బంగాళాఖాతంలో గల్లంతైన వాయుసేన (ఏఎన్-32) విమాన శకలాలను గుర్తించేందుకు మరో ప్రయత్నం మొదలుకానుంది. రిమోట్ కంట్రోలర్ల సాయంతో పనిచేసే యంత్రాలను ఉపయోగించి కొన్ని అనుమానిత ప్రాంతాల్లో విమాన శకలాలను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనుమానిత ప్రాంతాల గుర్తింపు, రిమోట్ యంత్రాల గుర్తింపునకు నిపుణుల బృందాలు రెండు పనిచేస్తున్నాయి. అన్నీ సవ్యంగా సాగితే మరో వారం రోజుల్లోపు ఈ గాలింపు చర్యలు ప్రారంభం కానున్నాయి.
ఈ ఏడాది జూలై 22న దాదాపు 29 మందితో చెన్నై నుంచి పోర్ట్‌బ్లయిర్‌కు బయలుదేరిన వాయుసేన విమానం సుమారు 150 మైళ్ల దూరంలో గల్లంతైన విషయం తెలిసిందే. విమాన శకలాలను గుర్తించేందుకు అప్పటి నుంచి ఎన్నో విఫలయత్నాలు జరిగాయి. తాజాగా జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ)లు మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొంత కసరత్తు పూర్తి చేసింది. ఇరు సంస్థలకు చెందిన సాగర్ రత్నాకర్, సాగర్ నిధి నౌకలు దాదాపు లక్షల చదరపు కిలోమీటర్ల సముద్రగర్బాన్ని సోనార్ టెక్నాలజీ ద్వారా మ్యాప్ చేసేసింది. ఈ మ్యాప్‌ను అధ్యయనం చేసిన ఎన్‌ఐఓటీ ఇంత విస్తీర్ణంలో దాదాపు 70 ప్రాంతాల నుంచి కొంచెం అనూహ్యమైన సంకేతాలు అందుతున్నట్లు గుర్తించింది. వేర్వేరు టెక్నాలజీలతో మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాత వెతకాల్సిన ప్రాంతాల సంఖ్యను 22కు తగ్గించింది.
రిమోట్ కంట్రోలర్ల సాయంతో పనిచేసే యంత్రాల ద్వారా ఈ 22 ప్రాంతాల్లో శకలాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తామని ఎన్‌ఐఓటీ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ ఎస్‌ఎస్‌సి. షెనాయ్ ‘సాక్షి’కి తెలిపారు. నౌకల నుంచి పొడవాటి ఇనుప తీగల ద్వారా ఈ యంత్రాలు దాదాపు 3 నుంచి 5 కిలోమీటర్ల లోతుకు వెళ్లి పరిశీలనలు జరుపుతాయి. ఒక్కో యంత్రం దాదాపు పది మీటర్ల వైశాల్యంలోని ప్రాంతాన్ని పరిశీలించగలదని షెనాయ్ తెలిపారు. ప్రస్తుతం తాము అనుమానిత ప్రాంతాల సంఖ్యను మరింత నిశితంగా పరిశీలిస్తున్నామని, సముద్రగర్భలోని సహజ నిర్మాణాల ద్వారా వచ్చే సంకేతాలను తొలగించి... శకలాలు ఉన్న ప్రాంతాలను కచ్చితంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. రిమోట్ యంత్రాలను ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు ఎక్కువ సమయం పడుతుందని, కాబట్టి ఈ కచ్చితత్వం అవసరమని వివరించారు. విమానం ముక్కలు ముక్కలై ఉంటే శకలాలు కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో చెల్లాచెదురయ్యే అవకాశముందని అటువంటి పరిస్థితుల్లో వీటిని గుర్తించడం కూడా అంతే కష్టమవుతుందని అన్నారు.
జియో మ్యాపింగ్ తో ఏఎన్- 32 శకలాల గుర్తింపు
Published Fri, Sep 9 2016 6:08 PM | Last Updated on Mon, Apr 8 2019 7:50 PM
Advertisement