పాఠశాలలో గ్యాస్‌లీక్?
♦ శ్వాస ఆడక విద్యార్థుల ఇబ్బంది
♦ అపస్మారక స్థితిలో నలుగురు..
హైదరాబాద్: తరగతి గదుల్లో రోజూలాగే విద్యార్థులు శ్రద్ధగా పాఠాలు వింటున్నారు. అంతలోనే శ్వాస ఆడక కొందరు కుప్పకూలిపోయారు. ఏమవుతుందో తెలుసుకునే లోపే నలుగురు విద్యార్థులు అపస్మారకస్థితికి వెళ్లిపోయారు. ఈ ఘటన శుక్రవారం హైదరాబాద్ షేక్‌పేట్ గుల్షన్‌కాలనీ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చోటు చేసుకుంది. ఆ స్కూల్ మొదటి అంతస్థులో రోజులాగే శుక్రవారం తరగతులు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో తీవ్ర దుర్వాసన రావడం ప్రారంభమైంది. ఈ వాసన భరించలేక కొందరు విద్యార్థులు తరగతి గదుల నుంచి బయటికి పరిగెత్తగా 5, 8, 9వ తరగతులలో విద్యార్థులు ఎక్కడి వారు అక్కడే కుప్పకూలిపోయారు. దీంతో హతాశులైన పాఠశాల యాజమాన్యం బాధిత విద్యార్థులను టోలీచౌకిలోని క్యాండి పిల్లల ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పది మంది విద్యార్థులకు ప్రథమ చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఇర్షాద్, గౌస్, షాహిద, అజీంలను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరికి ప్రాణాపాయమేమీ లేదని వైద్యులు తెలిపారు.
ఘటనా స్థలాన్ని సందర్శించిన డీసీపీ, ఆర్డీఓ
పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వర్‌రావు ఆసిఫ్‌నగర్ ఏసీపీ గౌస్ మొహియుద్దీన్, గోల్కొండ ఇన్‌స్పెక్టర్ ఖలీల్ పాషాతో కలసి పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయులు, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆసిఫ్‌నగర్ డివిజన్ క్లూస్‌టీం బి. భిక్షపతి బృందం ఆధారాలను సేకరించారు. కాగా సంఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పాఠశాల సైన్స్ ల్యాబ్ నుంచి గ్యాస్ లీకైందని కొందరు అంటుండగా... పాఠశాల వెనుక గల చెట్ల నుంచి దుర్వాసన వచ్చిందని కరస్పాండెంట్ తన్వీర్, ప్రిన్సిపాల్ రుమాన అహ్మద్‌లు అంటున్నారు. సికింద్రాబాద్ ఆర్డీఓ రఘురాం శర్మ, షేక్‌పేట్ తహశీల్దార్ చంద్రకళ పాఠశాలను సందర్శించి, ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించారు. ఉమ్మడి రాష్ట్రాల మైనార్టీ కమిషన్ చైర్మన్ అబిద్ రసూల్‌ఖాన్ ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించారు.
పాఠశాలపై చర్యలు తీసుకోవాలి..
ఈ ఘటనలో భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు అన్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి సమగ్ర విచారణ జరిపి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు.