
రాములోరిని వెళ్లగొట్టారు !
పురాతన ఆలయం, విగ్రహాల తొలగింపు
మధనపడుతున్న మాదనపాళెం గ్రామస్తులు
‘ ఊళ్లోని దేవుడిని ఊరికి దూరంగా సాగనంపారు. గ్రామస్తులు కొందరిని జైలుపాలుచేశారు’ అంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు మాదనపాళెం గ్రామస్తులు. శతాబ్ద కాలంగా పూజలు అందుకున్న శ్రీరాములుగుడి తొలగింపుపై మధనపడుతున్నారు.
మాదనపాళెం(సత్యవేడు) : మండలంలోని చెరివి పంచాయతీలోగల మాదనపాళెంలోని శ్రీరాములు గుడికి ఆ రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబరు–1లో 630 ఎకరాల మా న్యం భూములు ఉన్నాయి. 120 ఏళ్లకు మునుపు సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుని విగ్రహాలు ఆ గుడిలో ప్రతిష్ఠించినట్లు గ్రామపెద్దల సమాచారం. అప్పటి నుంచి నిత్యపూజలు, శ్రీరామ నవమికి విశేషపూజలు నిర్వహిస్తున్నారు. పూజారికి వాయనం కూడా గ్రామస్తులంతా కలిసి ఇస్తున్నారు. ఇరవై ఏళ్ల కిందట విగ్రహాలు చోరీ అయితే, గ్రామస్తులు మళ్లీ విగ్రహాలు తయారుచేయించి ప్రతిష్ఠిం చారు. ఈ గుడికే ప్రత్యేకంగా 3–14 ఎకరాలు, సర్వే నంబరు 3లో 5.50 ఎకరాల గ్రామనత్తం ఉంది. శ్రీరామ నవమి ఉత్సవాల నిర్వహణకు ఈ స్థలాన్ని వినియోగించుకుంటున్నారు.
ఏపీఐఐసీకి భూముల కేటాయింపుతో...
మాదనపాళెం సర్వే నంబరు–1లోని 630 ఎకరాల భూములను ప్రభుత్వం ఏపీఐఐసీకి కేటాయించింది. ఏపీఐఐసీ హీరో మోటార్స్‌కు ఈ స్ధలాన్ని కేటాయించింది. ఆరు కోట్ల రూపాయలతో ఆ భూముల చుట్టూ ప్రహరీగోడ నిర్మాణానికి పూనుకున్నారు. దేవాలయానికి ప్రత్యేకంగా ఉన్న భూమి 3–14 ఎకరాలు, గ్రామనత్తం 5–50 ఎకరాలు వదిలి మిగతా భూములు హీరో కంపెనీకి కేటాయిం చాలని తొలి నుంచి గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఆందోళనను పట్టించుకున్న పాపానపోలేదు.
కేసులు. అరెస్టులు
ఏటాలాగే ఈసారీ శివరాత్రి పూజలు నిర్వహించేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంలో ప్రభుత్వం దేవాలయానికి వెళ్లే మార్గం మూసివేసే పనులు చేపట్టింది. దీంతో ఆగ్రహించిన ప్రజలు దేవాలయదారికి అడ్డంగా ఉన్న గోడను తొలగించారు. శివరాత్రి పూజలు నిర్వహిం చారు. భక్తిశ్రద్ధలతో జాగారం ఉన్నారు. పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేశారంటూ పోలీసులు తొలుత గ్రామస్తులు 25 మందిపై, ఆపై మరో పది మందిపై కేసులు బనాయించారు. అందులో 13 మందిని మూడు రోజులకు మునుపు జైలుకు పంపారు.
విగ్రహాల తొలగింపులో అపశ్రుతి : ఇద్దరికి గాయాలు
ఆదివారం అమావాస్య రోజున గుడిలో విగ్రహాలను దేవాదాయశాఖ అధికారులు, స్ధానిక రెవెన్యూ అధికారులు, పోలీసు బందోబస్తుతో తొలగించారు. నూతనంగా నిర్మిస్తు న్న మరో దేవాలయం వద్ద గదిలో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. విగ్రహాలను మరోచోటికి తరలించిన అధికారు లు దేవాయలం ముందు ఉన్న శక్తిపీఠాన్ని తొలగించేం దుకు ప్రయత్నించారు. జేసీబీ తొట్టె విరిగిపడింది. ఇద్దరు గాయలపాలయ్యారు. జేసీబీ డ్రైవర్ శక్తి పీఠాన్ని తొలగించేందుకు భయపడి వెళ్లిపోయాడని సమాచారం.
అంతా దేవుడే చూస్తాడు
తరతరాలుగా గ్రామస్తులు పూజించుకుంటున్న సీతారాముల గుడిని తొలగించేందుకు పూనుకున్న ప్రభుత్వంపై స్థానికులు మండిపడుతున్నారు. తమకు దేవుడిని దూరం చేసిన పెద్దలకు భగవంతుడు పదవులు దూరం చేయకుం డా వదలడని శాపనార్థాలు పెడుతున్నారు.