మరో బాలుడూ మృతి | Another baludu killed | Sakshi
Sakshi News home page

మరో బాలుడూ మృతి

Published Fri, Sep 30 2016 1:15 AM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

మరో బాలుడూ మృతి

మరో బాలుడూ మృతి

  • కవలల్లో ఒకరు నాలుగు రోజుల క్రితమే దుర్మరణం
  • రెండేళ్ల క్రితం పాముకాటుతో పెద్దకుమారుడు..
  • గొత్తికోయ కుటుంబాన్ని వెంటాడుతున్న కష్టాలు
  • ఏటూరునాగారం :  మండలంలోని లింగాపురం గొత్తికోయ గూడేనికి చెందిన మాడవి పోసవ్వ నాలుగు రోజుల క్రితం నడిరోడ్డుపైనే కవలలకు జన్మనివ్వగా, ఒక బాబు అక్కడే మృతి చెందాడు. మరో బాబు గురువారం కన్నుమూశాడు. పురుటి నొప్పులతో బాధ పడుతున్న పోసవ్వను డోలలు కట్టుకుని ఆస్పత్రికి తీసుకొ స్తుండగా గోగుపల్లి వద్దకు రాగానే నొప్పులు ఎక్కువ కావడంతో స్థానిక మహిళలే ఆమెకు పురుడు పోసిన విషయం తెలిసిందే. అయితే కవలల్లో ఓ బాబు వెంటనే మృతిచెందగా,  బరువు తక్కువగా ఉన్న మరో కుమారుడితో పాటు తల్లిని ఏటూరునాగారంలోని సామాజిక ఆస్పత్రికి తరలించారు. కాగా, పసరు వైద్యం, క్షుద్ర పూజలపై నమ్మకంతో పోసవ్వ  చెప్పా పెట్టకుండా తన కొడుకును తీసుకుని బుధవారం ఆస్పత్రి నుంచి గూడేనికి చేరుకుంది.  దేవుడికి పూజలు చేసి, చెట్ల పసర్లు తాగించి, తాయత్తులు కట్టిస్తే తన కుమారుడు బాగుపడుతాడని భావించింది. గురువారం ఉదయం 6 గంటలకు  స్థానికంగా ఉండే ఓ భూత వైద్యుడిని సంప్రదించారు. ఆ తర్వాత ఏమైందో కానీ గంట సేపటికే నాలుగు రోజుల బాలుడు మృతి చెందాడు.
     
    రెండేళ్ల క్రితం పాముకాటుతో పెద్ద కుమారుడు..
    పోసమ్మ–భద్రయ్య దంపతులకు ఇంతకుముందు ఒక బాబు, పాప ఉండేవారు. రెండేళ్ల క్రితం పాముకాటుతో పెద్ద కుమారుడు మృతిచెందాడు. రెండేళ్ల తర్వాత గర్భం దాల్చిన పోసమ్మ కవలలకు జన్మనివ్వగా వారిద్దరూ మత్యువాత పడ్డారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు తల్లడిల్లేలా విలపిస్తున్నారు. ముగ్గురు కుమారులను పోగొట్టుకున్న పోసమ్మ కన్నీరుమున్నీరవుతోంది. 
    అవగాహన సదస్సులు కరువు..
    మూఢ నమ్మకాలతో నిండు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని గిరిజనులకు అవగాహన కల్పించేవారు కరువయ్యారు. గిరిజన గూడేల్లో చాలామంది ఇప్పటికీ చెట్ల పసర్లు, భూత వైద్యాల వైపే మొగ్గుచూపుతున్నారు. దీని వల్ల జరిగే నష్టాలను వివరించాల్సిన అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఏజెన్సీలో కనిపించడం లేదు. 
     
     మాకు చెప్పకుండానే వెళ్లింది
    సామాజిక ఆస్పత్రిలోని చిన్న పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న బాబుకు తల్లిపాలు పట్టించాలని పోసమ్మకు మంగళవారం అప్పగించాం. బాబు బాగానే ఉన్నాడు. ఆ బాలుడికి, తల్లికి పరీక్షలు చేసి అవసరమైన మందులు అందించాం. బయటకు వెళ్లవద్దని కుటుంబసభ్యులకు కూడా సూచించాం. అయినా మా అనుమతి లేకుండానే వెళ్లిపోయారు.  
    – నవీనం, చిన్న పిల్లల వైద్యులు, ఏటూరునాగారం
     
    అవసరమైన వైద్యం అందించాం
     
    గిరిజనుకుల కావాల్సిన వైద్యం అందించడానికి సిబ్బంది, వైద్యులు సిద్ధంగా ఉన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా చూస్తున్నాం. పోసమ్మ ఆరోగ్యం బాగానే ఉంది. అలాగే శిశువు పరిస్థితి మెరుగుపడుతుందని, ఆస్పత్రిలోని మరో వారం ఉండాలని చెప్పాం. కానీ మా మాట వినకుండా వెళ్లిపోయారు.  
    – అప్పయ్య, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ. ఐటీడీఏ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement