China Masters: సెమీస్‌లో సాత్విక్‌–చిరాగ్‌.. | Top seeded Indian duo in semi final | Sakshi
Sakshi News home page

China Masters: సెమీస్‌లో సాత్విక్‌–చిరాగ్‌..

Published Sat, Nov 25 2023 1:59 AM | Last Updated on Sat, Nov 25 2023 8:42 AM

Top seeded Indian duo in semi final - Sakshi

షెన్‌జెన్‌: భారత స్టార్‌ షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకిరెడ్డి–చిరాగ్‌ శెట్టి జోడీ ఈ ఏడాది మరో టైటిల్‌పై కన్నేసింది. చైనా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో టాప్‌సీడ్‌ భారత ద్వయం సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌కి క్వార్టర్‌ ఫైనల్లో చుక్కెదురైంది.

శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జంట 21–16, 21–14తో ఇండోనేసియాకు చెందిన లియో రాలీ కార్నడో–డానియెల్‌ మారి్టన్‌ జంటపై అలవోక విజయం సాధించింది. ప్రపంచ ఐదో ర్యాంకు జోడీ అయిన సాత్విక్‌–చిరాగ్‌ వరుస గేముల్లో 46 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించింది.

తొలి గేమ్‌లో 14–14 స్కోరు దాకా ఇండోనేసియన్‌ జోడీ నుంచి కొంతవరకు పోటీ ఎదురైనా... ఆ తర్వాత భారత షట్లర్ల ధాటికి ప్రత్యర్థి జంట చతికిలబడింది. తర్వాత రెండో గేమ్‌ను సాత్విక్‌–చిరాగ్‌లు రెట్టించిన ఉత్సాహంతో మొదలుపెట్టారు. 5–2తో ఆధిక్యంలోకి వెళ్లారు.

నెట్‌వద్ద పొరపాట్లతో కొన్ని పాయింట్లు కోల్పోయినప్పటికీ వెంటనే పుంజుకొని ఆడటంతో మళ్లీ ఆధిక్యం 11–6కు పెరిగింది. ఇండోనేసియన్‌ షట్లర్లు ఆ తర్వాత కోలుకోలేదు. 17–10తో గేమ్‌ను చేతుల్లోకి తెచ్చుకున్న భారత అగ్రశ్రేణి జంట నిమిషాల వ్యవధిలోనే 21–14తో మ్యాచ్‌ను మగించేశారు.

ఈ ఏడాది సూపర్‌ ఫామ్‌లో ఉన్న భారత జంట ఇండోనేసియా సూపర్‌–1000, కొరియా సూపర్‌–500, స్విస్‌ సూపర్‌–300 టైటిళ్లను సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో చైనాకు చెందిన జి తింగ్‌–రెన్‌ జియాంగ్‌ యు జంటతో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌ ప్రపంచ 8వ ర్యాంకర్‌ ప్రణయ్‌కి క్వార్టర్స్‌లో ఏదీ కలిసిరాలేదు. 31 ఏళ్ల భారత షట్లర్‌ 9–21, 14–21తో జపాన్‌ ఆటగాడు, మూడో సీడ్‌ కొడయ్‌ నరవొక చేతిలో సులు వుగానే ఓడిపోయాడు.

తొలిగేమ్‌లో నరవొకకు 9–8తో పోటీ ఇచ్చిన భారత ఆటగాడు తర్వాత వరుసగా అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌ రన్నరప్‌ నరవొక తొలిగేమ్‌లో తన రాకెట్‌ను నెట్‌పై పరిధి దాటిరావడంతో చైర్‌ అంపైర్‌ అతని పాయింట్‌ను తిరస్కరించాడు. అయితే ప్రణయ్‌ అందివచ్చిన అవకాశాల్ని ఒడిసిపట్టలేక పదేపదే పొరపాట్లు చేసి మ్యాచ్‌ను అప్పగించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement