బోర్డు డైరెక్టర్ ప్రసన్నకుమార్‌ను విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ రమాదేవి
గన్‌ఫౌండ్రీ: డీఎడ్ మేనేజ్‌మెంట్ సీట్ల భర్తీ వెరిఫికేషన్ కోసం కళాశాలల యాజమాన్యాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేటు మధ్యవర్తులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డీఎడ్ సీట్ల భర్తీ వెరిఫికేషన్ కోసం గన్‌ఫౌండ్రీలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ ఎం. ప్రసన్న కుమార్ ప్రైవేటు మధ్యవర్తులతో కళాశాలల యాజమాన్యం నుంచి లంచాలు తీసుకుంటున్నారంటూ ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు గురువారం ఏసీబీ డీఎస్పీ రమాదేవి తన బృందం బోర్డు కార్యాలయం వద్ద ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఇందులో యాజమాన్యాల నుంచి డబ్బు తీసుకునే మధ్యవర్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి నుంచి రూ. 9.65 లక్షలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం ప్రసన్న కుమార్ చాంబర్, కార్యాలయ ఉద్యోగులను విచారించి సోదాలు నిర్వహించారు. దీంతో పాటు ఏకకాలంలో ప్రసన్నకుమార్ ఇంటి వద్ద, బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. చిత్తూరు, కడప జిల్లాల్లో 33 కళాశాలలకు చెందిన 601 సీట్ల భర్తీకి లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ తనిఖీల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు సుదర్శన్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.