అణచివేత ధోరణిని సహించం
అణచివేత ధోరణిని సహించం
Published Fri, Jul 28 2017 11:48 PM | Last Updated on Tue, May 29 2018 4:40 PM
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని
చినమిల్లి నిరాహార దీక్షకు మద్దతు
ఆశయ సాధనకే ముద్రగడ పోరాటం
భీమవరం:
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించకుండా అణచివేత ధోరణితో వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) తీవ్రంగా దుయ్యబట్టారు. కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గృహనిర్బంధాన్ని నిరసిస్తూ జిల్లా కాపునాడు అధ్యక్షడు చినమిల్లి వెంకట్రాయుడు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం గ్రామంలో చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షా శిబిరాన్ని శుక్రవారం సాయంత్రం నాని సందర్శించి వెంకట్రాయుడుకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నాని విలేకర్లతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాపులను బీసీల్లో చేరుస్తామంటూ చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని, ఆయన అధికారం చేపట్టి మూడేళ్లు గడిచిపోయినా ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చే విషయంలో తాత్సారం చేయడం వల్లనే ముద్రగడ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆశయ సాధన కోసం పోరాడుతున్నారన్నారు. ముద్రగడ శాంతియుతంగా చేపట్టిన పాదయాత్రను పోలీసు బలగాలతో అడ్డుకోవడమేగాక గృహ నిర్బంధం చేయడం దారుణమన్నారు. కాపు ఉద్యమం, తుందుర్రులో రొయ్యల ఫ్యాక్టరీ నిర్మాణం నిలుపుదల విషయం, గరగపర్రులో దళితుల సాంఘిక బహిష్కరణ ఘటనలలో ప్రజలను అణగదొక్కడానికి ప్రభుత్వం పోలీసు బలగాలను దింపి ఉద్రిక్తత పరిస్థితులు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని నాని విమర్శించారు. మరొక పక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పనలో బీసీలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమిళనాడు తరహాలో ప్రత్యేక కేటగిరిలో రిజర్వేషన్లు కేటాయించడంగాని, రిజర్వేషన్ల శాతాన్ని పెంచి కాపులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని నాని డిమాండ్ చేశారు.
నా దీక్ష భగ్నం చేస్తే అన్ని మండలాల్లో నిరవధిక దీక్షలు.....
తాను చేపట్టిన నిరవధిక నిరహార దీక్షను భగ్నం చేస్తే అన్ని మండల కేంద్రాల్లో కాపు సంఘాలు నిరవధిక దీక్షలు చేపడతాయని కాపుసంఘం జిల్లా అధ్యక్షుడు చినమిల్లి వెంకట్రాయుడు స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని మద్దతు ప్రకటించిన సందర్భంగా రాయుడు మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా తనను పోలీసులు గృహ నిర్బంధం చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాపుజాతి కోసం తాను చేట్టిన దీక్షకు జిల్లా వ్యాప్తంగా అనేకమంది కాపు నాయకులు తరలివచ్చి మద్దతు ప్రకటించడంతో తనకు మరింత బలం చేకూరిందన్నారు. తాను ఆరోగ్యవంతంగా ఉన్నానని అయినప్పటికీ అనేక పర్యాయాలు వైద్యులు పరీక్షలు, పోలీసుల పహారాతో విసుగు ఏర్పడుతోందని నానికి వివరించారు. తన దీక్షను భగ్నం చేస్తే ముందుగా 48 మండలాల్లో దీక్షలు ప్రారంభమవుతాయని, ఆ తరువాత గ్రామాల్లో దీక్షలు చేస్తారని చెప్పారు. నాని వెంట భీమవరం, ఉండి, ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్లు గ్రంధి శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, పుప్పాల వాసుబాబు, పేరిచర్ల విజయనర్సింహరాజు, పేరిచర్ల సత్యనారాయణరాజు, కొప్పర్తి సత్యనారాయణ, రేవూరి గోగురాజు తదితరులున్నారు.
Advertisement