రాష్ట్రంలో తొలిసారిగా ఐబీఎల్ తరహాలో ఏబీఎల్
రాష్ట్రంలో తొలిసారిగా ఐబీఎల్ తరహాలో ఏబీఎల్
Published Mon, Apr 17 2017 10:27 PM | Last Updated on Sat, Jun 2 2018 2:08 PM
ఏపీబీఏ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి పోటీలు
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల పేర్లతో ఐదు ఫ్రాంచైజీలు
గోదావరి జిల్లాల ఫ్రాంచైజీ టీఎన్‌రెడ్డి ‘‘గోదావరి గన్స్’’
రాజమహేంద్రవరంలో ఈ నెల 23న హోం టీమ్ పోటీలు
ఏపీబీఏ ఉపాధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి వెల్లడి
రావులపాలెం(కొత్తపేట) : ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్(ఐబీఎల్) తరహాలో రాష్ట్రంలో తొలిసారిగా ఆంధ్ర బ్యాడ్మింటన్ లీగ్(ఏబీఎల్) పేరుతో ఈ నెల 19 నుంచి పోటీలు ప్రారంభంకానున్నాయి. బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి చేపడుతున్న చర్యల్లో భాగంగా టీజీవీ భరత్ ఆంధ్ర బ్యాడ్మింటన్ లీగ్ పేరుతో రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో ఐదు జట్లతో ఈ పోటీలు ఈ నెల 27 వరకూ నిర్వహిస్తున్నట్టు ఏపీబీఏ ఉపాధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి వెల్లడించారు. సోమవారం సాయంత్రం ఆయన రావులపాలెంలో ఏర్పాటు చేసి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల కర్నూలులో ఐదు ఫ్రాంచైజీలకు వేలం జరిగిందన్నారు. గోదావరి జిల్లాలకు గోదావరి గన్స్, కర్నూలుకు రాయలసీమ వారియర్స్, విశాఖపట్నానికి విశాఖ స్మేషర్స్, ప్రకాశం జిల్లాకు ప్రకాశం బుల్స్, అమరావతికి అమరావతి ఏసర్స్ పేరుతో ఫ్రాంచైజీలు ఏర్పాటు చేశామన్నారు. వేలంలో ఆయా ప్రాంతాల స్పాన్సర్స్ జట్లను గెలుచుకున్నారన్నారు. ఈ పోటీలు ఏపీబీఏ ఆధ్వర్యంలో ఫ్రాంచైజీల ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదు నగరాల్లో జరుగుతాయన్నారు. నెల 19న కర్నూలులో పోటీలు ప్రారంభమవువుతాయని మెయిన్ మ్యాచ్‌లు 20న జరుగుతాయన్నారు. అలాగే 22న విశాఖపట్నంలో, 23న రాజమహేంద్రవరంలో, 25న ఒంగోలులో, 26, 27 తేదీల్లో విజయవాడలో పోటీలు జరుగుతాయన్నారు. ప్రతి చోట నాలుగేసి జట్లు మెన్ సింగిల్స్, డబుల్స్, ఉమెన్ సింగిల్స్, మిక్స్‌డ్‌డబుల్స్, బాలుర అండర్–17 డబుల్స్ విభాగల్లో 10 మ్యాచ్‌లు బెస్ట్ ఆఫ్ త్రీ విధానంలో 30 గేమ్‌లు ఆడతాయన్నారు. ఒక జట్టు విశ్రాంతిలో ఉంటుందన్నారు. ఫైనల్ మ్యాచ్‌లు విజయవాడలో ఈ నెల 27న జరుగుతాయన్నారు. రాజమహేంద్రవరంలో ఈ నెల 23న జరిగే మ్యాచ్‌లకు నారాయణపురంలోని కేఎస్‌ఎన్ ఇండోర్ స్టేడియంను వేదికగా నిర్ణయించామన్నారు.
టీఎన్‌రెడ్డి గోదావరి గన్స్ క్రీడాకారులు వీరే
గోదావరి జిల్లా ఫ్రాంచైజీ టీఎన్‌రెడ్డి గోదావరి గన్స్‌లో మొత్తం ఎనిమిది మంది క్రీడాకారులు ఉంటారన్నారు. ఎం.కనిష్క్(గుంటూరు), కె.చైతన్యరెడ్డి(రావులపాలెం), డీబీఎస్ చంద్రకుమార్(అనపర్తి), డి.పూజ(చిత్తూరు), ఎ.అక్షిత(రాజమహేంద్రవరం), బి.వెంకటేష్(శ్రీకాకుళం), కె.వరప్రసాద్(విజయనగరం), ఎస్‌కే ఖాజామోయినుద్దీన్(కడప)లు వివిధ విభాగాల్లో పోటీ పడతారన్నారు. వీరిలో కనిష్క్ మెన్ సింగిల్స్‌లో 87వ వరల్డ్ ర్యాంకర్ అని ఈ పోటీల్లో సింగిల్స్ విభాగంలో పోటీపడతారన్నారు. చంద్రకుమార్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్, పూజ మిక్స్‌డ్ డబుల్స్, అక్షిత ఉమెన్ సింగిల్స్ వరప్రసాద్ డబుల్స్, ఖాజామోయినుద్దీన్ అండర్–17 బాలుర డబుల్స్, కె. చైతన్య రెడ్డి మెన్ డబుల్స్, వెంకటేష్ మెన్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో పోటీ పడతారన్నారు. జట్టుకు రాజమహేంద్రవరానికి చెందిన ఎన్‌వీ భద్రం కోచ్‌గా, అడ్వకేట్ ఎంఎస్‌బీ శంకర్ టీమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తారన్నారు. రాజమహేంద్రవరంలో జరిగే పోటీలకు స్పాన్స్‌ర్స్‌గా అడ్వకేట్ భాస్కర్‌రామ్, హోటల్ షెల్టాన్ ఎండీ కొడాలి తనూజ, రాక్‌ఎవన్యూస్ ఎండీ వేణు ఉన్నారన్నారు. అనంతరం గోదావరి గన్స్ బ్రోచర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కోడాలి తనూజ, సెక్రటరీ ఆర్‌వీఎస్ రామాంజనేయరాజు, అడ్వయిజర్ కర్రి శ్రీనివాసరెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నల్లమిల్లి వీర్రా«ఘవరెడ్డి, కె. బాలు, వెంకట్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement