పెసరట్టు, పొంగలి, కొబ్బరి చట్నీ, కారంపొడి, సాంబార్, నెయ్యి, టీ, కాఫీ ఇవ్వనున్నారు.
మధ్యాహ్నం భోజనంలోకి.. భోజనంలో తవ్వా స్వీట్, బెల్లం జిలేబీ, కట్లెట్, గారె, కొత్తిమీర, టమాటా చట్నీ, వెజిటబుల్ బిర్యానీ, పన్నీర్ కుర్మా, పెరుగు చట్నీ, అన్నం, మామిడికాయ పప్పు, బెండకాయ ఫ్రై, వంకాయ పూర్ణం, గుమ్మడికాయ ఇగురు, ముంజల కర్రీ, మద్రాస్ ఉల్లిచెట్నీ, మెంతి మజ్జిగ, పప్పుచారు, ముద్దపప్పు, పచ్చిపులుసు, మిరియాల రసం, నల్లకారం, నెయ్యి, ఉలవచారు, గుడ్డు, నాటుకోడి పులుసు, మటన్ ధమ్‌కీ బిర్యానీ, పుంటికూర మటన్, చింతచిగురు రొయ్యలు, కొర్రమీను పులుసు, మటన్ కర్రీ, మెంతి చికెన్, గుత్తి వంకాయ, క్యాప్సికం పకోడీ, బీరకాయ, దొండకాయ, రోటి పచ్చడి, పెసరపప్పు టమాట, చీమ చింతకాయ ఫ్రై, చామదుంప పులుసు, ముద్దపప్పు, అప్పడం, పెరుగు, బ్రెడ్ హల్వా, ఐస్ క్రీం, పెజ్‌రోల్ తదితర 50 రకాల వంటకాలు వడ్డించనున్నారు. చెరుకూరి తోటలో ప్లీనరీ జరిగే ప్రాంతంలో భోజనం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వేదికపై ఉన్నవారికి.. ప్లీనరీ వేదికపై ఉన్నవారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్లీనరీ ప్రారంభం కాగానే ఉదయం 10 గంటలకు మజ్జిగ అందిస్తారు. 11 గంటలకు రాగి, జొన్నల జావ, మధ్యాహ్నం 2 గంటలకు స్నాక్స్, బొప్పాయి, ద్రాక్షపండ్లు, 4 గంటలకు టీ, హట్ బాదం, 5 గంటలకు బాసుంది అందిస్తారు. ప్రతినిధులకు.. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు 11 గంటలకు మజ్జిగ, సాయంత్రం 3 గంటలకు మైసూర్ పాక్, ఉల్లి పకోడీ, సాయంత్రం 4 గంటలకు మజ్జిగ సరఫరా ఉంటుంది.