ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పతకం ఖాయమనకున్న విభాగంలో భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి- చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు.
ప్రపంచ మూడో ర్యాంక్ ద్వయం ఆరోన్ చియా–సో వుయ్ యిక్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో విఫలమై ప్యారిస్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఆద్యంతం ఆసక్తి రేపిన మ్యాచ్‌లో మలేషియా జోడీ చేతిలో 21-13, 14-21, 16-21తో ఓడి ఇంటిబాటపట్టారు.
ఒత్తిడిని అధిగమించలేక
కాగా ఒలింపిక్స్‌లో పతకం రేసులో నిలవాలంటే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సిన సమయంలో సాత్విక్- చిరాగ్ తడబడ్డారు. వాస్తవానికి మలేషియా జోడీతో ముఖాముఖి రికార్డులో సాత్విక్–చిరాగ్ ద్వయం 3–8తో వెనుకబడి ఉంది. ఒకదశలో మలేసియా జంట చేతిలో వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
అయితే, భారత జోడీ ఇటీవల ఈ ద్వయంతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలుపొంది ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. కానీ.. కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం ఒత్తిడిలో చిత్తైంది. ఫలితంగా పతకం గెలవాలన్న కల చెదిరిపోయింది. కాగా.. గత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన ఆరోన్ చియా–సో వుయ్ యిక్ ఈసారీ సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లారు.
ఇదిలా ఉంటే.. ఆరోరోజు పోటీల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో మహారాష్ట్ర షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకం సాధించాడు. అయితే, 50 కేజీల మహిళల బాక్సింగ్ విభాగంలో నిఖత్ జరీన్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. తాజాగా సాత్విక్- చిరాగ్ జోడీ కూడా నిరాశపరిచింది.
చదవండి:Olympics: ముగిసిన ప్రయాణం.. నిఖత్ జరీన్ కన్నీటి పర్యంతం
Comments
Please login to add a commentAdd a comment