minister manikyalarao
-
ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా..
సాక్షి, ఏలూరు: మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. మంత్రి పదవిలో ఉండి సంస్కారహీనంగా మాట్లాడటం ఆయనకు సరికాదన్నారు. మంత్రి తమను శత్రువులుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిలో మంత్రితో పోటీ పడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మాణిక్యాలరావు సిద్ధంగా ఉన్నారా అని బాపిరాజు ప్రశ్నించారు. -
నా జోలికొస్తే ఖబడ్దార్, మీకు ఆ ధైర్యం ఉందా?
సాక్షి, తాడేపల్లిగూడెం : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, బీజేపీ మధ్య పంచాయితీ తెగడం లేదు. మంత్రి మాణిక్యాలరావును లక్ష్యంగా చేసుకుని మిత్రపక్షానికి చెందిన తెలుగుదేశం నాయకులు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడం లేదు. దీంతో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఒకే వేదికపై ఇరువర్గాలు ఆరోపణలు గుప్పించుకుని రోడ్డున పడుతున్నారు. ఒకే జన్మభూమి సభకు ఒకరి తర్వాత ఒకరు వెళ్లి విమర్శలు చేసుకోవడం చూసి జనం అసహ్యించుకుంటున్నారు. మంత్రిపై వ్యంగ్య వాగ్బాణాలు : ఈనెల 2 నుంచి జన్మభూమి – మా ఊరు కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమంలో మంత్రి మాణిక్యాలరావు చురుకుగా పాల్గొంటున్నారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు కూడా ఇదే నియోజకవర్గాన్ని లక్ష్యం చేసుకుని మంత్రికి సమాచారం ఇవ్వకుండా రోజూ జన్మభూమి సభల్లో పాల్గొంటున్నారు. మంగళవారం వెంకట్రామన్నగూడెం సభలో మంత్రి పాల్గొనాల్సి ఉండగా ఆయన రావడం ఆలస్యంకావడంతో అప్పటికే ఈ సభకు హాజరైన బాపిరాజు మంత్రిని ఉద్దేశించి వ్యంగ్య వాగ్బాణాలు విసిరారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సహకరించడం లేదంటూ వ్యాఖ్యానించారు. తర్వాత సభకు హాజరైన మంత్రిమాణిక్యాలరావుకు జెడ్పీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలతో చిర్రెత్తుకొచ్చింది. దీంతో మంత్రి కూడా తన హద్దులు దాటేసి జెడ్పీ చైర్మన్‌పై విరుచుకుపడ్డారు. ‘నా కంటే ముందు ఈ వేదికపైకి వచ్చి వెళ్లిన ఒకటో కృష్ణుడు నేను తప్ప ఇంకొకడు అభివృద్ధి చేయలేడని అన్నారంట. నేను కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే, పంచాయతీరాజ్ విభాగం ద్వారా జిల్లా పరిషత్ ఖర్చుపెట్టే పరిస్థితి. నేను అక్కడ నిధులు ఆపితే ఇక్కడ విలవిల్లాడతారు. స్పష్టంగా చెబుతున్నా, ఒక రాష్ట్ర మంత్రిగా , క్యాబినెట్లో భాగస్వామిగా ఉన్న వ్యక్తిని గురించి ఇదే వేదికపై చులకనగా మాట్లాడటం అనేది తీవ్రమైన విషయం. చాలా కాలంగా చూసీచూడనట్టు పోయా. ఖబడ్దార్’ అని హెచ్చరించారు. అభివృద్ధి కోసం, నిధులు తేవడం కోసం తాను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల చుట్టూ తిరుగుతుంటే, జెడ్పీ చైర్మన్ మాత్రం బోడిగుండులా ఇక్కడే గుండ్రంగా తిరుగుతూ రాజకీయం చేస్తున్నారంటూ మంత్రి విమర్శలు గుప్పించారు. దీనిపై టీడీపీ నేతలూ ఘాటుగానే స్పందించారు. టీడీపీ భిక్షతోనే నెగ్గారనే విషయాన్ని మర్చిపోవద్దని, జెడ్పీ చైర్మన్ తప్పుగా మాట్లాడారని నిరూపించకపోతే ఊళ్లో తిరగనివ్వబోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. నా జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టను.. దీనిపైనా మంత్రి స్పందిస్తూ మళ్లీ నిన్న (బుధవావరం) జెడ్పీ చైర్మన్‌పై విరుచుకుపడ్డారు. తాడేపల్లిగూడెంలో జెడ్పీ తరఫున చేసిన పనులు నాసిరకంగా ఉన్నాయని విమర్శించారు. సొంత నియోజకవర్గంలో తనను అంటరానివాడిగా చూస్తున్నారని మూడున్నరేళ్లలో రామన్నగూడెంలో ఏ ప్రారంభోత్సవానికైనా పిలిచారా? అని మంత్రి ప్రశ్నించారు. ‘ ఏ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం లేదు? ఎందుకీ శత్రుత్వ ధోరణి? నా జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టను. నన్ను నిలదీయాలని చూస్తే...ప్రభుత్వాన్నే నిలదీస్తా. నేను మంత్రిని...నన్నే పట్టించుకోరా? అని ప్రశ్నలు సంధించారు. మాణిక్యాలరావుకు అంత ధైర్యముందా? ప్రతిగా జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గీయులు కూడా మరోసారి మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ...‘ మంత్రి అందరినీ చులకనగా చూస్తారు. అసలు మర్యాద ఇవ్వరు. అందుకే మా మధ్య గొడవలు. జెడ్పీ చైర్మన్ బాపిరాజు ఇప్పుడు రాజీనామా చేస్తే మేం మళ్లీ గెలిపించుకోగలం. మీకు ఆ ధైర్యం ఉందా?. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా, ఆంధ్రప్రదేశ్ ను కట్ చేస్తా అని చేసిన అభ్యంతర వ్యాఖ్యల విషయంలో మంత్రి మాణిక్యాలరావు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని’ అని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై బాపిరాజు స్పందిస్తూ తన ఎదుగుదలను చూసి మంత్రి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. మరోవైపు ఇద్దరూ తగదా పడుతూ ఒకరి అవినీతిని మరొకరు బయట పెడుతున్న వైనం తాడేపల్లిగూడెంలో చర్చనీయాంశంగా మారింది. -
నన్ను నిలదీయాలని చూస్తే... ప్రభుత్వాన్నే నిలదీస్తా..
-
నేడు రాష్ట్రవ్యాప్తంగా 5కే రన్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నారో లేదో పరుగెత్తి పరీక్షించుకోవాలని, అందుకోసం జన్మభూమిలో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో 5కే రన్ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. దీనిలో అందరూ పాల్గొని పరుగెత్తాలని సూచించారు. 5 కిలోమీటర్లు సునాయాసంగా పరుగెత్తితే ఆరోగ్య సమస్యలు లేనట్లని, పరుగు తీయకపోతే ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు భావించాలని తెలిపారు. దీనిలో జర్నలిస్టులు ఏమీ మినహాయింపు కాదన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోడూరుపాడు గ్రామంలో శనివారం జరిగిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... గడిచిన మూడున్నరేళ్లలో అనేక రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని శ్మశానాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తామన్నారు. దుర్గ గుడి ఈవోపై బదిలీ వేటు విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈవో) సూర్యకుమారిపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఇన్చార్జి ఈవోగా దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధను నియమిస్తున్నట్లు పేర్కొంది. డిసెంబరు 26వ తేదీన గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, ఆ శాఖ కమిషనర్ అనూరాధ, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రఘునాథ్ నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ గుర్తించిన అంశాలతో ముఖ్యమంత్రికి నివేదికను అందజేశారు. దుర్గ గుడిలో తాంత్రిక పూçజల వ్యవహారంపై చర్చించారు. అనంతరం మంత్రి మాణిక్యాలరావు మీడియాతో మాట్లాడారు. ఈవోను తప్పించి, తాంత్రిక పూజల ఆరోపణలపై విచారణ కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. పరిపాలన పరమైన లోపాల కారణంగానే ఈవో తప్పించామని. తాంత్రిక పూజలు జరగలేదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. -
మట్టి మాఫియా కట్టడికి టాస్క్‌ఫోర్స్
తాడేపల్లిగూడెం : మట్టి, ఇసుక మాఫియా కట్టడికి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. క్యాంప్ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో చాలా కాలంగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల మాఫియా చెలరేగిపోతుందన్నారు. మట్టి వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగుతోందన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. రెవెన్యూ అధికారులతో కలిసి కలెక్టర్ భాస్కర్ దృష్టిలో ఉంచి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. మట్టి మాఫియా ఆగడాలపై ఇటీవల ఇరిగేషన్ డీఈ మట్టిని చేరవేస్తున్న వాహనాల నంబర్లతో సహా రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా సదరు పోలీస్ అ««ధికారి ఇరిగేషన్ అధికారి పట్ల అనుచితంగా వ్యవహరించడంతో పాటు ఆ వాహనాలు పట్టుకుని తమకు అప్పగిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారి తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. సంబంధిత పోలీస్ అధికారిపై చర్యలు తీసుకునే విషయంలో సీఎం దృష్టికి విషయాన్ని తీసుకెళుతున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ఎక్సైజ్ అధికారుల లొసుగుల కారణంగా మద్యం బెల్టు దుకాణాలు ఇంకా నియోజకవర్గంలో నడుస్తున్నాయని తెలిపారు. వీటిని కట్టడి చేయడానికి సొంతంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ అభివృద్ధికి రూ.30 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. నిట్ భవనాల సమస్య పరిష్కారానికి ఢిల్లీ వెళుతున్నట్టు మంత్రి తెలిపారు. బీజేపీ నాయకులు యెగ్గిన నాగబాబు, పోతుల అన్నవరం, మున్సిపల్ వైస్ చైర్మన్ కిల్లాడి ప్రసాద్ పాల్గొన్నారు. -
రాఘవేంద్రుడి సన్నిధిలో మాణిక్యాలరావు
మంత్రాలయం: కర్నూలు జిల్లాలోని మంత్రాలయం పుణ్యక్షేత్రాన్ని దేవాదాయశాఖమంత్రి మాణిక్యాలరావు దర్శించుకున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామిని మంగళవారం ఉదయం ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర నాయకుడు సోము వీర్రాజు కూడా ఉన్నారు. -
ఆలయాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
అత్తిలి : ఆలయాల నిర్మాణంలో ప్రజలు భాగస్వాములై తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. స్కిన్నెరపురంలో రూ. 36 లక్షల వ్యయంతో పునఃనిర్మించే కోదండ రామాలయానికి గురువారం ఎంపీ గోకరాజు గంగరాజు, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో కలిసి మంత్రి మాణిక్యాలరావు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో ఆలయాలు నిర్మించడం తేలికేనని, అయితే వాటి నిర్వహణ కష్టతరంగా మారుతుందన్నారు. ప్రజలు భాగస్వాములు అయినప్పుడే ఆ ఆలయం అభివృద్ధి చెందుతుందన్నారు. ఎంపీ గంగరాజు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి దాత దాట్ల రామకృష్ణంరాజు రూ.12 లక్షలు విరాళం ఇవ్వడం అభినందనీయమన్నారు. దాత దాట్ల రామరాజును మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ అందే సత్యం, ప్రభుత్వ విప్ అంగర రామ్మోహనరావు, ఎంపీపీ కేతా సత్యనారాయణ, సర్పంచ్ వనుం రామకనకదుర్గ, సొసైటీ అధ్యక్షుడు వట్టికూటి సూర్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ దాసం బాబ్జి ఘనంగా సత్కరించారు. -
హిందూ ధర్మాన్ని కాపాడాలి : మంత్రి
ద్వారకా తిరుమల : ప్రతి మనిషిలో దైవత్వాన్ని చూసిన నాడే సమ సమాజ స్థాపన సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని కాపాడాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ద్వారకా తిరుమల మాధవ కల్యాణ æమండపంలో నిర్వహిస్తున్న సమరసత సేవా ఫౌండేషన్ శిక్షణ తరగతుల్లో మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మం వంటి పలు అంశాలపై శిక్షణనిచ్చారు. వాసుదేవానంద స్వామిజీ, ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు, సమరసత సేవా ఫౌండేషన్ జనరల్ కార్యదర్శి పి.త్రినాథ్ పాల్గొన్నారు. -
ఓటుకు నోటు కాంగ్రెస్ చలవే
ఆకివీడు : ఓటుకు నోటును అలవాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా మండల పార్టీ అధికార ప్రతినిధి నేరెళ్ల పెదబాబు రైస్ మిల్లు వద్ద కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి వేళ్లూనుకుపోయిందన్నారు. అధికారులకు లంచాలు ఇచ్చి పనిచేయించుకునే అలవాటును నేర్పించారన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరంలో 268 మందికి పరీక్షలు నిర్వహించిన మందులు అందజేశారు. పెదబాబు, పట్టణ కమిటీ అధ్యక్షుడు యర్రా రఘురామ్, రైల్వే బోర్డు మాజీ సభ్యుడు వాడపల్లి రాంబాబు పాల్గొన్నారు. -
