మధా్యహ్న సమయంలో సింహద్వారం తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యం
అహోబిలేశా..ఏమిటీ దుస్థితి!
Published Sun, Nov 20 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM
–తెరుచుకోని గర్భగుడి సింహద్వారం
- కానరాని తాళం
– విశ్వరూప దర్శనం లేకుండానే ఆలయంలో పూజలు
– మధ్యాహ్న దొడ్డిదారిలో వెళ్లి నిత్యపూజలు, ఆదారి గుండానే భక్తులకు దర్శనభాగ్యం
– సంపాదన మీదున్న ఆసక్తి గుడిపై ఉండకపోతే ఎలా అంటూ భక్తుల ఆగ్రహం
– పక్కదారిలో వెళ్లి స్వామిని దర్శించుకోవడం అపచారమని సిబ్బందితో వాగ్వాదం
అహోబిలం (ఆళ్లగడ్డ): అహోబిలం... ఈ మాట వినగానే భక్తులు పరవశించిపోతారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చి తమ ఇష్ట దైవం నరసింహస్వామిని దర్శించుకుని వెళ్తుంటారు. వారు సమర్పించే కానుకలు, చందాలతో క్షేత్రానికి ఏటా రూ. 20 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. అయితే, ఇంత ఆదాయం వస్తున్నా అధికార సిబ్బంది నిర్లక్ష్యంతో ఆలయంలో నిత్యం ఏదో ఒక అపశృతి జరుగుతూనే ఉంది. అయినా వారు ఇప్పటి వరకు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంతో దిగువ అహోబిలంలో వెలిసిన శ్రీ ప్రహ్లాదవరద స్వామి ఆదివారం విశ్వరూపసేవకు నోచుకోలేదు. భక్తులు సాయంత్రం వరకు దొడ్డి (భక్తులు బయటకు వచ్చే) దారి గుండా స్వామి వారిని దర్శించుకోవాల్సి వచ్చింది.
సాయంత్రం వరకు తెరుచుకోని సింహాద్వారం
ఎప్పటిలాగే తెల్లవారు జామున గుడి తలుపులు తెరిచేందుకు అర్చకులు వచ్చారు. సిబ్బంది తీసుకు వచ్చిన తాళాలతో ఎంత ప్రయత్నించినా అవి తెరుచుకోలేదు. దీంతో ఒరిజనల్ తాళాలు ఎక్కడో మాయమయ్యాయని భావించి మరో సెట్ తాళాలు తీసుకు రమ్మని ఈఓ కార్యాలయం దగ్గరకు పంపించారు. అయితే, అక్కడ అధికారి అందుబాటులో లేక పోవడంతో సిబ్బంది సక్రమంగా స్పందించలేదు. దీంతో తెల్లవారు జామునుంచి మధ్యాహ్నం వరకు స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. సుదూర ప్రాంతాలనుంచి వచ్చిన కొందరు భక్తులు సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్వామిని దర్శించుకుని వెలుపలకు వచ్చే ద్వారం గుండా భక్తులను లోపలకు పంపించారు.
స్వామికి విశ్వరూపదర్శనమేదీ?
ప్రతి రోజు రాత్రి స్వామిని మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య శయనోత్సవం గావించి గుడి తలుపులు మూసి వేస్తారు. తిరిగి తెల్లవారు జామున గుడి బయట శుభ్రపరిచి సుప్రభాత సేవ అనంతరం క్షేత్రంలో ప్రత్యేకంగా పెంచుతున్న గోమాతను తీసుకువచ్చి పూజించి, ప్రత్యేక పూజలు నిర్వహించి సింహాద్వారం ఎదురుగా తలుపులు తీసిన వెంటనే ఆవు వెనుక భాగం కనిపించే విధంగా ఉంకి తలుపులు తీయడాన్ని విశ్వరూప దర్శన మంటారు. ఆవు వెనుక వైపు మహాలక్ష్మీ ఉంటారని స్వామి ఆ అమ్మవారిని చూసి మేల్కొంటారిని నమ్మకం. అనంతరమే అర్చకులు లోపలికి వెళ్లి దూప,దీప, నైవేద్యాలు అందజేయాల్సి ఉంటుంది. తరువాత భక్తులు స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే ఆదివారం స్వామి వారికి ఇలాంటి కార్యక్రమాలు ఏవీ చేయలేదు. దీంతో ఎక్కడ అరిష్టము జరుగుతుందోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు
ద్వారపాలకు అనుమతి లేదు
విశ్వరూప దర్శనం అనంతరం గుడిలోకి మొదటగా అడుగు పెట్టే అర్చకులు ద్వార పాలకుల అనుమతి తీసుకుని లోపలికి వెళ్లి పూజలు మొదలు పెట్టాలి. అలాంటిదేమీ లేకుండా ప్రధాన అర్చక బృందం పక్క దారిలో వెళ్లి పూజలు మొదలు పెట్టడం పలు విమర్శలకు తావిస్తోంది. దీనికంతటికి కారణం అ«ధికారులు స్థానికంగా ఉండి పర్యవేక్షించక పోవడంతో పాడు అప్పుడప్పుడు చుట్టపుచూపులా వచ్చి పోతుండటం సిబ్బంది, అర్చకులు వారికి తోచిన విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మామూలే జరుగుతుంటాయి: వేణుగోపాలన్ – ప్రధాన అర్చకులు
గర్భగుడి తాళాలు స్ట్రక్ కావడంతో తెరుచుకోలేదు. దీంతో ప్రధాన ద్వారం స్థానంలో పక్కనున్న ద్వారం గుండా దర్శన భాగ్యం కల్పిస్తున్నాం. అయితే, ఇవన్నీ మామూలే. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. ఏం చేస్తాం.
Advertisement
Advertisement