కాల్చివేసిన నల్లాకనెక్షన్ల ప్రొసీడింగ్స్ కాపీలు
► మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయం ఆవరణంలో ఘటన
మల్కాజిగిరి: మన ఇంట్లో ఎలుక చస్తే తీసి దూరంగా పడేస్తాం... అంతేగాని ఇంట్లోని సామగ్రి అంతా బయటవేసి తగులబెట్టం. ఘనత వహించిన ఓ అధికారి తాను విధులు నిర్వహించే రూమ్‌లో ఎలుక చనిపోయిందనే సాకుతో ఆ రూమ్‌లోని విలువైన రికార్డులను కార్యాలయ ఆవరణలో వేసి తగులబెట్టించాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయ ఆవరణలో జరిగింది. వివరాలు... 2007–08 సంవత్సరంలో నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కనెక్షన్ మంజూరు చే సిన తర్వాత మున్సిపల్ కమిషనర్ సంతకం చేసిన ప్రొసీడింగ్స్ కాపీ నకలు మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయంలోని యూజీడీ విభాగంలో భద్రపరిచారు. వీటిని మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనమైన సమయంలో జలమండలి అధికారులకు అందజేయాల్సి ఉన్నా..
అలా చేయలేదు. ప్రొసీడింగ్ కాపీలు పోగొట్టుకున్నవారు, నల్లా కనెక్షన్ కోసం ఫీజు చెల్లించిన వారు పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగితే, తమ వద్దే వాటిని ఉంచుకున్న అధికారులు అందుబాటులో లేవని చెప్పారు. దీంతో దరఖాస్తుదారులు మళ్లీ ఫీజు చెల్లించి నల్లా కనెక్షన్ పొందారు. ఇదిలా ఉండగా, యూజీడీ విభాగంలోని తన గదిలో ఎలుక చనిపోయిందనే సాకుతో అక్కడ ఉన్న పత్రాలను ఓ అధికారి సర్కిల్ కార్యాలయం ఆవరణంలోని పారిశుధ్య విభాగం పర్యవేక్షణ అధికారి చాంబర్ వెనుక ఖాళీ ప్రదేశంలో కుప్పగా పోసి తగుల బెట్టించాడు. ఎంతో ముఖ్యమైన పత్రాలను ఇలా ఇష్టారాజ్యంగా తగులబెట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని సర్కిల్ కమిషనర్, జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందింలేదని ప్రజలు వాపోతున్నారు.