Bapiraju
-
‘కొట్టు’పై టీడీపీ జులుం
సాక్షి, పశ్చిమ గోదావరి : వైఎస్సార్ సీపీ నాయకులపై టీడీపీ నేతల జులుం పెచ్చు మీరుతోంది. నందమూరు వరద బాధితులకు అండగా నిలిచినందుకు తాడేపల్లిగూడెం వైఎస్సార్ సీపీ కన్వీనర్ కొట్టు సత్యనారాయణతో పాటు కొంతమంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ఈ ఆదివారం పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం నందమూరు గ్రామంలో వరద బాధితులకు అన్యాయంపై ఆయన అధికారులని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. అదే సమయానికి నందమూరుకు వచ్చిన కలెక్టర్ కాటమనేనికి జరిగిన విషయంపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో కొట్టుపై కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు కొట్టు సత్యనారాయణతో పాటు మరో ముగ్గురిపై 341,323 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. కాగా వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయాలంటూ జెడ్పీ ఛైర్మన్ బాపిరాజు వర్గం ఒత్తిడి తెచ్చింది. ఎర్రకాలువ పనులలో జెడ్పీ ఛైర్మన్ బాపిరాజు వర్గం అవినీతికి పాల్పడ్డారంటూ కొట్టు సత్యనారాయణ కొన్ని రోజుల క్రితం ఆరోపించారు. కొట్టుపై తప్పుడు కేసులు పెట్టడానికి కలెక్టర్‌తో పాటు జెడ్పీ ఛైర్మన్ ఒత్తిడి తెచ్చారంటూ వైఎస్సార్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నా జోలికొస్తే ఖబడ్దార్, మీకు ఆ ధైర్యం ఉందా?
సాక్షి, తాడేపల్లిగూడెం : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, బీజేపీ మధ్య పంచాయితీ తెగడం లేదు. మంత్రి మాణిక్యాలరావును లక్ష్యంగా చేసుకుని మిత్రపక్షానికి చెందిన తెలుగుదేశం నాయకులు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడం లేదు. దీంతో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఒకే వేదికపై ఇరువర్గాలు ఆరోపణలు గుప్పించుకుని రోడ్డున పడుతున్నారు. ఒకే జన్మభూమి సభకు ఒకరి తర్వాత ఒకరు వెళ్లి విమర్శలు చేసుకోవడం చూసి జనం అసహ్యించుకుంటున్నారు. మంత్రిపై వ్యంగ్య వాగ్బాణాలు : ఈనెల 2 నుంచి జన్మభూమి – మా ఊరు కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమంలో మంత్రి మాణిక్యాలరావు చురుకుగా పాల్గొంటున్నారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు కూడా ఇదే నియోజకవర్గాన్ని లక్ష్యం చేసుకుని మంత్రికి సమాచారం ఇవ్వకుండా రోజూ జన్మభూమి సభల్లో పాల్గొంటున్నారు. మంగళవారం వెంకట్రామన్నగూడెం సభలో మంత్రి పాల్గొనాల్సి ఉండగా ఆయన రావడం ఆలస్యంకావడంతో అప్పటికే ఈ సభకు హాజరైన బాపిరాజు మంత్రిని ఉద్దేశించి వ్యంగ్య వాగ్బాణాలు విసిరారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సహకరించడం లేదంటూ వ్యాఖ్యానించారు. తర్వాత సభకు హాజరైన మంత్రిమాణిక్యాలరావుకు జెడ్పీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలతో చిర్రెత్తుకొచ్చింది. దీంతో మంత్రి కూడా తన హద్దులు దాటేసి జెడ్పీ చైర్మన్‌పై విరుచుకుపడ్డారు. ‘నా కంటే ముందు ఈ వేదికపైకి వచ్చి వెళ్లిన ఒకటో కృష్ణుడు నేను తప్ప ఇంకొకడు అభివృద్ధి చేయలేడని అన్నారంట. నేను కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే, పంచాయతీరాజ్ విభాగం ద్వారా జిల్లా పరిషత్ ఖర్చుపెట్టే పరిస్థితి. నేను అక్కడ నిధులు ఆపితే ఇక్కడ విలవిల్లాడతారు. స్పష్టంగా చెబుతున్నా, ఒక రాష్ట్ర మంత్రిగా , క్యాబినెట్లో భాగస్వామిగా ఉన్న వ్యక్తిని గురించి ఇదే వేదికపై చులకనగా మాట్లాడటం అనేది తీవ్రమైన విషయం. చాలా కాలంగా చూసీచూడనట్టు పోయా. ఖబడ్దార్’ అని హెచ్చరించారు. అభివృద్ధి కోసం, నిధులు తేవడం కోసం తాను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల చుట్టూ తిరుగుతుంటే, జెడ్పీ చైర్మన్ మాత్రం బోడిగుండులా ఇక్కడే గుండ్రంగా తిరుగుతూ రాజకీయం చేస్తున్నారంటూ మంత్రి విమర్శలు గుప్పించారు. దీనిపై టీడీపీ నేతలూ ఘాటుగానే స్పందించారు. టీడీపీ భిక్షతోనే నెగ్గారనే విషయాన్ని మర్చిపోవద్దని, జెడ్పీ చైర్మన్ తప్పుగా మాట్లాడారని నిరూపించకపోతే ఊళ్లో తిరగనివ్వబోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. నా జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టను.. దీనిపైనా మంత్రి స్పందిస్తూ మళ్లీ నిన్న (బుధవావరం) జెడ్పీ చైర్మన్‌పై విరుచుకుపడ్డారు. తాడేపల్లిగూడెంలో జెడ్పీ తరఫున చేసిన పనులు నాసిరకంగా ఉన్నాయని విమర్శించారు. సొంత నియోజకవర్గంలో తనను అంటరానివాడిగా చూస్తున్నారని మూడున్నరేళ్లలో రామన్నగూడెంలో ఏ ప్రారంభోత్సవానికైనా పిలిచారా? అని మంత్రి ప్రశ్నించారు. ‘ ఏ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం లేదు? ఎందుకీ శత్రుత్వ ధోరణి? నా జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టను. నన్ను నిలదీయాలని చూస్తే...ప్రభుత్వాన్నే నిలదీస్తా. నేను మంత్రిని...నన్నే పట్టించుకోరా? అని ప్రశ్నలు సంధించారు. మాణిక్యాలరావుకు అంత ధైర్యముందా? ప్రతిగా జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గీయులు కూడా మరోసారి మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ...‘ మంత్రి అందరినీ చులకనగా చూస్తారు. అసలు మర్యాద ఇవ్వరు. అందుకే మా మధ్య గొడవలు. జెడ్పీ చైర్మన్ బాపిరాజు ఇప్పుడు రాజీనామా చేస్తే మేం మళ్లీ గెలిపించుకోగలం. మీకు ఆ ధైర్యం ఉందా?. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా, ఆంధ్రప్రదేశ్ ను కట్ చేస్తా అని చేసిన అభ్యంతర వ్యాఖ్యల విషయంలో మంత్రి మాణిక్యాలరావు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని’ అని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై బాపిరాజు స్పందిస్తూ తన ఎదుగుదలను చూసి మంత్రి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. మరోవైపు ఇద్దరూ తగదా పడుతూ ఒకరి అవినీతిని మరొకరు బయట పెడుతున్న వైనం తాడేపల్లిగూడెంలో చర్చనీయాంశంగా మారింది. -
పల్లకీ మోసిన చోట పది మంది కూడా లేరు
కనుమూరి బాపిరాజు బాపట్ల: రాష్ట్రాన్ని విభజించే సమయంలో కాంగ్రెస్‌పార్టీ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పని చేయటంతోనే పల్లకీS మోసిన చోటే పదిమంది లేకుండా పోయారని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జి కనుమూరి బాపిరాజు అన్నారు. అన్నిపార్టీలు కలిసి నోట్ ఇవ్వటంతోనే రాష్ట్రాన్ని విభజించినప్పటికీ ప్రయోజనాల కోసం చట్టాన్ని పొందుపరిచామని తెలిపారు. ఎన్జీవో హోమ్‌లో సోమవారం బాపట్ల నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. కనుమూరి మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించినందుకే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే... ఇచ్చిన 