కాసుల వర్షం కురిపిస్తున్న ‘దేవుళ్లు’ | Mythology Films Trending In Tollywood | Sakshi
Sakshi News home page

కాసుల వర్షం కురిపిస్తున్న ‘దేవుళ్లు’.. ఇప్పుడిదే ట్రెండ్‌!

Published Fri, Jul 19 2024 2:24 PM | Last Updated on Fri, Jul 19 2024 3:24 PM

Mythology Films Trending In Tollywood

ఒకప్పుడు మన పురాణాలు, ఇతీహాసాలపై టాలీవుడ్‌లో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా వరకు బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించాయి.అయితే రాను రాను వెండితెరపై మైథాలజీ కథలు తగ్గిపోతూ వచ్చాయి. యాక్షన్‌, క్రైమ్‌, సస్పెన్స్‌, రొమాంటిక్‌ జానర్‌ సినిమాలే ఎక్కువగా సందడి చేశాయి. మధ్య మధ్యలో ఒకటి రెండు మైథాలజీ జానర్‌ సినిమాలు వచ్చినా..అంతగా ఆకట్టుకోలేకపోయాయి. 

కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారిపోయింది. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అన్నట్లుగా.. మళ్లీ మన ప్రేక్షకులు ‘దేవుళ్ల’ కథలను ఆదరిస్తున్నారు. సోషియో పాంటసీ సినిమాలను బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చేస్తున్నారు. పురాణాలు, ఇతిహాసాలు, దైవిక అంశాలతో కూడిన సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు నిదర్శనం ‘కల్కి 2898 ఏడీ’ సినిమానే. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్‌ జోడించి డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మహాభారతంలోని కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ పాత్రలన్నింటిని వెండితెరపై చూపిస్తూ..ఓ కొత్త కథను చెప్పాడు. ఆ కథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఫలితంగా బాక్సాఫీస్‌ వద్ద రూ. 1000 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టి చరిత్ర సృష్టించింది.

అంతకు ముందు వచ్చిన ‘కార్తికేయ 2’ చిత్రాన్ని కూడా ‘దేవుడే’ హిట్‌ చేశాడు. ఆ సినిమాలో కృష్ణుడుకి సంబంధించిన సన్నివేశాలకు నార్త్‌తో పాటు సౌత్‌ ప్రేక్షకులు కూడా పడిపోయారు. సినిమా విజయంలో ఆ సీన్స్‌ కీలక పాత్ర పోషించాయి.  ఇక ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మరో మైథాలజీ ఫిల్మ్‌ ‘హను-మాను’ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా దాదాపు రూ. 350 కోట్ల వసూళ్లను రాబట్టింది.

‘అరి’తో పాటు మరిన్ని చిత్రాలు..
టాలీవుడ్‌లో మైథాలజీ చిత్రాలకు గిరాకీ పెరిగింది. దీంతో పలువురు దర్శకనిర్మాతలు ఆ జోనర్‌ చిత్రాలనే తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఆఖండ 2ను లైన్‌లో పెట్టాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ‘కల్కి’ సినిమాకు సీక్వెల్‌ కూడా రెడీ అవుతోంది. అలాగే హను-మాన్‌కి సీక్వెల్‌గా ‘జై హను-మాన్‌’ రాబోతుంది. 2025లో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. చిరంజీవి ‘విశ్వంభర’, నిఖిల్‌ ‘స్వయంభు’ కూడా సోషియో ఫాంటసీ చిత్రాలే.

ఇక ఇదే జోనర్‌లో ‘పేపర్‌ బాయ్‌’ ఫేం జయశంకర్‌ ‘అరి’అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్‌, శుభలేఖ సుధాకర్‌, ఆమని, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇందులో కృష్ణుడిది ప్రధాన పాత్ర అని తెలుస్తోంది.  ఇంత వరకి ఎవరు టచ్ చేయని అరిషడ్వర్గాలనే కాన్సెప్ట్ మీద అరి మూవీని తెరకెక్కించాడు జయశంకర్‌. మనిషి అంతర్గత శత్రువులుగా భావించే అరిషడ్వర్గాలైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలని శ్రీకృష్ణుడు ఎలా నియంత్రించాడు? వాటితో ఆయనకున్న సంబంధం ఎలాంటిదనే విషయాల్ని వర్తమాన అంశాలతో ముడిపెడుతూ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సినిమా క్లైమాక్స్‌లో కృష్ణుడికి సంబంధించిన సీన్స్‌..గూస్‌ బంప్స్‌ తెప్పించేలా ఉంటాయట. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. అసలే ఇప్పుడు మైథాలజీ చిత్రాల ట్రెండ్‌ నడుస్తోంది. ‘అరి’లో కృష్ణుడి సీన్స్‌ పేలితే..బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement