నటప్రావీణ్యానికి ప్రతీకలు.. పౌరాణిక నాటకాలు
నటప్రావీణ్యానికి ప్రతీకలు.. పౌరాణిక నాటకాలు
Published Wed, Feb 1 2017 10:34 PM | Last Updated on Wed, Apr 3 2019 8:57 PM
పౌరాణిక నాటకాలు-
కర్నూలు(కల్చరల్): నంది నాటకోత్సవాల్లో భాగంగా స్థానిక టీజీవి కళాక్షేత్రంలో బుధవారం రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన నాటక సమాజాల కళాకారులు ప్రదర్శించిన పౌరాణిక పద్య నాటకాలు రంగస్థల నటుల నటప్రావీణ్యానికి ప్రతీకలుగా నిలిచాయి. శ్రీ జ్ఞాన సరస్వతీ నాట్యకళామండలి వారు ప్రదర్శించిన ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’, శ్రీబాలసరస్వతి కళానాట్యమండలి (రంగారెడ్డి జిల్లా) వారు ప్రదర్శించిన ‘సత్య హరిశ్చంద్ర’, నటకులం సాంస్కృతిక సంస్థ (మణికొండ, హైదరబాదు) వారు ప్రదర్శించిన ‘శ్రీకృష్ణ రాయబారం’ నాటకాలు ప్రేక్షకులను అలరించాయి. అలనాటి పురాణాలలోని శ్రీరామచంద్రుడు, ఆంజనేయుడు, సత్యహరిశ్చంద్రుడు, శ్రీకృష్ణుడు తదితర పాత్రలలోని ఔన్నత్యాన్ని ఈ నాటకాలు చాటి చెప్పాయి.
శక్తి కంటే భక్తి గొప్పదని చాటిన రామాంజనేయ యుద్ధం
శ్రీజ్ఞాన సరస్వతి నాట్యకళామండలి (పరిగి) కళాకారులు ప్రదర్శించిన ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ పద్య నాటకం శక్తి కంటే భక్తియే గొప్పదని చాటిచెప్పింది. యయాతి రాజు వేటకై బయలుదేరి అరణ్యంలో తపస్సు చేస్తున్న వశిష్ట, విశ్వామిత్ర మునులను దర్శిస్తాడు. వశిష్ట మునికి యయాతి నమస్కరించగా, విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై యయాతిని శపిస్తాడు. నారదుడు యయాతి చెంత చేరి ఆంజనేయుని వేడుకుని శాపవిముక్తిని పొందమని సలహా ఇస్తాడు. రాముని చేత సంహరింపబడాలనే శాపం నుంచి ఆంజనేయుడు మాత్రమే కాపాడగలడని యయాతి ఆంజనేయుడిని శరణు వేడతాడు.
తనను శరణు వేడిన యయాతి ప్రాణరక్షణ కోసం ఆంజనేయుడు రామునితో యయాతిని సంహరించవద్దని అభ్యర్థిస్తాడు. కానీ రాముడు ఆంజనేయుని అభ్యర్థనను తిరస్కరించి ఆంజనేయుడితో యుద్ధానికి సన్నద్ధమవుతాడు. సత్యమును కాపాడుటకై రామాంజనేయులు యుద్ధమునకు సిద్ధమైనారని నారదుడు ప్రవేశించి యుద్ధము వారించమని శంకురుడిని కోరతాడు. ప్రత్యక్షమైన శంకరుడు శక్తి కంటే భక్తి గొప్పదని రామాంజనేయులు నిరూపించారని తెలియజేస్తారు. రామభక్తి, ఆంజనేయుని శక్తి రెండింటినీ అద్వితీయంగా ప్రదర్శించిన ఈ నాటకం ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. తాండ్ర సుబ్రహ్మణ్యం రచించిన ఈ నాటకానికి వి.జగన్నాథరాజు దర్శకత్వం వహించారు.
సత్యనిష్టకు అద్దం పట్టిన ‘సత్యహరిశ్చంద్ర’...
టీజీవి కళాక్షేత్రంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ బాలసరస్వతి కళానాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన ‘సత్య హరిశ్చంద్ర’ నాటకం హరిశ్చంద్రుని సత్యనిష్టకు అద్దం పట్టింది. ఆడిన మాట తప్పడని, వాగ్దానం నెరవేర్చుట కోసం ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుంటాడనే హరిశ్చంద్రుని సాధు స్వభావాన్ని ఈ నాటకం చాటి చెప్పింది. దేవేంద్ర సభలో సత్యం తప్పక పలికే వారెవరూ అనే ప్రశ్న వచ్చినప్పుడు భూలోకంలో హరిశ్చంద్రుడు ఉన్నాడని వశిష్టుడు తెలుపుతాడు. హరిశ్చంద్రుడిని సైతం బొంకించేదనని విశ్వామిత్రుడు ప్రతిజ్ఞ చేసి వశిష్టునితో పందెం కాస్తాడు. అయోధ్యకేగి పరమేశ్వర ప్రీతిగా యాగము చేయదలిచానని, అందుకు ధనము కావలెనని హరిశ్చందుడిని కోరతాడు. హరిశ్చంద్రుడు కోరిన ధనాన్ని ఇస్తానని తెలుపుతాడు.
అయితే విశ్వామిత్రుడు సింహాన్ని, మాతంగ కన్యను సృష్టించడం, హరిశ్చంద్రునికి అనేక కష్టాలు కల్గించడం వల్ల ఆ ధనమును ఇవ్వలేకపోతాడు. హరిశ్చంద్రుడు రాజ్యం విడచి అడవులకు తరలివెళ్తాడు. తనకు ఇస్తానన్న ధనమును వసూలు చేయడానికి విశ్వామిత్రుడు నక్షత్రకుడిని పంపి నానా ఇబ్బందులు పెడతాడు. చివరకు హరిశ్చంద్రుడు భార్య చంద్రమతిని, కొడుకును అమ్ముకుంటాడు. కొడుకు లోహితుడిని మాయా పాము కరచి చంపగా, భార్యనే సుంకము తెమ్మని కాటి కాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు కట్టడి చేస్తాడు. ఆమె తన మంగళసూత్రాన్ని ఇవ్వడంతో వారి సత్యనిష్టను చాటుకున్నారు. తుదకు పరమేశ్వరుడు ప్రత్యక్షమై విశ్వామిత్రుడు ఆడిన నాటకం మాయా నాటకమని, హరిశ్చంద్రుని సత్యనిష్ట ముల్లోకాలకు ఆదర్శవంతమని ప్రకటిస్తాడు. నాటక ప్రారంభం నుంచి చివరి వరకు ఆసక్తికరంగా సాగిన ఈ నాటకానికి వరకవుల జగన్నాథరాజు దర్శకత్వం వహించారు.
కృష్ణుడి మేథస్సుకు దర్పణం పట్టిన శ్రీకృష్ణ రాయబారం
స్థానిక టీజీవి కళాక్షేత్రంలో బుధవారం సాయంత్రం 5 గంటలకు నటకులం సాంస్కృతిక సంస్థ కళాకారులు ప్రదర్శించిన ‘శ్రీకృష్ణ రాయబారం’ నాటకం శ్రీకృష్ణుడి మేథస్సుకు దర్పణం పట్టింది. కురుక్షేత్ర యుద్ధం సందర్భంగా శ్రీకృష్ణుడిని సహాయం అర్థించడానికి కౌరవుల తరపున దుర్యోధనుడు, పాండవుల తరపున అర్జునుడు ద్వారకకు వెళ్తారు. శ్రీకృష్ణుడు తానొక్కడినే ఒకవైపు.. తన సైన్యం ఒకవైపు ఉంటామని చెప్పగా అర్జునుడు శ్రీకృష్ణుడిని కోరుకుంటాడు.
ధర్మరాజు కోరికపై శ్రీకృష్ణుడు కౌరవుల సభకు వెళ్లి ఐదు ఊళ్లు ఇచ్చినట్లయితే కురుక్షేత్ర యుద్ధాన్ని నివారిస్తానని రాయబారం చేస్తాడు. అందుకు దుర్యోధనుడు అంగీకరించకపోగా, రాయబారిగా వచ్చిన శ్రీకృçష్ణుడిని బంధించడానికి ప్రయత్నం చేస్తాడు. శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించడంతో నాటకం ముగుస్తుంది. తిరుపతి వెంకటకవులు రచించిన ఈ నాటకానికి దాసరి శివాజీరావు దర్శకత్వం వహించారు.
నేటితో ముగియనున్న నంది నాటకోత్సవాలు...
కర్నూలు నగరంలో టీజీవి కళాక్షేత్రంలో జనవరి 18న ప్రారంభమైన నంది నాటకోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 15 రోజులుగా సాగిన ఈ నాటకోత్సవాల్లో పలువురు ప్రముఖ రంగస్థల నటులు, టీవీ, సినిమా కళాకారులు, రచయితలు పాల్గొన్నారు. సాంఘిక నాటికలు, బాలల, కళాశాలల విద్యార్థుల నాటికలు, అనంతరం పౌరాణిక పద్య నాటకాలు ఈ నాటకోత్సవాలలో ప్రదర్శితమయ్యాయి.
నేడు కర్నూలు లలిత కళాసమితి వారి ప్రమీలార్జున పరిణయం ప్రదర్శన...
నంది నాటకోత్సవాల ముగింపు రోజున గురువారం ఉదయం 10.30 గంటలకు కర్నూలు లలిత కళాసమితి కళాకారులు ప్రమీలార్జున పరిణయం పద్యనాటకాన్ని ప్రదర్శిస్తారని లలిత కళాసమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు వల్లెలాంబ నాటక సమితి (కోడుమూరు) కళాకారులు ‘దేవుడు’ పద్యనాటకాన్ని ప్రదర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకు సావేరి కల్చరల్ అసోసియేషన్ వారు ‘గంగాంబిక’ పద్యనాటకాన్ని ప్రదర్శిస్తారు. ఈ నాటక ప్రదర్శనతో నంది నాటకోత్సవాలు ముగుస్తాయి.
Advertisement