600 హామీలు నెరవేర్చని టీడీపీకి మరీ ఏ పరిస్థితి వస్తోందో ప్రజలే తీర్పునిస్తారన్నారు. మాజీ మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేకతతో బీజేపీ, టీడీపీలను ఇంటికి పంపేరోజులు దగ్గరపడుతున్నాయని పేర్కొన్నారు. మాజీ మంత్రి జేడీశీలం మాట్లాడుతూ ప్రత్యేకహోదాపై బీజేపీ, టీడీపీలు మీనమేషాలు లెక్కిస్తున్నాయని ధ్వజమెత్తారు. డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జునరావు, నియోజకవర్గ ఇన్చార్జి చేజర్ల నారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షుడు లేళ్ళ వెంకటప్పయ్య, మిరియాల రామకోటేశ్వరరావు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సలీమ్, అబ్దుల్ వలి, యాతం మోజేస్‌రాజు, మాసా చంద్రశేఖర్, రవి, నీశాంత్, దోనేపూడి దేవరాజు, కోటా వెంకటేశ్వరరెడ్డి, మంతెన రామచంద్రరాజు, మద్దాల డేవిడ్ తదితరులున్నారు. -
'స్నేహితుడే కానీ.. అతనితో సంబంధం లేదు'
-
'స్నేహితుడే కానీ.. అతనితో సంబంధం లేదు'
ఏలూరు (మెట్రో): విజయవాడ కాల్‌మనీ కేసులో ఏ-6 నిందితునిగా ఉన్న పెండ్యాల శ్రీకాంత్ తన మిత్రుడేనని పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు స్పష్టం చేశారు. ఏలూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ..కాల్‌మనీ సిండికేట్‌లో తాను రూ.కోటి పెట్టుబడి పెట్టినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. ఆ కేసులో ఏ-6గా ఉన్న శ్రీకాంత్ తనకు స్నేహితుడే కానీ ఇటీవల కాలంలో అతనితో ఆర్థిక సంబంధాలు నెరపలేదని చెప్పారు. మూడు రోజుల క్రితం వరకు శ్రీకాంత్ వాడిన ఇన్నోవా వాహనం తనదేనని బాపిరాజు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ కారు విక్రయించాలని రాజమండ్రిలో ఉన్న స్నేహితునికి ఇస్తే అతను విజయవాడలో ఉన్న శ్రీకాంత్‌కు ఇచ్చాడని, ఈ విషయం తనకు మూడు రోజుల కిందటే తెలిసిందని చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ ఆ కేసులో నిందితునిగా ఉన్నాడని తెలియడంతో వెంటనే ఆ కారును తెచ్చుకున్నానని చెప్పారు. శ్రీకాంత్ మంగళవారం ఉదయం వరకూ నల్లజర్లలోని మీ ఇంటికి సమీపంలోనే ఆశ్రయం పొందారన్న వాదనలు వినిపిస్తున్నాయిగా అని ఓ విలేకరి ప్రస్తావించగా, ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సరైన సమాధానం చెప్పకుండానే మీరు నిరూపిస్తారా అంటూ ఎదురు ప్రశ్నించారు. -
కబ్జా ‘రాజు’!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా పరిషత్ టీడీపీ అభ్యర్థిగా ముళ్లపూడి బాపిరాజును ఎంపిక చేయటంపై ఆ పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గొడవలు, గందరగోళాలతోపాటు భూకబ్జా ఆరోపణలున్న వ్యక్తిని జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ఎలా ప్రకటించారని ఆ పార్టీ నేతలు అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. నల్లజర్లకు చెందిన ముళ్లపూడి బాపిరాజు టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవికి పోటీచేసి పరాజయం పాలయ్యారు. తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవికి పోటీ చేయాలని చూసినా ఆయనకు సీటు దక్కని పరిస్థితి ఏర్పడింది. ఎమ్మె ల్యే సీటు ఇవ్వలేదు కాబట్టి జెడ్పీ చైర్మన్ అభ్యర్థిత్వం ఇవ్వాలని పార్టీలోని మాగంటి బాబు వర్గం అధిష్టానానికి ప్రతిపాదించి ఆమోదించేలా చేసింది. దీంతో