ఆధార్ చైర్మన్ సత్యనారాయణకు శ్రీసిటీ జ్ఞాపిక బహుకరిస్తున్న శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి
సత్యవేడు : ఆధార్ వ్యవస్థ పర్యవేక్షణ సాధికార సంస్థ యూనిక్ ఐడెంటికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా( యుఐడీఏఐ) చైర్మన్ జే. సత్యనారాయణ శనివారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికారు. సెజ్‌లో మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతి గురించి వివరించారు. అనంతరం ఆయన శ్రీసిటీ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీసిటీ ఒక గొప్ప ప్రాజెక్టని, దీని అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రమోటర్లను ప్రశంసించారు. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని ప్రతిబింబించేలా ఇక్కడ మంచి వసతులున్నాయని చెప్పారు. రవీంద్రసన్నారెడ్డి మాట్లాడుతూ సత్యనారాయణ 1990 ప్రాంతంలో తాను ఐటీ పరిశ్రమలో ఉన్నప్పుడు, ఆయన ఏపీ గవర్నమెంట్ ఉన్నతాధికారిగా పలు ఈ– గవర్నన్స్ ప్రాజెక్టులు సమర్థవంతంగా అమలు చేశారని తెలిపారు. గతంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచారశాఖ(డైటీ) కార్యదర్శిగా పనిచేసిన ఆయన ఎలక్ట్రాక్స్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్లు(ఈఎంసీ) ఏర్పాటు విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారని చెప్పారు.