జీజీహెచ్‌లో ఉచితంగా అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు
శనివారం ఆర్గాన్ డొనేషన్ డే
మనిషి చనిపోయాక తనతోపాటే శరీరంలోని అవయవాలన్నీ మట్టిలో కలిసిపోతాయి. లేదా చితిలో కాలి బూడిదవుతాయి. అయితే అవయవ దానం చేయడం వల్ల మరణం తర్వాతా జీవించవచ్చు. అవయవాలన్నీ వేరొకరి శరీరంలో ఉండటం వల్ల చనిపోయినా జీవించినట్లే లెక్క. విశ్వాసాలు, మూఢ నమ్మకాలు ఎలా ఉన్నా.. అవయవ దానంపై రోజురోజుకూ పెరుగుతున్న అవగాహనతో కొత్త అధ్యాయాలు ఆవిష్కతమవుతున్నాయి. ఈనెల 13న ఆర్గాన్ డొనేషన్ డే నిర్వహించనున్న నేపథ్యంలో అవయవ దానంపై ప్రత్యక కథనం.
గుంటూరు మెడికల్ : మనిషి మరణానంతరం కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్, జీర్ణ వ్యవస్థలోని ఫ్రాంకియాస్, పేగులు దానం చేయవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ డెత్‌గా నిర్ధారణ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. బ్రెయిన్ డెత్ కేసు అంటే మనిషి పూర్తిగా చనిపోయినట్లే లెక్క.
ఎంత సమయం పడుతుంది..
బ్రెయిన్ డెత్ వ్యక్తి నుంచి అవయవాలు బయటకు తీసేందుకు సుమారు ఐదు గంటల సమయం పడుతుంది. గుండె, లంగ్స్‌ను మూడు గంటల్లోగా అమర్చాలి. లివర్‌ను ఐదు నుంచి 8 గంటల లోపు, కిడ్నీలను 15 నుంచి 18 గంటల్లోపు అమర్చాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో సేకరించిన అవయవాలు పని చేయకుండాపోతాయి. కళ్ళు (కార్నియా) చాలా కాలం నిల్వ చేయవచ్చు. శరీరం నుంచి సేకరించిన అవయవ భాగాలను ‘యూడబ్ల్యూయూ సొల్యూషన్’ అనే చల్లని ద్రావకంలో ఉంచి ఐస్ బాక్సుల్లో భద్రం చేసి అవసరమైన వారికి అమరుస్తారు.
ఎలా రిజిష్ట్రరు కావాలి..
అవయవదానం చేయాలనుకునేవారు ముందస్తుగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తనకు తెలిసినవారందరికి విషమయాన్ని తెలియజేయాలి. దీనివల్ల అతను చనిపోయాక అవయవదానం చేసేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వం జీవన్‌ధాన్ అనే పథకాన్ని 2014లో ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా బ్రెయిన్ డెత్ కేసుల నుంచి అవయవాలు సేకరిస్తారు. వెబ్‌సైట్‌లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. వారికి ప్రభుత్వం ఆర్గాన్ డోనార్ కార్డును అందజేస్తుంది.
అవయవాలు కావాల్సి వస్తే..
అవయవాలు కావాల్సిన రోగులు కూడా ప్రభుత్వ జీవన్‌ధాన్ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేయించుకోవాలి. వారికి సీరియల్ నెంబరు ఇస్తారు. అవయవదానం చేసే కేసులు వచ్చినప్పుడు సీరియల్ నెంబరు ప్రకారం అవకాశం కల్పిస్తారు.
గుంటూరులో కేంద్రం..
జీవన్‌ధాన్ పథకం గుంటూరు జీజీహెచ్‌లో, మంగళగిరి రోడ్డులోని వేదాంత హాస్పటల్‌లో అందుబాటులో ఉంది. అవయవాలు కావాలనుకునేవారు అక్కడికి వెళ్ళి తమ పేర్లు నమోదు చేయించుకోవచ్చు. మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో, విజయవాడ అరుణ్ కిడ్నీసెంటర్‌లో జీవన్‌ధాన్ పథకం అమలులో ఉంది.
అవగాహన కల్పించాలి..
అనేక అపోహలతో అవయవ దానానికి ముందుకు రావడం లేదు. పురాణాల్లో, ఇతర మత గ్రంథాల్లో కూడా అవయవ దానం చేసిన ఆధారాలు ఉన్నాయి. దీనిపై ప్రచారం లేకపోవడంతో అవగాహన పెరగడం లేదు. దేశంలో ఏటా లక్షా 30 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడి బ్రెయిన్ డెత్ అవుతున్నారు. వీరిలో కేవలం 150 నుంచి 200 మంది మాత్రమే అవయవ దానం చేస్తున్నారు. కిడ్నీ వ్యాధితో భారత దేశంలో ఏటా 3 లక్షల మంది చనిపోతున్నారు. వీరికి బ్రెయిన్ డెత్ కేసుల నుంచి సేకరించినవి అమర్చి మరణాలను పూర్తిగా ఆపవచ్చు.
డాక్టర్ చింతా రామకృష్ణ, నెఫ్రాలజిస్ట్
జీజీహెచ్‌లో ఐదుగురికి కిడ్నీ ఆపరేషన్లు..
బ్రెయిన్ డెత్ కేసుల నుంచి సేకరించిన కిడ్నీలను అమర్చేందుకు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. గుండెను అమర్చేందుకు 3 గంటలు, లివర్‌కు 4 గంటలు, కళ్ళను అమర్చేందుకు కేవలం అర గంట సమయం పడుతుంది. కుటుంబ సభ్యులు ఇవ్వటం వల్ల జీజీహెచ్‌లో ఐదుగురికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌లు చేశాం. చనిపోయిన వారి నుంచి కిడ్నీలు సేకరించి ఆపరేషన్లు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ అపోహలు వీడి స్వచ్ఛందంగా అవయవదానం చేసేందుకు ముందుకు రావాలి.
డాక్టర్ గొంది శివరామకృష్ణ, నెఫ్రాలజిస్ట్