భారత డబుల్స్ కోచ్ పదవి నుంచి వైదొలిగిన డెన్మార్క్ మాజీ షట్లర్
పారిస్: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ కోచ్ పదవి నుంచి మథియాస్ బో తప్పుకున్నాడు. సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి జోడీని గొప్పగా తీర్చిదిద్ది వారి విజయాల్లో కీలకపాత్ర పోషించిన అతను పారిస్ ఒలింపిక్స్‌లో భారత ద్వయం వైఫల్యం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత కొంత కాలంగా అద్భుత ప్రదర్శనతో వరుసగా ట్రోఫీలు నెగ్గి పారిస్ ఒలింపిక్స్‌లో పతకంపై ఆశలు రేపిన సాతి్వక్–చిరాగ్ జంట క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది.
2012 లండన్ ఒలింపిక్స్ డబుల్స్ విభాగంలో రజతం గెలిచిన మథియాస్ భారత జట్టుకు నాలుగేళ్ల క్రితం డబుల్స్ స్పెషలిస్ట్ కోచ్‌గా వచ్చాడు. ‘నా కోచింగ్ రోజులు ముగిశాయి. ఇకపై నేను భారత్‌లో గానీ, మరెక్కడా గానీ కోచింగ్ ఇవ్వబోవడం లేదు. చాలా సమయం బ్యాడ్మింటన్ కోర్టుల్లో తీవ్ర ఒత్తిడి మధ్య గడిపిన నేను బాగా అలసిపోయాను. నాకు అండగా నిలిచిన, ఎన్నో జ్ఞాపకాలు అందించిన అందరికీ కృతజ్ఞతలు’ అని మథియాస్ బో స్పష్టం చేశాడు.
ప్రతికూల పరిస్థితుల్లోనూ కష్టపడి భారీ అంచనాలతో ఒలింపిక్స్ బరిలోకి దిగి పతకం సాధించలేకపోయిన సాత్విక్ –చిరాగ్‌ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నానని, భవిష్యత్తులో వారిద్దరు ఎన్నో విజయాలు సాధిస్తారని మథియాస్ ఆకాంక్షించాడు. డెన్మార్క్‌కు చెందిన 44 ఏళ్ల మథియాస్ ఈ ఏడాది మార్చిలోనే సినీ నటి తాప్సీని పెళ్లి చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment