అక్రమాలకు ఊతం | adhar connect miss of regestrations | Sakshi
Sakshi News home page

అక్రమాలకు ఊతం

Published Thu, May 11 2017 11:02 PM | Last Updated on Wed, Apr 3 2019 9:21 PM

అక్రమాలకు ఊతం - Sakshi

అక్రమాలకు ఊతం

– రిజిస్ట్రేషన్లకు తెగిన ‘ఆధార్‌’ బంధం
– మ్యానువల్‌గా తీసుకుని చేస్తున్న వైనం
– ఆందోళన చెందుతున్న సబ్‌ రిజిస్ట్రార్లు
– క్రయవిక్రయదారులదీ అదే పరిస్థితి


అనంతపురం టౌన్‌ : స్తిరాస్థి రిజిస్ట్రేషన్లకు ‘ఆధార్‌’ బంధం తెగింది. ఫలితంగా అక్రమాలు జరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖను పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. రిజిస్ట్రేషన్‌ శాఖలో అవినీతికి కళ్లెం వేసేందుకు ప్రభుత్వం ఏడాది క్రితం రిజిస్ట్రేషన్లకు ఆధార్‌ను తప్పనిసరి చేసి సంబంధిత డేటాతో అనుసంధానం చేశారు. కార్యాలయాల్లో భూములు అమ్మే వారు, కొనేవారి వివరాలను నమోదు చేయకుండా ఆధార్‌ నంబర్‌ నమోదు చేసేవారు. దీంతో ఆటోమేటిక్‌గా వివరాలన్నీ వచ్చేవి. ఈ తర్వాత ఆధార్‌లోని ఫొటోలు, రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన క్రయ, విక్రయదారులతో సరిపోల్చి డాక్యుమెంట్లను పరిశీలించి రిజిస్ట్రేషన్లు చేసేవారు.

మూడు రోజుల క్రితం యూఐడీఏఐ (యూనిక్‌ ఐడెంటిపికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) అధికారులు రిజిస్ట్రేషన్‌శాఖకు ఆధార్‌ సర్వర్‌ను నిలిపివేశారు. ఆధార్‌లో ఏమైనా తప్పులు ఉంటే సవరించడానికి అవసరమైన ఈకేవైసీ (ఎలక్ట్రానిక్‌ నో యువర్‌ కస్టమర్‌) సర్వర్‌ను సైతం ఆపేశారు. దీంతో రెండ్రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గిపోయాయి. అయితే బుధవారం సాయంత్రం నుంచి రిజిస్ట్రేషన్లకు సడలింపు ఇచ్చారు. గతంలో రిజిస్ట్రేషన్‌తో పాటు ఆధార్‌ నంబర్‌ నమోదు చేయగానే క్రయ, విక్రయదారుల పేరు, ప్రధానంగా ఫొటో స్క్రీన్‌పై వచ్చేవి. దీన్ని చూసుకున్న తర్వాత అధికారులు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టేవారు. ప్రస్తుతం సర్వర్‌తో సంబంధం లేకుండా మాన్యువల్‌గా డాక్యుమెంట్లకు ఆధార్‌ జిరాక్స్‌ ప్రతులను జత చేస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్రమాలు జరిగే అవకాశం ఉందన్న వాదన ఆ శాఖ అధికారుల నుంచే విన్పిస్తోంది.

కొందరు ఆధార్‌ కార్డుల్లో ఫొటోలు, పేర్లు మార్పు చేసి తీసుకొచ్చినా వాటి ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరిగిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో క్రయ, విక్రయదారులు కూడా నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు. గతంలో కూడా ఇలాంటి కొన్ని ఘటనలు జరిగాయని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆధార్‌ సర్వర్‌తో లింక్‌ లేకపోవడంతో సర్వర్‌లోకి వెళ్లి చెక్‌ చేసుకునే అవకాశం లేకుండాపోయిందని చెబుతున్నారు. ఈ క్రమంలో క్రయ, విక్రయదారులు తెచ్చిన ఆధార్‌ అసలుదా నకిలీదా? అన్నది తెలుసుకోవడం కష్టమవుతుందని అంటున్నారు. కొందరు ఆధార్‌ను ట్యాంపరింగ్‌ చేసే అవకాశమూ ఉందంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి యూఐడీఏఐ అధికారులకు కనీస మొత్తం చెల్లించాల్సి ఉంటుందని తెలిసింది. అయితే అది చెల్లించకపోవడంతోనే ఆధార్‌ లింక్‌ను తొలగించినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆధార్‌ నంబర్‌ లేకపోయినా పేర్లను కొట్టి రిజిస్ట్రేషన్‌ సాగిస్తున్నారు. అయితే ఒరిజినల్‌ కార్డులను పరిశీలిస్తున్నామని, అయినా కొంత ఆందోళన ఉందని కొందరు సబ్‌రిజిస్ట్రార్లు ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వం తక్షణం ఈ సమస్యను పరిష్కరిస్తే అక్రమాలకు తావులేకుండా ఉంటుందని చెప్పారు. అన్ని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఇళ్లు, స్థలాలు, భూములు తదితర స్థిరాస్తి క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు రెండ్రోజుల పాటు ఆగిపోవడంతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోయామన్నారు. ఈ రెండు రోజుల్లో శాఖ సుమారు రూ.8 కోట్ల వరకు ఆదాయాన్ని కోల్పోయిందన్నారు.

అక్రమాలకు అస్కారం ఉంది :
ఆధార్‌తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశాలు వచ్చాయి. దీనికి అనుగుణంగానే సర్వర్‌లో మార్పులు చేశారు. ఈ క్రమంలో అక్రమాలు జరిగే అవకాశం ఉంది. దీన్ని కొట్టిపారేయలేం. అక్రమార్కులు దీన్ని ఆసరాగా తీసుకునే అవకాశం ఉంది. అయినా సబ్‌రిజిస్ట్రార్లు ఒకటికి రెండు సార్లు పరిశీలించే రిజిస్ట్రేషన్లు చేస్తారు కాబట్టి సమస్య లేదు. వేలిముద్ర, ఇతర ప్రూఫ్‌లు తీసుకుంటున్నాం. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది.
– సులేమాన్, డీఐజీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement