ఆద్యంతం గందరగోళం
- టీడీపీ నేతల్లో లోపించిన ఐక్యత
- జిల్లా మహానాడులో ఎవరికివారు యమునా తీరే
- సోమిశెట్టికి అధ్యక్ష పదవి ప్రకటన వాయిదా
కర్నూలు: మాసమసీదు సమీపంలోని ఎంఆర్‌సీ ఫంక‌్షన్ హాలులో బుధవారం... టీడీపీ జిల్లా మహానాడు కార్యక్రమం ఆద్యంతం గందరగోళంగా నడిచింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వర్ల రామయ్య, పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ, పార్టీ పరిశీలకులు గోవర్ధన్‌రెడ్డి అతిథిలుగా హజరయ్యారు. ముందుగా పార్టీ జెండావిష్కరణ, దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌కు నివాళి, సంతాప తీర్మానం అనంతరం సభ ప్రారంభమైంది. హాజరైన నేతలంతా ప్రసంగించిన వెంటనే పెళ్లిళ్లు, సొంత పనులంటూ ఎవరికి వారుగా వెళ్లిపోయారు. పాస్‌పోర్టు కోసం హైదరాబాద్‌కు వెళ్తున్నానంటూ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమంలో హాజరు కావాల్సి ఉన్నందున కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రసంగించి వెళ్లిపోయారు.
ఇదిలా ఉండగా.. టీడీపీ కార్యకర్తలకు రూ.10 లక్షలలోపు నామినేషన్ పద్ధతిలో పనులు ఇచ్చే విధంగా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకున్నారని ఆదోని నియోజకవర్గ ఇన్‌చార్జ్ మీనాక్షి నాయుడు తెలిపారు. మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ మాట్లాడుతూ మంత్రి వర్గంలో మైనార్టీలకు స్థానం కల్పించకపోవడంతో పార్టీ చెడ్డపేరు వస్తోందన్నారు. జిల్లాలో ఉర్దూ కళాశాలలు లేకుండానే ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. జిల్లా పరిషత్ చైర్మెన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, జయ నాగేశ్వర్‌రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్‌లు వీరభద్రగౌడ్, తిక్కారెడ్డి, బీటీ నాయుడు, మాండ్ర శివానందరెడ్డి, లబ్బి వెంకటస్వామి, డి.విష్ణువర్థన్‌రెడ్డి, తిక్కారెడ్డి, కేడీసీసీ చైర్మెన్ మల్లికార్జునరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరావు యాదవ్, మాజీ ఎమ్మెల్సీలు మసాల పద్మజ, సుధాకర్‌బాబు, టీడీపీ క్రమశిక్షణ సంఘం కేంద్ర కమిటీ సభ్యుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు ప్రసంగించారు. రాష్ట్ర మహానాడుకు తీర్మానాలను ప్రతిపాదించారు.
సోమిశెట్టికి అధ్యక్ష పదవి ప్రకటన వాయిదా...
ఇన్‌చార్జిమంత్రి కాల్వ శ్రీనివాసులు ఆదేశాల మేరకు చివరి నిమిషంలో శిల్పా చక్రపాణిరెడ్డి అధ్యక్షతన జిల్లా మహానాడు నిర్వహించారు. జిల్లా నాయకులంతా కలిసి ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్ష పదవికి సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేరును ప్రతిపాదించి అధిష్టానంకు పంపినప్పటికీ ప్రకటన వాయిదా పడింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల అధ్యక్షుల పేర్లు చంద్రబాబు ప్రకటించనున్నారని అందువల్ల సోమిశెట్టి పేరు ప్రకటించడం వాయిదా వేసినట్లు చక్రపాణిరెడ్డి ప్రకటించారు.