మట్టి వినాయక ప్రతిమలనే పూజించండి
భీమవరం: హిందూ సంప్రదాయం ప్రకారం మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కషి చేసినట్లవుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ వుంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఆదివారం భీమవరంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇటీవల కాలంలో ప్రమాదకరమైన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన వినాయక విగ్రహాలను వాడుతున్నారని, దీనివల్ల పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరేళ్లుగా భీమవరం.కామ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), మునిసిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు(చినబాబు), బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, కార్యక్రమ నిర్వాహకుడు నడింపల్లి వెంకటేశ్వరరాజు, గాదిరాజు సుబ్బరాజు, గోకరాజు వెంకట నర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు, కార్మూరి సత్యనారాయణమూర్తి, పళ్ల ఏసుబాబు పాల్గొన్నారు. -
ఆంధ్రుల త్యాగాలు అపూర్వం
ఏలూరు (మెట్రో) : దేశానికి స్వాతంత్య్రాన్ని సముపార్జించడంలో ఆంధ్రులు చేసిన త్యాగాలు అపూర్వమని, ఆనాటి త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛా వాయువులు పీల్చగలుగుతున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఏలూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ రక్షణ విషయంలో మిలటరీ మాధవవరం గ్రామానికి ప్రత్యేక స్థానం ఉందని, ఎన్నో ఏళ్లుగా ప్రతి కుటుంబం నుంచి ఒక్కరైనా సైన్యంలో చేరి సేవలందిస్తున్నారన్నారు. అదే స్ఫూర్తితో దేశ రక్షణలో జిల్లాకు ప్రత్యేక స్థానం లభించేలా సైన్యంలో చేరే యువతకు పటిష్టమైన శిక్షణ అందించేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. పేదరికం, ఆర్థిక అసమానతలు లేని ఆరోగ్యకర, ఆనందదాయకమైన రాష్ట్ర నిర్మాణమే లక్ష్యంగా అందరూ కలిసి నడవాలని కోరారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకూ సమానాభివృద్ధి ఉండాలన్నాదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజకీయ లాభాల కోసం జరిగిన రాష్ట్ర విభజన దుష్ఫలితాల నుంచి కోలుకుని రెండు అంకెల వృద్ధి లక్ష్యంతో నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మూడేళ్లలో పోలవరం పూర్తి పోలవరం ప్రాజెక్ట్‌ను మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. రెండు లక్షల ఎకరాలకు సాగునీరందించే చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేస్తామన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, వ్యవసాయ రంగం ద్వారా 13.1 వృద్ధి రేటు లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. జిల్లాలోని 4,93,121 మంది రైతులకు రూ.1,695 కోట్లను రుణమాఫీ చేస్తున్నామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.8,972 కోట్లను పంట రుణాలుగా అందిస్తున్నామని తెలిపారు. పేదల జీవన ప్రమాణాల స్థాయిని మెరుగుపరిచి సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో వారికి అందించేందుకు ప్రజాసాధికార సర్వే ఉపయోగపడుతుందని, సర్వేలో మన జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. బయోమెట్రిక్ హాజరు, ఈ ఆఫీస్ విధానంలో జిల్లా మొదటి స్థానంలో ఉందని చెప్పారు. జిల్లాలోని అన్ని గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించిన జిల్లాగా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. గ్రామీణ నిరుద్యోగ యువతకు ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన, దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన కార్యక్రమాల ద్వారా నైపుణ్య శిక్షణ అందిస్తున్నామన్నారు. భారత నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో శాశ్వత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి ప్రకటించారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు (బుజ్జి), కలెక్టర్ కాటంనేని భాస్కర్, జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, డీఐజీ పీవీఎస్ రామకృష్ణ, ఎస్పీ భాస్కర్‌భూషణ్, అదనపు ఎస్పీ చంద్రశేఖర్, ఆర్డీవో నంబూరి తేజ్‌భరత్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కేంద్రం సాయం చేస్తోందని సీఎం చాలాసార్లు చెప్పారు
నరసాపురం : ‘రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటోందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలాసార్లు చెప్పారు. ఆ విషయం అందరికీ తెలసు. మరి రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేయడం లేదంటూ ఎందుకు వ్యాఖ్యానించారో అర్ధంకావడం లేదు’ అని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో అంత్యపుష్కరాల ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన మంత్రి అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని, ఏపీకి అన్యాయం ఏమీ జరగడం లేదని పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించి అనేక విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. రెండేళ్లలో రాష్ట్రానికి 12 సెంట్రల్ ప్రాజెక్ట్‌లు మంజూరయ్యాయని, వాటిలో ఐదు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. పోలవరం ముంపు మండలాలలను ఉద్దేశ పూర్వకంగా, తెలంగాణలో కలిపిన రోజు, కాంగ్రెస్ నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు. మోదీ చొరవతోనే పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలిశాయని స్పష్టం చేసారు. దేశంలో ఏ రాష్ట్రానికి చేయని సాయం మోదీ ఏపీకి చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీల మధ్య దూరం పెరుగుతుందా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. –రూ. వంద కోట్లతో ‘దివ్యదర్శనం’ త్వరలో దివ్యదర్శనం పేరుతో ప్రత్యేక పథకాన్ని దేవాదాయశాఖ ప్రారంభిస్తుందని మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. దీనిలో భాగంగా లక్షా 30వేల మందిని రాష్ట్రంలోని పుణ్య క్షేత్రాలకు ఉచింతంగా తీసుకెళ్లి తీసుకువస్తామని, భోజనం, వసతి కల్పిస్తామని చెప్పారు. ఈ యాత్రలో తిరుపతి ఉంటుందని, టెంపుల్ టూరిజం పేరుతో వచ్చే సెప్టెంబర్‌లో ప్రారంభించనున్న ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. అంతర్వేదిక్షేత్రం, నరసాపురం ఎంబేరుమానార్కోవెల కూడా ఈ యాత్రలో ఉండేలా చర్యలు చేపడతామని వివరించారు. నరసాపురం తీర గ్రామం మోళ్ళపర్రులో రూ 2.50 కోట్లతో దేవాదాయశాఖ మత్స్యనారాయణస్వామి ఆలయాన్ని నిర్మించబోతున్నట్టు చెప్పారు. సమావేశంలో నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఉన్నారు. -
రామతీర్థంలోనూ అధికారికంగా నవమి వేడుకలు
విజయనగరం : విజయనగరం జిల్లా రామతీర్థంలోనూ ప్రభుత్వం అధికారికంగా శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత రామతీర్థం, ఒంటిమిట్టలలో ఎక్కడ నిర్వహించాలనే దానిపై విస్తృత చర్చ సాగింది. ప్రభుత్వం ఒంటిమిట్టను ప్రత్యేక హోదా ఉన్న క్షేత్రంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ అధికార లాంఛనాలతో వేడుకలు జరుపుతోంది. కాగా రామతీర్థంను ఎంపిక చేయకపోవడంపై ఉత్తరాంధ్ర సాధుపరిషత్, విశ్వహిందూ పరిషత్ సభ్యులు, భక్తులు ఆందోళనలు చేశారు. ఆమరణ నిరాహార దీక్షలకూ దిగారు. దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు స్పందించి రామతీర్థంలోనూ అధికారికంగా వేడుకలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు వేడుకలకు మంత్రి మాణిక్యాలరావు సతీసమేతంగా హాజరై, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు, ముత్యాలు సమర్పించనున్నారు. ఉదయం 10గంటలకు స్వామివారిని కల్యాణ మండపానికి తీసుకొచ్చి, 12 గంటలకు సీతారాముల కల్యాణం జరిపించనున్నారు. రామతీర్థంలో రాముడిని వనవాస రాముడిగా పిలుస్తారు.