తాడేపల్లిగూడెం మండలం నుంచి టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా ఆయన పోటీకి దిగారు. జిల్లాలోని నాయకుల ఏకాభిప్రాయం మేరకు బాపిరాజును ైచైర్మన్ అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టాల్సి ఉన్నా.. ఎవరితో చర్చించకుండానే నాలుగు రోజుల క్రితం ఆయనే అభ్యర్థి అని నాలుగురోజుల క్రితం ప్రకటించారు. దీనిపై పార్టీలో పెద్ద దుమారమే రేగింది. బాపిరాజు అరాచకాలతోపాటు ఆయనపై గల ఆరోపణల గురించి అధిష్టానానికి ఆయన వ్యతిరేకులు ఫిర్యాదులు కూడా పంపారు. భూకబ్జా ఆరోపణలు ప్రధానంగా బాపిరాజుపై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నల్లజర్లలో ఆర్ఎస్ నంబర్-554లో 99 సెంట్లలో ఉన్న మోతేవారి ధర్మసత్రాన్ని ఆయన ఆక్రమించుకుని అమ్మినట్లు తెలిసింది. దేవాదాయ శాఖకు చెందిన ఆ భూమిని వేరే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్టు దొంగ పత్రాలు సృష్టించారు. ఇటీవలే దానిని రూ.4 కోట్లకు ఓ వ్యాపారికి అమ్మినట్లు సమాచారం. కోర్టులో కేసు ఉన్న భూ మిని అమ్మి ఎన్నికల ఖర్చుల కోసం వినియోగించినట్లు గుప్పుమంటోంది. నల్లజర్లలో మైనారిటీలకు చెందిన మూడు ఎకరాల భూమిని బకాయి ఉన్నారనే నెపంతో తమ పేర రిజిస్ట్రే షన్ చేయించుకున్నారనే ఆరోపణలున్నాయి. నల్లజర్లలో ఇందిరమ్మ కాలనీ కోసం ప్రభుత్వం తీసుకుంటుందని మభ్యపెట్టి తక్కువ రేటుకు చిన్నరైతుల నుంచి భూములు సేకరించి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేసినట్లు బాధితులు గగ్గోలు పెడుతున్నారు. పోలీస్ రికార్డుల్లోనూ.. మరోవైపు బాపిరాజుపై నల్లజర్ల, తాడేపల్లిగూడెం పోలీస్స్టేషన్లలో 18 కేసులున్నాయి. ఒక దశలో ఆయనపై నల్లజర్ల స్టేషన్లో రౌడీషీట్ తెరిచేందుకు అధికారులు సిద్ధపడ్డారు. బాపిరాజు ఎవరితోనే ఒత్తిడి చేయించటంతో వెనక్కుతగ్గారు. భూకబ్జాలు, సెటిల్మెం ట్లు, గొడవల్లో నిత్యం తలమునకలై ఉండే బాపిరాజు తనకు నచ్చకపోతే సొంత పార్టీవారినైనా ఇబ్బంది పెడతారనే విమర్శలున్నాయి. ఇందుకు గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత ఉదాహరణ. ప్రస్తుతం వైఎస్సా ర్ సీపీలో ఉన్న ఆమె టీడీపీలో ఉన్నప్పుడు ప్రతిదానికి అవమానించి ఇబ్బంది పెట్టటమే లక్ష్యంగా బాపిరాజు పనిచేసేవారు. దళిత వర్గానికి చెందిన మహిళ కావడంతో ఆమెను ముప్పతిప్పలు పెట్టారనే విమర్శలున్నాయి. ఆమె టీడీపీని వీడటానికి బాపిరాజు కూడా ఓ కారణమనే అభియోగం ఉంది. టీడీపీ నేత ఇమ్మణ్ణి రాజేశ్వరిని కూడా ఇటీవల జరిగిన ఓ సమావేశంలోనే కించపరుస్తూ ఇష్టానుసారం మాట్లాడారు. అయిన దానికి కాని దానికి అడ్డగోలుగా మాట్లాడే ఆయన నైజాన్ని పార్టీలోని చాలామం ది జీర్ణించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఏ పదవీ లేని సమయంలోనే ఇన్ని అరాచకాలు చేసిన బాపిరాజు జెడ్పీ చైర్మన్ అయితే తమ పరిస్థితి ఏమిటని ఆయన వల్ల బాధించబడిన వారు ఆందోళన చెందుతున్నారు. పార్టీలోని ఓ ప్రధాన వర్గం కూడా ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. బాపిరాజును జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించినా, తాము ఒప్పుకునేది లేదని ఆ పార్టీ నేతలు కొందరు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ విషయాలన్నింటినీ అధిష్టానానికి నివేదించి ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నట్టు సమాచారం.