Paris Olympics: సాత్విక్‌- చిరాగ్‌ మ్యాచ్‌ రద్దు.. కారణం ఇదే! | Paris Olympics: Satwiksairaj Chirag 2nd Round Match Cancelled Must Win Next Match | Sakshi
Sakshi News home page

Paris Olympics: సాత్విక్‌- చిరాగ్‌ మ్యాచ్‌ రద్దు..! ఇకపై గెలిస్తేనే ముందుకు..

Published Mon, Jul 29 2024 3:22 PM | Last Updated on Mon, Jul 29 2024 4:02 PM

Paris Olympics: Satwiksairaj Chirag 2nd Round Match Cancelled Must Win Next Match

ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి- చిరాగ్‌ శెట్టి రెండో మ్యాచ్‌ రద్దైంది. ప్రత్యర్థి ద్వయంలోని ఓ షట్లర్‌ గాయపడటంతో సోమవారం జరగాల్సిన మ్యాచ్‌ మొదలుకాకుండానే ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో తమ తదుపరి మ్యాచ్‌లో సాత్విక్‌- చిరాగ్‌ జోడీ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

పురుషుల డబుల్స్‌ విభాగంలో నంబర్‌ వన్‌గా ఎదిగిన సాత్విక్‌- చిరాగ్‌ ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్యారిస్‌ వేదికగా గ్రూపు దశలో తమ మొదటి మ్యాచ్‌లో గెలిచిన ఈ జోడీ శుభారంభం అందుకున్నారు. గ్రూపు-సి పోటీల్లో భాగంగా ఫ్రాన్స్‌కు చెందిన లుకాస్‌ కోర్వీ- రొనాన్‌ లాబార్‌ ద్వయాన్ని 21-17, 21-14తో ఓడించి శనివారం తొలి గెలుపు నమోదు చేశారు.

మ్యాచ్‌ రద్దు.. కారణం ఇదే
ఈ క్రమంలో సోమవారం నాటి రెండో మ్యాచ్‌లో సాత్విక్‌- చిరాగ్‌ జంట జర్మనీ జోడీ మార్విన్‌ సీడెల్‌- మార్క్‌ లామ్స్‌ఫస్‌తో తలపడాల్సింది. అయితే, మార్క్‌ మోకాలి గాయం కారణంగా ఈ జోడీ పోటీ నుంచి తప్పుకొంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ రద్దైపోయింది. ఈ విషయాన్ని నిర్వాహకులు నిర్ధారించారు.

‘‘గ్రూప్‌-సిలో మ్యాచ్‌లో లామ్స్‌ఫస్‌- మార్విన్‌ సీడెల్‌ ఆడాల్సిన మ్యాచ్‌లు రద్దైపోయాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లు రీషెడ్యూల్‌ చేయాల్సి ఉంది. బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ నిబంధనల ప్రకారం.. గ్రూప్‌-సి దశలో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల ఫలితాలు, మ్యాచ్‌ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ డిలీట్‌ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

తప్పక గెలవాలి
కాగా సాత్విక్‌- చిరాగ్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఇండోనేషియా జంట ఫజర్‌ అల్ఫియాన్‌- మహమ్మద్‌ రియాన్‌ ఆర్టియాంటోతో మంగళవారం పోటీ పడనున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సాత్విక్‌- చిరాగ్‌ జోడీ క్వార్టర్‌ ఫైనల్‌ మార్గం సుగమమవుతుంది. ఇక ఫజర్‌- రియాన్‌ మాజీ నంబర్‌ వన్‌ జోడీ. ప్రస్తుతం ఏడో ర్యాంకులో కొనసాగుతున్నారు.

గతంలో సాత్విక్‌- చిరాగ్‌ - ఫజర్‌ రియాన్‌ జోడీలు ఐదుసార్లు ముఖాముఖి తలపడ్డాయి. భారత జోడీ మూడుసార్లు గెలవగా.. ఇండోనేషియా జంట రెండుసార్లు విజయం సాధించింది. చివరగా కొరియన్‌ ఓపెన్‌-2023లో పోటీపడ్డ ఈ జోడీల్లో సాత్విక్‌- చిరాగ్‌ పైచేయి సాధించారు. ప్యారిస్‌ ఒలింపిక్స్‌లోనూ మన జోడీ టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగింది.

చదవండి: Paris Olympics: నిరాశ‌ప‌రిచిన బోప‌న్న‌-బాలాజీ జోడీ.. తొలి రౌండ్‌లోనే ఔట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement