చక్కటి వీకెండ్ స్పాట్.. అలీసాగర్ | alisagar to be visited as weekend spot | Sakshi
Sakshi News home page

చక్కటి వీకెండ్ స్పాట్.. అలీసాగర్

Published Sun, Jul 17 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

చక్కటి వీకెండ్ స్పాట్.. అలీసాగర్

చక్కటి వీకెండ్ స్పాట్.. అలీసాగర్

వర్షంతో తడిసిన నేలపై పచ్చిక రంగుల ప్రయాణం సాగుతున్నంత సేపు ఆహ్లాదాన్ని పంచుతూనే ఉంటాయి. మనసులో ఊహించుకోవడం కన్నా అలా ఇంటి నుంచి బయలుదేరితే ఆ ఆనందాన్ని హాయిగా ఆస్వాదించవచ్చు, రిఫ్రెష్ కావచ్చు అనుకుంటే ఈ సారి నిజామాబాద్ జిల్లాలోని అలీసాగర్  చక్కటి వీకెండ్ స్పాట్.      - ఓ మధు
 
హైదరాబాద్ చుట్టుపక్కల పరిసరాలు మొన్నటి వరకు ఎండలకు బోసిపోయినా... ఇప్పుడు జలసిరితో పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. నిండైన నీటితో రిజర్వాయర్.. పరుగులెత్తుతూ ప్రకృతి ఒడిలో అల్లరి చేసే జింక పిల్లలు... పిల్లలకు నచ్చే బోటింగ్, ఆడుకోవడానికి గార్డెన్... ఇలా చిన్నా పెద్ద అందరికీ నచ్చే పిక్నిక్ స్పాట్ అలీసాగర్...
 
ద్వీప సహితం...
 నిజాం 1931లో నిర్మించిన ఉపయుక్తమైన నీటిపారుదల ప్రాజెక్ట్ అలీసాగర్. ఈ ప్రాజెక్ట్‌కి పోచంపాడు బ్యాక్ వాటర్స్ నీరందుతుంది. అలీసాగర్ కేవలం నీటి వనరుల వినియోగానికి మాత్రమే కాకుండా మనసు దోచే అందమైన దృశ్యాలకు కూడా నెలవు. ఈ సాగర్‌కు మధ్యలో ఉన్న ముచ్చటగొలిపే చిన్న ద్వీపం కొత్త అనుభూతిని అందిస్తుంది. అంతేకాకుండా సాగర్‌లో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన బోటింగ్, రివర్ క్రాసింగ్‌లతో పాటు సమీప ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌కూ అవకాశం ఉంది. తద్వారా సాహసికులకు, ప్రకృతి ప్రేమికులకు నచ్చేలా రూపొందిన ఈ స్పాట్‌కి శని, ఆదివారాల్లో సందర్శకులు అధికంగా వస్తుంటారు.
 
కలర్‌ఫుల్ గార్డెన్...

నిజాం హయంలో 1928లో ఏర్పాటు చేసిన ఉద్యానవనం ఇక్కడ చెప్పుకోదగిన విశేషం. దాదాపు 33 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ గార్డెన్ జిల్లాలోనే అతి పెద్ద ఉద్యానవనం. మధ్య మధ్యలో వాటర్ ఫౌంటేన్స్, రకరకాల పూల చెట్లతో కలర్‌ఫుల్‌గా ఉంటుందీ గార్డెన్. అలీసాగర్ పరిసరాల్లో ఉన్న జీవజాలంతో పాటు, అక్కడి జింకలకు హాని కలుగకుండా ఏర్పాటు చేసిన పార్క్ కూడా ఆకట్టుకుంటుంది. దీనిని 1985లో ఏర్పాటు చేశారు. అటు రంగురంగుల పూల వనంతో పాటు అక్కడే ఉన్న ఈ జింకల స్థావరం కూడా సందర్శకులను ఆకట్టుకుంటుంది.
 
ఉద్యానవనం, సరస్సు, జింకల పార్కు, బోటింగ్... మనసుని రిఫ్రెష్ చేసే వాతావరణం.. వెరసి కుటుంబ సమేతంగా గానీ, స్నేహబృందాలు గానీ ఆనందించేందుకు అన్ని విధాలా అనువైన చక్కటి వీకెండ్ స్పాట్ అలీసాగర్ రిజర్వాయర్. మన నగరానికి  దాదాపు 200 కి.మీ దూరంలో ఉన్న అలీ సాగర్ డ్యాం చేరుకోవడానికి రవాణా సౌకర్యాలకు కొదవలేదు. నగరం నుంచి నిజామాబాద్‌కు వెళితే అక్కడి నుంచి 13 కి.మీ దురంలో ఉన్న అలీసాగర్‌కు కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే బస్సు లేదా ప్రైవేటు వాహానాల్లో చేరుకోవచ్చు.
 
 
 

Advertisement

పోల్

Advertisement