హనుమాన్‌ టు కల్కి.. టాలీవుడ్‌ ఫస్టాప్‌ ఎలా ఉందంటే.. | Hanu Man To Kalki 2898 AD: Tollywood First 6 Months Report | Sakshi
Sakshi News home page

హనుమాన్‌ టు కల్కి.. టాలీవుడ్‌ ఫస్టాప్‌ ఎలా ఉందంటే..

Published Sun, Jun 30 2024 2:40 PM | Last Updated on Sun, Jun 30 2024 3:24 PM

Hanu Man To Kalki 2898 AD: Tollywood First 6 Months Report

టాలీవుడ్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా మారింది. ఇక్కడి సినిమాలను ప్రపంచం మొత్తం ఆదరిస్తోంది. వందల కోట్ల కలెక్షన్స్‌ రాబడుతూ రికార్డులను సృష్టిస్తోంది. అయితే ఇక్కడ సక్సెస్‌ ఎంత శాతం ఉందో ఫెయిల్యూర్‌ అంతే ఉంది. కొన్ని సినిమాలు ఊహించని రీతిలో కలెక్షన్స్‌ రాబడితే.. మరికొన్ని దారుణమైన అపజయాన్ని మూటగట్టుకున్నాయి. ఈ ఆరు నెలల్లో టాలీవుడ్‌ రిపోర్ట్‌ ఎలా ఉందో చూసేద్దాం.

ఓపెనింగ్‌ అదిరింది!
టాలీవుడ్‌కి సంక్రాంతి పండగ చాలా పెద్దది. ప్రతి సంక్రాంతికి ఒకటి రెండు పెద్ద సినిమాలు వస్తుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఏకంగా నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేశ్‌ ‘సైంధవ్‌’, నాగార్జున ‘నా సామిరంగ’తో పాటు కుర్రహీరో తేజ సజ్జ ‘హనుమాన్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే వీటిల్లో హనుమాన్‌  భారీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. స్టార్‌ హీరోల సినిమాలు బరిలో ఉన్నప్పటికీ  అన్ని వర్గాల ప్రేక్షకులు ‘హనుమాన్‌’కే ఓటేశారు. ఫలితంగా బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ. 300 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. గుంటూరుకారం, నా సామిరంగ చిత్రాలకి మిశ్రమ టాక్‌ వచ్చినా.. మంచి వసూళ్లనే రాబట్టాయి. సైంధవ్‌ మాత్రం దారుణంగా బోల్తాపడింది. అంతకు ముందు జనవరి 1న వచ్చిన సర్కారు నౌకరి, రిపబ్లిక్‌ డే సందర్భంగా రిలీజైన  ‘ర్యాపిడ్‌ యాక్షన్‌ మిషన్‌’, ‘బిఫోర్‌ మ్యారేజ్‌’ సినిమాలు ప్లాప్‌ టాక్‌నే మూటగట్టుకున్నాయి.

బ్యాండ్‌ మోగింది..
ఇక ఫిబ్రవరి తొలివారంలో సుహాస్‌ హీరోగా నటించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‌’ విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి విజయమే సాధించింది. అదేవారంలో వచ్చిన  ‘కిస్మత్‌’, ‘హ్యాపీ ఎండింగ్‌’, ‘బూట్‌కట్‌ బాలరాజు’, ‘గేమ్‌ ఆన్‌’ చిత్రాలు మాత్రం సందడి చేయలేకపోయాయి. ఇక రెండో వారంలో వచ్చిన రవితేజ ఈగల్‌, మమ్ముట్టి, జీవా ల‘యాత్ర 2’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపంచాయి. మూడోవారంలో వచ్చిన ‘ఊరు పేరు భైరవకోన’ప్రేక్షకలను కొంతమేర భయపెట్టేసింది. అయితే బాక్సాఫీస్‌ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక చివరివారంలో వచ్చిన ‘మస్తు షేడ్స్‌ ఉన్నాయ్‌ రా’, ‘రాజధాని ఫైల్స్‌’, ‘సిద్ధార్థ్‌ రాయ్‌’, ‘సుందరం మాస్టర్‌’ చిత్రాలేవి ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అయితే ఫిబ్రవరిలో ఈగల్‌, యాత్ర 2 తప్పితే మిగతావన్నీ అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిన్న చిత్రాలే రిలీజ్‌ కావడం గమనార్హం.

అలరించని సమ్మర్‌
సంక్రాంతి తర్వాత సమ్మర్‌ సీజన్‌ టాలీవుడ్‌కి చాలా ముఖ్యమైనది. దాదాపు మూడు నాలుగు పెద్ద సినిమాలైనా వేసవిలో విడుదలయ్యేవి. కానీ ఈ ఏడాది సమ్మర్‌లో ఒక్క స్టార్‌ హీరో సినిమా కూడా రిలీజ్‌ కాలేదు. మార్చి తొలివారం వరుణ్‌ తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అదేవారం భూతద్దం భాస్కర్‌ నారాయణ’, ‘చారి 111’, ‘ఇంటి నెంబర్‌ 13’లాంటి చిన్న సినిమాలు రిలీజ్‌ అయ్యాయి కానీ.. ఏ ఒక్కటి అలరించలేదు. 

(చదవండి: బాక్సాఫీస్ వద్ద కల్కి నయా రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?)

రెండోవారం గోపిచంద్‌ ‘భీమా’తో విశ్వక్‌ సేన్‌ ‘గామి’తో వచ్చాడు. వీటిల్లో భీమాకి ప్లాప్‌ టాక్‌ రాగా.. ‘గామి’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ బాక్సాఫీస్‌ వద్ద రెండు సినిమాలో బోల్తా పడ్డాయి. ఇక మూడో వారంలో రజాకార్‌, లంబసింగి, షరతులు వర్తిసాయి’తో పాటు అరడజనుకు పైగా చిన్న సినిమాలు రిలీజ్‌ అయినా..ఒక్కటి కూడా హిట్‌ కాలేదు. మూడో వారంలో రిలీజైన శ్రీవిష్ణు ‘ఓం భీమ్‌ బుష్‌’ థియేటర్లలో నవ్వులు పూయించింది. ఇక చివరి వారంలో వచ్చిన ‘టిల్లు స్వ్కేర్‌’ సూపర్‌ హిట్‌ కొట్టేసింది. బాక్సాపీస్‌ వద్ద దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ‘టిల్లుగాడు’ సత్తా చాటాడు.

ఏప్రిల్‌లో భారీ అంచనాలతో వచ్చిన విజయదేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్‌’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అదేవారంలో రిలీజైన భరతనాట్యం’, ‘బహుముఖం’ చిత్రాలు ప్లాప్‌ టాక్‌ని సంపాదించుకున్నాయి. రెండోవారంలో రిజీలైన  ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రం యావరేజ్‌ టాక్‌ని సంపాదించుకుంది. ఇక చివరి రెండు వారాల్లో ‘శ్రీరంగనీతులు’ ‘పారిజాతపర్వం’, ‘మార్కెట్‌ మహాలక్ష్మీ, తెప్ప సముద్రం చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగా..ఏ ఒక్కటి ఆకట్టుకోలేదు.

(చదవండి: పాన్‌ ఇండియాపై ‘మెగా’ ఆశలు)

మేలో తొలివారం  ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ అల్లరి నరేశ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా కాలం తర్వాత నరేశ్‌ నటించిన కామెడీ చిత్రమిది. మంచి అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఫ్లాప్‌ టాక్‌నే సంపాదించుకుంది. ఈ మూవీతో పాటు రిలీజైన సుహాస్‌ ‘ప్రసన్నవదనం’ చిత్రానికి మంచి టాక్‌ వచ్చినా.. వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది. ఒక సెకండ్‌ వీక్‌లో సత్యదేవ్‌ ‘కృష్ణమ్మ’తో పాటు ‘ఆరంభం’ అనే చిన్న చిత్రం విడుదలైన..తొలిరోజే నెగెటివ్‌ టాక్‌ని సంపాదించుకున్నాయి. ఇక నారా రోహిత్‌ హీరోగా నటించిన ‘ప్రతినిధి 2’ థియేటర్స్‌కి వచ్చిన విషయమే తెలియదు. 

ఆ తర్వాత వారంలో  ‘నట రత్నాలు’, ‘బిగ్‌ బ్రదర్‌’, ‘సీడీ’ ‘సిల్క్‌ శారీ’, ‘డర్టీ ఫెలో’, ‘బ్రహ్మచారి’తో పాటు మొత్తం అరడజను చిత్రాలు విడుదలైన ప్లాప్‌ టాక్‌ని మూటగట్టుకున్నాయి. గెటప్‌ శ్రీను తొలిసారి హీరోగా నటించిన ‘రాజు యాదవ్‌’ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక చివరివారం భజేవాయు వేగం, గం..గం..గణేశా, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి చిత్రాలు రిలీజ్‌ కాగా.. వీటిల్లో ‘భజే వాయు వేగం’ హిట్‌ టాక్‌కి సంపాదించుకుంది. 

ఇక జూన్‌ తొలివారం ‘సత్యభామ’ అంటూ కాజల్‌.. ‘మనమే’ అంటూ శర్వానంద్‌ ప్రేక్షకుల ముందుకు రాగా.. రెండు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేపోయాయి. అదేవారంలో లవ్‌ మౌళితో పాటు మరో రెండు చిత్రాలు రిలీజ్‌ అయ్యాయి కానీ.. ఏది హిట్‌ కాలేదు. రెండో వారంలో సుధీర్‌ బాబు ‘హరోం హర’తో పాటు ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి, నీ దారే నీ కథ, యేవమ్‌ చిత్రాలు రిలీజ్‌ అయ్యాయి. వీటిల్లో మ్యూజిక్‌ షాప్‌ మూర్తి విమర్శకులు ప్రశంసలు అందుకుంది. 

మూడోవారంలో నింద, ‘ఓ మంచి ఘోస్ట్‌’, ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’, ‘అంతిమ తీర్పు’ లాంటి పలు చిన్న సినిమాలు విడుదలైనా..ఏ ఒక్కటి అలరించలేదు. ఇక చివరి వారం మాత్రం టాలీవుడ్‌కి గుర్తిండిపోయే విజయాన్ని అందించింది. ప్రభాస్‌ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ జూన్‌ 27న విడుదలై హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 415 కోట్లను వసూళ్లు చేసి రికార్డ్‌ సృష్టిస్తోంది. 

మొత్తంగా ఈ ఆరు నెలల్లో హిట్ల కంటే ఎక్కువగా ఫ్లాపులే ఉన్నాయి. అయితే హనుమాన్‌, కల్కి 2898 చిత్రాలు మాత్రం చారిత్రాత్మక విజయాలను అందుకున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement