నటనా సౌరభం | Acting aura | Sakshi
Sakshi News home page

నటనా సౌరభం

Published Mon, Jan 30 2017 10:34 PM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

నటనా సౌరభం

నటనా సౌరభం

- దేవలోక ఔన్నత్యాన్ని చాటిన
   పౌరాణిక నాటకాలు
- పద్యాలతో ప్రేక్షకులను
  అలరించిన కళాకారులు
 
 నందినాటకోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో వివిధ నాటక సమాజాల కళాకారులు ప్రదర్శించిన పౌరాణిక పద్యనాటకాలు దేవలోక ఔనత్యాన్ని చాటి చెప్పాయి. పురాణేతిహాసాలలోని ఉత్తమ విలువలకు అద్దం పట్టాయి. నవక్రాంతి కల్చరల్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌ వారు ప్రదర్శించిన సీతారామకల్యాణం, కళావాహిని సాంస్కృతిక సంస్థ కర్నూలు వారు ప్రదర్శించిన కాళహస్తీశ్వర మహత్యం, సవేరా ఆర్ట్స్‌ కడప వారు ప్రదర్శించిన శ్రీరామ పాదుకలు అనే పద్యనాటకాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపాయి. 
- కర్నూలు (కల్చరల్‌)
 
రాముడి పరాక్రమం చాటిన సీతారామకళ్యాణం:
 నవక్రాంతి కల్చరల్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌ కళాకారులు స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో సోమవారం ఉదయం 10 గంటలకు సీతారామ కల్యాణం నాటకాన్ని ప్రదర్శించారు. లంకాధిపతిౖయెన రావణుడు శివున్ని మెప్పించి అనేక వరాలు పొంది తాను ఆచరిస్తున్నదే అసలైన ధర్మమని విశ్వసిస్తుంటాడు. దశకంఠుడు కైలాసనాథున్ని కఠోర భక్తితో పూజించి తనకు మరణం లేకుండునట్లు వరం పొంది రావణా అనే బిరుదును సాధిస్తాడు. లోక కల్యాణార్థం విశ్వామిత్రుడు తలపెట్టిన యాగాన్ని రాక్షసులు నిరోధిస్తారు. రామలక్ష్మణులు రాక్షసులను ఎదుర్కొని యాగ పరిసమాప్తం గావిస్తారు.
 
రాక్షస సంహారంతో రావణాసుడు ప్రతీకార వాంఛతో రగిలిపోతాడు. నార«ధుని ప్రమేయంతో రావణుడు సీతా స్వయం వరానికి మిథిలానగరానికి వెళ్తాడు. అక్కడ శివధనస్సును ఎత్తలేక పరాభవం పాలవుతాడు. శ్రీరామ చంద్రుడు విశ్వామిత్రుని ఆశీస్సులతో శివధనుర్భంగం చేసి సీతను వివాహమాడుతాడు. సీతారామకల్యాణం లోక కల్యాణానికి నాంది పలుకుతుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ నాటకానికి ఎం.అర్జున్‌రావు దర్శకత్వం వహించారు. 
 
కాళహస్తి విశిష్టతకు దర్పణం పట్టిన కాళహస్తీశ్వర మహత్యం:
 కళావాహిని సాంస్కృతిక సంస్థ కర్నూలు కళాకారులు ప్రదర్శించిన కాళహస్తీశ్వర మహత్యం కాళహస్తి విశిష్టతకు దర్పణం పట్టింది. కరువు కాటకాలతో దుర్భర స్థితిలోనున్న మధురాపురి రాజైన హరద్విజుడు నారధుని సలహా మేరకు శివుని గురించి తపస్సు చేస్తాడు. ప్రత్యక్షమైన శివుడు అతడిని ఒక పద్యమును పాండ్యరాజుకు వరముగా ఇస్తే అతని రాజ్యం సుఖఃశాంతులతో విలసిల్లుతుందని చెప్పారు. రుద్రరచితమైన పద్యమును తీసుకొని హరద్విజుడు పాండ్యరాజు ఆస్థానానికి వెళ్లి అక్కడ నక్కరకవిచే అవమానం పొందుతాడు. ఈ విషయం తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడై నక్కర కవిని కుష్టువ్యాధి గ్రస్తుడవు కమ్మని శపిస్తాడు.
 
కైలాసాద్రిని దర్శిస్తే శాపవిమోచనం కలుగుతుందని ఆదేశిస్తాడు. నత్కర కవి అప్పటి నుంచి కైలాస గిరికై అరణ్యములు దాటి వెళుతూ రాక్షసుడైన రక్తాక్షుని చెరలో చిక్కుతాడు. కుమారస్వామి నత్కర కవిని రక్తాక్షుని నుంచి రక్షిస్తాడు. కాళహస్తీశ్వరున్ని దర్శిస్తే శాపవిముక్తి కలుగుతుందని కుమార స్వామి సెలవిస్తాడు. కుమారస్వామి ఆదేశం మేరకు నత్కర కవి శివసాయుజ్యం పొంది కుష్టువ్యాధి నుంచి విముక్తుడు అవుతాడు. అప్పటి నుంచి కాళహస్తి మహత్యం కలిగిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుంది.ఈ నాటకానికి మనోహర్‌బాబు దర్శకత్వం వహించారు. 
 
రామపాదుకల విశిష్టత చాటిన శ్రీరామపాదుకలు :
సవేరా ఆర్ట్స్‌ కడప కళాకారులు ప్రదర్శించిన శ్రీరామపాదుకలు నాటకం రామాయణంలోని ఘట్టాలను చక్కగా ప్రదర్శించింది. సీతా స్వయంవరంలో జరిగిన పరాభవంతో భంగపడిన రావణుడు రాముడిని సంహరించడానికి బయలుదేరుతాడు. శివుని మాయ కారణంగా కైకేయి దుర్మతిగా మారి దశరథుని రెండు వరాలు కోరుకుంటుంది. కైక వరాలను గౌరవిస్తూ శ్రీరాముడు 14 ఏళ్లు అరణ్యవాసం చేయడానికి తరలివెళ్తాడు. మరొక వరం ప్రకారం భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి.
 
కానీ రాముడిపై అపారమైన భక్తి కలిగిన భరతుడు సోదరుడు తిరిగి వచ్చే వరకు రామపాదుకలను సింహాసనంపై ఉంచి రాజ్యపాలన చేస్తాడు. అలనాటి రామాయణ గాధలోని సత్యవాక్పరిపాలనలోని ఔనత్యాన్ని చాటి చెప్పే ఈ సన్నివేశాలను నాటకంలోని కళాకారులు అత్యంత ఆసక్తికరంగా ప్రదర్శించారు. ప్రముఖ నాటక రచయిత పల్లేటి లక్ష్మీకులశేఖర్‌ రచించిన ఈ నాటకానికి ఆళ్లూరి వెంకటయ్య దర్శకత్వం వహించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement