అమలాపురం మున్సిపల్ చైర్మన్‌గా గణేష్
-
ఏకగ్రీవంగా ఎన్నిక
-
అనంతరం ప్రమాణ స్వీకారం
-
హాజరైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు
అమలాపురం టౌన్ :
అమలాపురం మున్సిపల్ చైర్మన్‌గా సీనియర్ కౌన్సిలర్ చిక్కాల గణేష్ గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నిక అధికారి, ఆర్డీవో జి.గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో చైర్మన్ అభ్యర్థిగా గణేష్ ఒక్కరే కావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 29 కౌన్సిలర్లకు 21 మంది టీడీపీవారే కావడంతో ఐదు నిమిషాల్లో ఈ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. పాలక పక్షానికి చెందిన రెండో వార్డు కౌన్సిలర్ ఆశెట్టి ఆదిబాబు చైర్మన్ అభ్యర్థిగా చిక్కాల గణేష్‌ను ప్రతిపాదించగా 23వ వార్డు కౌన్సిలర్ దంగేటి విజయగౌరి గణేష్ పేరును బలపరిచారు. అలాగే ఎన్నికల అధికారి, ఆర్డీవో గణేష్‌కుమార్ ప్రతిపక్ష కౌన్సిలర్లను కూడా మీలో ఎవరి పేరైనా ప్రతిపాదన ఉందా...? అని ప్రశ్నించగా కౌన్సిల్ ప్రతిపక్ష నేత చెల్లుబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ అలాంటదేమీ లేదని స్పష్టం చేశారు. అంతకు ముందు ఎన్నికల నిబంధనలను ఆర్డీఓ వివరించారు. ఎక్స్ అఫీషియో సభ్యుని హోదాలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఎమ్మెల్సీ కె.రవికిరణ్‌వర్మ ఎన్నిక ప్రక్రియలో పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల అధికారి గణేష్‌కుమార్ గణేష్ చేత మున్సిపల్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్‌ను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతోపాటు మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పెచ్చెట్టి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మెట్ల రమణబాబు తదితర టీడీపీ నాయకులు, పట్టణ ప్రముఖలు అభినందించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో చైర్మన్ గణేష్‌ను పుర వీధుల్లో భారీ ఎత్తున ఊరేగించారు.