సౌందర్యాల సాగర్
వేసవిలో పెట్టే ఆవకాయ సంవత్సరమంతా రుచే.. అలాగే హైదరాబాదీలకు కూడా నాగర్జునసాగర్ ఎవర్‌గ్రీన్ వీకెండ్ స్పాట్. ఎందుకంటే ఈ డెస్టినేషన్ అంత ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. సముద్రాన్ని తలపించే సాగర్‌లో బోటింగ్ చేస్తూ వారాంత శ్రమను ఇట్టే మరిచిపోవచ్చు.. ఆనందాన్ని ఆస్వాదించొచ్చు. - ఓ మధు
కుడి ఎడమల కలయిక..
సిటీ నుంచి మూడు నాలుగు గంటల్లో నాగార్జున సాగర్ డ్యాంకు చేరుకోవచ్చు. డ్యాం 26 గేట్లతో 490 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ అసామాన్య నిర్మాణం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. దేశంలోని అతిపెద్ద డ్యాంలలో ఇది చోటు దక్కించుకోవడం విశేషం. డ్యాంకు ఎడమ, కుడి రెండు కాలువలు ఉంటాయి. దగ్గరి నుంచి నాగార్జునసాగర్‌ను చూస్తే ఓ చిన్న సముద్రాన్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
సాగర్ ఒడిలో సరదా విహారం..
నాగార్జునసాగర్‌లో బోటింగ్ ఓ అద్భుత విహారం. బోట్‌లో 40 నిమిషాల ప్రయాణం తర్వాత ఒక చిన్న ద్వీపం వస్తుంది. అక్కడ కనిపించే విరిగిపడిన రాళ్లు గత చరిత్రను చాటి చెబుతాయి. అది శాతవాహనుల కాలం నాటి శ్రీపర్వతమని, రెండో శతాబ్ధిలో బౌద్ధ ఆచార్యుడు నాగార్జునుడు విద్యాబోధన చేసిన స్థలమని ప్రతీతి. ప్రస్తుతం దీనిని నాగార్జున కొండగా పిలుస్తున్నారు. డ్యాం నిర్మాణ సమయంలో లభించిన ఆనాటి అవశేషాలను కొండపై మ్యూజియంలో భద్రపరిచారు. మ్యూజియాన్ని సందర్శించి అక్కడి వ్యూపాయింట్‌ను చేరుకుంటే మనం విదేశాల్లో ఉన్నామా? అన్న అనుమానం కలుగుతుంది. కొండల నడుమ కనుచూపు మేరలో కనిపించే జలసిరి మనసుకు హాయినిస్తుంది. సమీపంలోనే మాచెర్లకు వెళ్లే దారిలో ఎత్తిపోతల జలపాతాలున్నాయి. వర్షాభావం వల్ల నీరు తక్కువగా ఉన్నా.. 70 అడుగుల ఎత్తులో ఉండే ఈ జలపాతాలు మానసిక ఉల్లాసాన్నిస్తాయి. సిటీకి దాదాపు 165 కి.మీ దూరంలో ఉందీ నాగార్జునసాగర్. శని, ఆదివారాల్లో దీని సందర్శనకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.