మట్టి మాఫియా కట్టడికి టాస్క్‌ఫోర్స్
మట్టి మాఫియా కట్టడికి టాస్క్‌ఫోర్స్
Published Wed, Apr 26 2017 10:05 PM | Last Updated on Tue, Sep 5 2017 9:46 AM
తాడేపల్లిగూడెం : మట్టి, ఇసుక మాఫియా కట్టడికి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. క్యాంప్ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో చాలా కాలంగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల మాఫియా చెలరేగిపోతుందన్నారు. మట్టి వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగుతోందన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. రెవెన్యూ అధికారులతో కలిసి కలెక్టర్ భాస్కర్ దృష్టిలో ఉంచి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. మట్టి మాఫియా ఆగడాలపై ఇటీవల ఇరిగేషన్ డీఈ మట్టిని చేరవేస్తున్న వాహనాల నంబర్లతో సహా రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా సదరు పోలీస్ అ««ధికారి ఇరిగేషన్ అధికారి పట్ల అనుచితంగా వ్యవహరించడంతో పాటు ఆ వాహనాలు పట్టుకుని తమకు అప్పగిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారి తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. సంబంధిత పోలీస్ అధికారిపై చర్యలు తీసుకునే విషయంలో సీఎం దృష్టికి విషయాన్ని తీసుకెళుతున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ఎక్సైజ్ అధికారుల లొసుగుల కారణంగా మద్యం బెల్టు దుకాణాలు ఇంకా నియోజకవర్గంలో నడుస్తున్నాయని తెలిపారు. వీటిని కట్టడి చేయడానికి సొంతంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ అభివృద్ధికి రూ.30 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. నిట్ భవనాల సమస్య పరిష్కారానికి ఢిల్లీ వెళుతున్నట్టు మంత్రి తెలిపారు. బీజేపీ నాయకులు యెగ్గిన నాగబాబు, పోతుల అన్నవరం, మున్సిపల్ వైస్ చైర్మన్ కిల్లాడి ప్రసాద్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement