ఆ కుర్రాడు చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్‌ను చూస్తూ పెరిగాడు. ముందుగా తండ్రి ఆట అతడిని ఆకట్టుకుంది. ఆపై సోదరుడి ఆట తనలో మరింత స్ఫూర్తిని పెంచింది. ఏదో సరదా కోసం ఆడుతున్నామని గానీ లేదంటే మరో క్రీడ గురించి గానీ అతని మనసులో ఏనాడూ కనీసం ఆలోచన కూడా రాలేదు. బ్యాడ్మింటన్ తనను ప్రత్యేకంగా పిలిచినట్లే అతను భావించాడు.
అందుకే ఓనమాలు నేర్చుకున్ననాటి నుంచి అదే లోకంగా బతికాడు. కఠోర సాధన కారణంగా ఆటలో పదును పెరగడమే కాదు అన్ని రకాల అండ కూడా లభించింది. దాంతో అద్భుతమైన ఆటతో దూసుకుపోయాడు.
వరుస విజయాలు, టైటిల్స్ తన ఖాతాలో వేసుకోవడమే కాదు, ఇప్పుడు వరల్డ్ నంబర్‌వన్‌గా భారత బ్యాడ్మింటన్ డబుల్స్‌లో కొత్త అధ్యాయాన్ని సృష్టించాడు. ఆ కుర్రాడే రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్. సహచరుడు చిరాగ్ శెట్టితో కలసి వరల్డ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అందుకున్న సాత్విక్ 23 ఏళ్ల వయసులోనే తన సంచలన ప్రదర్శనతో ప్రపంచ ఖ్యాతినార్జించాడు.
చాలా మంది కోచ్‌లు చెప్పే మాటే
‘కొద్ది రోజుల్లోనే మీ అబ్బాయి భారత్ తరఫున ఆడతాడు’... మెరుగైన శిక్షణ కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టి అడ్మిషన్ కోసం అకాడమీకి వెళ్లినప్పుడు సాత్విక్ తండ్రి విశ్వనాథ్‌తో అక్కడి కోచ్ చెప్పిన మాట. అయితే సహజంగానే ఒక టీనేజర్‌ను నిరాశపరచకుండా ఉత్సాహం పెంచేందుకు చాలా మంది కోచ్‌లు చెప్పే మాటే అది. కాబట్టి దానిని వర్ధమాన ఆటగాళ్లకు సంబంధించి భవిష్యవాణిగా భావించనవసరం లేదు.
సాత్విక్ తండ్రి కూడా అలాగే అనుకున్నారు. కోచ్ మాటలకు ఉప్పొంగిపోకుండా ఆటలో.. తమ అబ్బాయి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదగాలని కోరుకున్నారు. కానీ సాత్విక్ వారందరి అంచనాలకు మించి రాణించాడు. ఊహించిన దానికంటే వేగంగా దూసుకుపోయి కొద్ది రోజుల్లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
చిరాగ్ శెట్టితో జత కలసిన తర్వాత అయితే అతని ఖాతాలో అన్నీ ఘనతలే వచ్చి చేరాయి. సరిగ్గా చెప్పాలంటే వీరిద్దరూ ఎక్కడ విజయం సాధించినా అది భారత్ తరఫున కొత్త రికార్డుగా, ‘తొలి విజయం’గా నమోదవుతూ వచ్చింది. ఇంత తక్కువ వ్యవధిలో ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తమదైన ముద్ర వేసి ప్రత్యర్థులకు సవాల్ విసరడం ఈ జోడీకే చెల్లింది.
అండర్–13 నుంచే..
అమలాపురానికి చెందిన సాత్విక్ తండ్రి.. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. తల్లి రంగమణి కూడా ఉపాధ్యాయినే. వారిద్దరి ప్రోత్సాహం కారణంగా క్రీడల్లోకి రావడం సాత్విక్‌కి ఏం ఇబ్బంది కాలేదు. తండ్రి ఏపీ బ్యాడ్మింటన్ సంఘం పరిపాలనా వ్యవహారాల్లో కూడా పని చేస్తుండటంతో సరైన మార్గనిర్దేశనమూ లభించింది. అయితే నేపథ్యం ఎలా ఉన్నా ఆటలో సత్తా చాటినవాడే మొనగాడు.
బేసిక్స్ నేర్చుకున్న తర్వాత సాత్విక్ వరుసగా స్థానిక, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడం ప్రారంభించాడు. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లోనూ అతనికి వరుసగా విజయాలు దక్కాయి. దాంతో తర్వాతి దశకు చేరడంపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. స్వస్థలంలో ఉంటే అది సాధ్యం కాదని, అత్యుత్తమ శిక్షణ అవసరమని సాత్విక్ తల్లిదండ్రులు గుర్తించారు. ఆ ప్రయత్నంలోనే వారి ప్రయాణం పుల్లెల గోపీచంద్ అకాడమీ వరకు సాగింది. అదే సాత్విక్ కెరీర్‌లో కీలక మలుపుగా మారింది.
పదునెక్కిన ఆట..
సాత్విక్ కెరీర్‌కు సంబంధించి తీసుకున్న కీలక నిర్ణయం పూర్తిగా డబుల్స్‌పైనే దృష్టి పెట్టడం. సాధారణంగా కొత్త ఆటగాళ్లు ఎవరైనా సింగిల్స్‌లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తారు. గెలిచినా, ఓడినా అదే ఈవెంట్‌లో పోరాడటం కనిపిస్తుంది. కానీ సాత్విక్ కెరీర్‌లో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భారత ఆటగాళ్లలో సింగిల్స్‌లో తీవ్రమైన పోటీ ఉంది.
అలాంటి సమయంలో మళ్లీ సింగిల్స్‌లో ప్రయత్నించడం కంటే డబుల్స్ వైపు మళ్లడమే సరైందని అతను భావించాడు. చివరకు అదే అతడిని అగ్రస్థానానికి చేర్చింది. ఇండియా ఇంటర్నేషనల్ జూనియర్‌లో జి.కృష్ణప్రసాద్‌తో కలసి వరుసగా రెండేళ్లు రన్నరప్, విన్నర్‌గా నిలిచిన సాత్విక్ సీనియర్ స్థాయికి వచ్చేసరికి భాగస్వామిని మార్చాల్సి వచ్చింది.
ఇష్టం లేకపోయినా
వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా టీమ్ అవసరాల కోసం అది తప్పలేదు. పురుషుల డబుల్స్‌లో భారత్ నుంచి ఒక అత్యుత్తమ జోడీని తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్న గోపీచంద్ కోచింగ్ బృందానికి సాత్విక్ రూపంలో సరైన ఆటగాడు లభించాడు. అతనికి మరో మెరుపులాంటి చిరాగ్ శెట్టి తోడైతే ఫలితాలు బాగుంటాయని భావించి కొత్త ద్వయం కోర్ట్‌లో బాల్ వేశారు.
అది అద్భుతమైన ఫలితాలను అందించింది. సాత్విక్–చిరాగ్ జంట ఆరు ఇంటర్నేషనల్ చాలెంజర్ టోర్నీలను గెలిచి తమపై పెట్టుకున్న అంచనాలకు తగిన న్యాయం చేసింది. ఆ తర్వాత చాలెంజర్ దశను దాటి పెద్ద విజయాలు సాధించడమే మిగిలింది.
గోల్డ్‌కోస్ట్‌తో మొదలు..
సాధారణంగా డబుల్స్ జోడి మ్యాచ్ అంటే ఇద్దరూ దాదాపు సమ ఉజ్జీలుగా ఉండి మంచి సమన్వయంతో ఆడటం కనిపిస్తుంది. డబుల్స్ ఆడినా కూడా ఆ జంటలో ఒక ప్లేయర్ మాత్రం తన ప్రదర్శనతో ఆకట్టుకోవడం అరుదు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో సాత్విక్ ప్రదర్శన అందుకు చక్కటి ఉదాహరణ.
ఈ టోర్నీ మూడో సీజన్‌లో హైదరాబాద్ హంటర్స్ టైటిల్ గెలవడంతో సాత్విక్ కూడా కీలక పాత్ర పోషించాడు. డబుల్స్ మ్యాచ్‌లలో తనదైన ప్రభావం చూపించడంతో అతని ఆట ఏమిటో బ్యాడ్మింటన్ ప్రపంచానికి బాగా తెలిసింది. ఆ తర్వాతే అందరి దృష్టి సాత్విక్‌పై పడింది. అయితే 2018.. అతని కెరీర్‌కు కావాల్సిన ఊపునిచ్చింది.
సొంతగడ్డపై హైదరాబాద్ ఓపెన్ గెలిచి ఈ జంట తమ ఖాతాలో తొలి టైటిల్ వేసుకుంది. అదే ఏడాది అంతకంటే ఎక్కువ స్థాయి ఉన్న సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ కూడా వీరి చెంతకే చేరింది. అనంతరం గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలు వీరి స్థాయిని అమాంతం పెంచేశాయి.
ఈ ఈవెంట్‌లో పురుషుల డబుల్స్‌లో రజతం నెగ్గిన సాత్విక్–చిరాగ్ జోడి స్వర్ణం సాధించిన మిక్స్‌డ్ టీమ్‌లో కూడా భాగంగా ఉంది. ఆ తర్వాత నుంచి ఈ ద్వయం వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
అన్నీ ఘనతలే..
ఐదేళ్ల క్రితం జరిగిన కామన్వెల్త్ క్రీడల తర్వాత సాత్విక్–చిరాగ్‌ల విజయ ప్రస్థానం జోరుగా సాగిపోయింది. గతంలో పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాళ్లు ఎవరికీ సాధ్యం కాని ఘనతలన్నీ వీరు అందుకుంటూ పోయారు.
ఎక్కడ గెలిచినా అది మన దేశం తరఫున తొలి ఘనతగానే నమోదైంది. సూపర్ 500, సూపర్ 750, సూపర్ 1000.. ఇలా ప్రతిసారీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకుంటూ పోయారు. థాయిలాండ్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్.. బీడబ్ల్యూఎఫ్ సర్క్యూట్‌లో సాత్విక్ అత్యుత్తమ విజయాలు నమోదయ్యాయి.
2022లో జరిగిన బర్మింగ్‌హమ్ కామన్వెల్త్ క్రీడల్లోనూ స్వర్ణం, తాజాగా ఆసియా క్రీడల్లో స్వర్ణం వారి స్థాయిని తెలియజేశాయి. గత ఏడాది వరల్డ్ చాంపియన్ షిప్‌లో కాంస్యం దక్కడం కూడా సాత్విక్–చిరాగ్ అద్భుతమైన విజయాల్లో ఒకటి కాగా, ఇప్పుడు వరల్డ్ నంబర్‌వన్ కిరీటం కూడా వచ్చి చేరింది. ఇక మిగిలింది ఒలింపిక్స్‌లో స్వర్ణమే. వచ్చే ఏడాది అదీ సాధిస్తే 24 ఏళ్ల వయసులోనే సాత్విక్ కెరీర్ పరిపూర్ణం కావడం ఖాయం.
కొడితే కొట్టాలిరా..
సాత్విక్ స్వయంగా చెప్పుకున్నట్లు అమలాపురంలో ఆఖరి బెంచీలో కూర్చునే అబ్బాయి ఇప్పుడు ప్రధానమంత్రి పక్కన కూర్చోవడం చాలా పెద్ద ఘనత. అదేమీ ఒక్కరోజులో సాధ్యం కాలేదు. దాని వెనుక ప్రతిభతో పాటు కఠోర శ్రమ, సంకల్పం, పట్టుదల ఉన్నాయి. సాధనలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా సుదీర్ఘ సమయం పాటు పడిన కష్టం ఉంది.
సాత్విక్ ఫిట్‌నెస్ లెవెల్స్ అద్భుతం. అతని ఆట శైలిలో స్మాష్ ఒక ప్రధాన ఆయుధం. ఎగిరి స్మాష్ కొడితే ఎంతటి ప్రత్యర్థి అయినా రిటర్న్ చేయలేక తలవంచాల్సిందే. ఇదే స్మాష్‌తో అతను ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పడం విశేషం. యోనెక్స్ ఫ్యాక్టరీలో ప్రయోగాత్మకంగా నిర్వహించిన పరీక్షలో అతను కొట్టిన స్మాష్ గంటకు 565 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించడం విశేషం. ఇది గిన్నిస్ బుక్ రికార్డుగా నమోదైంది.
-మొహమ్మద్ అబ్దుల్ హాది
Comments
Please login to add a commentAdd a comment