ఆంధ్రుల త్యాగాలు అపూర్వం
ఆంధ్రుల త్యాగాలు అపూర్వం
Published Tue, Aug 16 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
ఏలూరు (మెట్రో) : దేశానికి స్వాతంత్య్రాన్ని సముపార్జించడంలో ఆంధ్రులు చేసిన త్యాగాలు అపూర్వమని, ఆనాటి త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛా వాయువులు పీల్చగలుగుతున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఏలూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ రక్షణ విషయంలో మిలటరీ మాధవవరం గ్రామానికి ప్రత్యేక స్థానం ఉందని, ఎన్నో ఏళ్లుగా ప్రతి కుటుంబం నుంచి ఒక్కరైనా సైన్యంలో చేరి సేవలందిస్తున్నారన్నారు. అదే స్ఫూర్తితో దేశ రక్షణలో జిల్లాకు ప్రత్యేక స్థానం లభించేలా సైన్యంలో చేరే యువతకు పటిష్టమైన శిక్షణ అందించేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. పేదరికం, ఆర్థిక అసమానతలు లేని ఆరోగ్యకర, ఆనందదాయకమైన రాష్ట్ర నిర్మాణమే లక్ష్యంగా అందరూ కలిసి నడవాలని కోరారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకూ సమానాభివృద్ధి ఉండాలన్నాదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజకీయ లాభాల కోసం జరిగిన రాష్ట్ర విభజన దుష్ఫలితాల నుంచి కోలుకుని రెండు అంకెల వృద్ధి లక్ష్యంతో నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
మూడేళ్లలో పోలవరం పూర్తి
పోలవరం ప్రాజెక్ట్‌ను మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. రెండు లక్షల ఎకరాలకు సాగునీరందించే చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేస్తామన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, వ్యవసాయ రంగం ద్వారా 13.1 వృద్ధి రేటు లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. జిల్లాలోని 4,93,121 మంది రైతులకు రూ.1,695 కోట్లను రుణమాఫీ చేస్తున్నామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.8,972 కోట్లను పంట రుణాలుగా అందిస్తున్నామని తెలిపారు. పేదల జీవన ప్రమాణాల స్థాయిని మెరుగుపరిచి సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో వారికి అందించేందుకు ప్రజాసాధికార సర్వే ఉపయోగపడుతుందని, సర్వేలో మన జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. బయోమెట్రిక్ హాజరు, ఈ ఆఫీస్ విధానంలో జిల్లా మొదటి స్థానంలో ఉందని చెప్పారు. జిల్లాలోని అన్ని గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించిన జిల్లాగా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. గ్రామీణ నిరుద్యోగ యువతకు ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన, దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన కార్యక్రమాల ద్వారా నైపుణ్య శిక్షణ అందిస్తున్నామన్నారు. భారత నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో శాశ్వత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి ప్రకటించారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు (బుజ్జి), కలెక్టర్ కాటంనేని భాస్కర్, జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, డీఐజీ పీవీఎస్ రామకృష్ణ, ఎస్పీ భాస్కర్‌భూషణ్, అదనపు ఎస్పీ చంద్రశేఖర్, ఆర్డీవో నంబూరి తేజ్‌భరత్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement