విమాన ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేస్తున్న ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది
రేణిగుంటలో విమాన సర్వీసులు పునరుద్ధరణ
Published Mon, Sep 19 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
రేణిగుంట: ఎట్టకేలకు రేణిగుంట నుంచి విమానాలు ఎగిరాయి. ఈనెల 17న స్పైస్‌జెట్ విమానమొకటి రన్‌వేలో ముందుకు దూసుకుపోయి చక్రాలు బురదలో కూరుకుపోయి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తిరుపతికి విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా 27 గంటల పాటు ప్రయాణికులు అవస్థ పడ్డారు. ఆదివారం రాత్రి 11గంటలకు ఎయిర్ ఇండియా విమానం రన్‌వేపై లాండ్ అయింది. అదుపు తప్పి రన్‌వేను దాటి వెళ్లి బురదలో కూరుకుపోయిన విమానాన్ని అతికష్టం మీద∙ఎయిర్‌పోర్టు అధికారులు రన్‌వే మీదకు తీసుకొచ్చారు. సోమవారం మరమ్మతు పనులను ఇంజినీర్లు చేపట్టారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు చెన్నై డీజీసీఏ, డీసీఎస్ నుంచి విచారణ అధికారులు చేరుకున్నారు. ఆదివారం పూర్తిగా ఎయిర్‌పోర్టులో తిష్టవేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. విమానం నడిపిన ఇద్దరు పైలట్లను విచారించారు. వీరు తమ నివేదికను పౌరవిమానయాన శాఖ ఉన్నతాధికారులకు వెంటనే నివేదించనున్నారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్ పుల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. విమాన రాకపోకలు నిర్ణీత సమయంలో జరుగుతుండటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement