విజయవాడ: గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని అందుకు అన్ని శాఖలు కలిసి సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడలో ఆయన వివిధ శాఖాధిపతులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎన్.ఆర్.ఇ.జి.ఎ నిధులను వినియోగించుకోని గ్రామాల్లో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, వ్యర్ధ పదార్ధాల నిర్వహణ, ఫాం పాండ్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికు చంద్రబాబు సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జన చైతన్యయాత్రల అనుభవాలను అధికారులకు వివరించారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల అమలు-పురోగతిపై దృష్టి సారించాలని చంద్రబాబు పేర్కొన్నారు. అర్హులైన కుటుంబాలకు పెన్షన్లు, రేషన్ బియ్యంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కాగా నెలకు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం బహుళ ప్రజాదరణ పొందిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళిక కింద నిధులను సద్వినియోగం చేస్తున్నామని, ఎన్.ఆర్.ఇ.జి.ఎ, ఉప ప్రణాళికల పనులు పురోగతిలో ఉన్నాయని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి శ్రీ జవహర్‌రెడ్డి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.