సాక్షి, తాడేపల్లిగూడెం : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, బీజేపీ మధ్య పంచాయితీ తెగడం లేదు. మంత్రి మాణిక్యాలరావును లక్ష్యంగా చేసుకుని మిత్రపక్షానికి చెందిన తెలుగుదేశం నాయకులు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడం లేదు. దీంతో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఒకే వేదికపై ఇరువర్గాలు ఆరోపణలు గుప్పించుకుని రోడ్డున పడుతున్నారు. ఒకే జన్మభూమి సభకు ఒకరి తర్వాత ఒకరు వెళ్లి విమర్శలు చేసుకోవడం చూసి జనం అసహ్యించుకుంటున్నారు.
మంత్రిపై వ్యంగ్య వాగ్బాణాలు : ఈనెల 2 నుంచి జన్మభూమి – మా ఊరు కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమంలో మంత్రి మాణిక్యాలరావు చురుకుగా పాల్గొంటున్నారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు కూడా ఇదే నియోజకవర్గాన్ని లక్ష్యం చేసుకుని మంత్రికి సమాచారం ఇవ్వకుండా రోజూ జన్మభూమి సభల్లో పాల్గొంటున్నారు. మంగళవారం వెంకట్రామన్నగూడెం సభలో మంత్రి పాల్గొనాల్సి ఉండగా ఆయన రావడం ఆలస్యంకావడంతో అప్పటికే ఈ సభకు హాజరైన బాపిరాజు మంత్రిని ఉద్దేశించి వ్యంగ్య వాగ్బాణాలు విసిరారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సహకరించడం లేదంటూ వ్యాఖ్యానించారు. తర్వాత సభకు హాజరైన మంత్రిమాణిక్యాలరావుకు జెడ్పీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలతో చిర్రెత్తుకొచ్చింది. దీంతో మంత్రి కూడా తన హద్దులు దాటేసి జెడ్పీ చైర్మన్‌పై విరుచుకుపడ్డారు.
‘నా కంటే ముందు ఈ వేదికపైకి వచ్చి వెళ్లిన ఒకటో కృష్ణుడు నేను తప్ప ఇంకొకడు అభివృద్ధి చేయలేడని అన్నారంట. నేను కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే, పంచాయతీరాజ్ విభాగం ద్వారా జిల్లా పరిషత్ ఖర్చుపెట్టే పరిస్థితి. నేను అక్కడ నిధులు ఆపితే ఇక్కడ విలవిల్లాడతారు. స్పష్టంగా చెబుతున్నా, ఒక రాష్ట్ర మంత్రిగా , క్యాబినెట్‌లో భాగస్వామిగా ఉన్న వ్యక్తిని గురించి ఇదే వేదికపై చులకనగా మాట్లాడటం అనేది తీవ్రమైన విషయం. చాలా కాలంగా చూసీచూడనట్టు పోయా. ఖబడ్దార్’ అని హెచ్చరించారు.
అభివృద్ధి కోసం, నిధులు తేవడం కోసం తాను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల చుట్టూ తిరుగుతుంటే, జెడ్పీ చైర్మన్ మాత్రం బోడిగుండులా ఇక్కడే గుండ్రంగా తిరుగుతూ రాజకీయం చేస్తున్నారంటూ మంత్రి విమర్శలు గుప్పించారు. దీనిపై టీడీపీ నేతలూ ఘాటుగానే స్పందించారు. టీడీపీ భిక్షతోనే నెగ్గారనే విషయాన్ని మర్చిపోవద్దని, జెడ్పీ చైర్మన్ తప్పుగా మాట్లాడారని నిరూపించకపోతే ఊళ్లో తిరగనివ్వబోమంటూ హెచ్చరికలు జారీ చేశారు.
నా జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టను..
దీనిపైనా మంత్రి స్పందిస్తూ మళ్లీ నిన్న (బుధవావరం) జెడ్పీ చైర్మన్‌పై విరుచుకుపడ్డారు. తాడేపల్లిగూడెంలో జెడ్పీ తరఫున చేసిన పనులు నాసిరకంగా ఉన్నాయని విమర్శించారు. సొంత నియోజకవర్గంలో తనను
అంటరానివాడిగా చూస్తున్నారని మూడున్నరేళ్లలో రామన్నగూడెంలో ఏ ప్రారంభోత్సవానికైనా పిలిచారా? అని మంత్రి ప్రశ్నించారు. ‘ ఏ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం లేదు? ఎందుకీ శత్రుత్వ ధోరణి? నా జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టను. నన్ను నిలదీయాలని చూస్తే...ప్రభుత్వాన్నే నిలదీస్తా. నేను మంత్రిని...నన్నే పట్టించుకోరా? అని ప్రశ్నలు సంధించారు.
మాణిక్యాలరావుకు అంత ధైర్యముందా?
ప్రతిగా జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గీయులు కూడా మరోసారి మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ...‘ మంత్రి అందరినీ
చులకనగా చూస్తారు. అసలు మర్యాద ఇవ్వరు. అందుకే మా మధ్య గొడవలు. జెడ్పీ చైర్మన్ బాపిరాజు ఇప్పుడు రాజీనామా చేస్తే మేం మళ్లీ గెలిపించుకోగలం. మీకు ఆ ధైర్యం ఉందా?. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా, ఆంధ్రప్రదేశ్ ను కట్ చేస్తా అని చేసిన అభ్యంతర వ్యాఖ్యల విషయంలో మంత్రి మాణిక్యాలరావు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని’ అని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై బాపిరాజు స్పందిస్తూ తన ఎదుగుదలను చూసి మంత్రి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. మరోవైపు ఇద్దరూ తగదా పడుతూ ఒకరి అవినీతిని మరొకరు బయట పెడుతున్న వైనం తాడేపల్లిగూడెంలో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment