నేటి నుంచి డప్పు సంబరం..!
• ప్రచారమే పరమావధిగా ప్రభుత్వకార్యక్రమాలు
• కుటుంబ, సమాజ వికాసం పేరుతో మరోసారి జన్మభూమి
• నేటి నుంచి 11వరకు సభలు
చేసింది గోరంత..చెప్పుకునేది కొండంత..అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలకు చేకూరే ప్రయోజనం కంటే ప్రచారమే ఎక్కువగా ఉంటోంది. చిన్న చిన్న కార్యక్రమాలకు భారీగా ప్రచారం చేసుకోవడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. ఈ కోవలోనే మరోసారి జన్మభూమి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జనవరి 2వతేదీ నుంచి 11వతేదీ వరకు కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసి అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా
విడుదల చేసింది.
విజయనగరం గంటస్తంభం: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు విడతలు జన్మభూమి కార్యక్రమం చేపట్టిన విషయం విదితమే. ఈ రెండు కార్యక్రమాల్లో పింఛన్లు, ఇళ్లు, రేషన్‌కార్డులు, రుణాలు తదితర వాటికోసం 2,74,655 దరఖాస్తులు రాగా ఇందులో 99శాతం పరిష్కరించినట్లు మీకోసం వెబ్‌సైట్‌లో చూపిస్తున్నారు. కానీ ఇవి ఏస్థాయిలో పరిష్కారం జరిగాయో ప్రజలనడిగితే చెప్తారు. మూడేళ్లుగా వచ్చిన ఒక్క దరఖాస్తుకు అయినా ఇల్లు, రేషన్‌కార్డు జారీ చేయలేదు. పింఛన్లు, రుణాల వంటివి అరకొరగా మంజూరవుతున్నాయి.
రానున్న జన్మభూమిలో పింఛన్లు, కార్డులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా అర్హులందరికీ కాదన్న సత్యం మంజూరైన వాటిని చూస్తే ఇట్టే అర్థమవుతోంది. ఈనేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రచార కార్యక్రమంగా ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అధికారులు సైతం ఇది సమయం వృ«థా కార్యక్రమంగానే పలుసందర్భాల్లో అభిప్రాయపడుతున్నారు. అయినా ఇవేవీ పట్టించుకోని ప్రభుత్వం మరోసారి జన్మభూమి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం గమనార్హం. జనవరి 2వతేదీ నుంచి 11వతేదీ వరకు గ్రామాలు, పురపాలక వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించా రు. గతంలో మాదిరిగానే తహసీల్దారు, ఎంపీడీవోల ఆధ్వర్యంలో మండలాల్లో రెండు బృందా లు, పురపాలక వార్డుల్లో రెండు బృందాలుగా ఈ కార్యక్రమానికి అధికారులు సభలు నిర్వహించాలి. అయితే ఈకార్యక్రమం ద్వారా ప్రజ లకు కలిగే ప్రయోజనం నామమాత్రం కాగా ప్రచారం ఎక్కువగా ఉందని ఇప్పటి నుంచే అధికారులు,ఇతర వర్గాల నుంచి వినిపిస్తున్నమాట.
వికాసం కనిపించేనా?
ప్రభుత్వం తాజాగా చేపడుతున్న జన్మభూమి కార్యక్రమంలో రెండు ప్రధాన అంశాలతో ముందుకెళ్తోంది. ఇందులో ఒకటి కుటుంబ వికాసం కాగా రెండోది సామాజిక వికాసం. కుటుంబ వికాసంలో 15అంశాలున్నాయి. పిం ఛన్లు, చంద్రన్న కానుక, చంద్రన్నబీమా, నిరంతర విద్యుత్ సరఫరా, దీపం కనెక్షన్ల మంజూ రు, పంట సంజీవని,పశుగ్రాసం, గృహనిర్మా ణం, అత్మగౌరవం(మరుగుదొడ్లు), ఆరోగ్య భద్రత, విద్యాభద్రత, ఉపాధి భద్రత, సమచార భద్రత, వ్యక్తిగత భద్రత, జీవనోపాధుల భద్రత ఇందులో ఉన్నాయి. దాదాపు ఈకార్యక్రమలన్నీ ప్రజలకు పెద్దగా ప్రయోజనం కల్పిం చేవి కావని చెప్పాలి.
చంద్రన్న కానుక పేరుతో గత ఏడాది మాదిరిగా ఉచిత సరుకులిస్తున్నా నాణ్యత లేని సరుకులివ్వడంతో ప్రజల్లో ఈపథకంపై వ్యతిరేకత ఉంది. ఇక మిగతా అంశాల్లో చూస్తే వ్యక్తిగత మరుగొడ్ల కల్పన, పశుగ్రాసం పెంపకం, 24గంటల విద్యుత్ సరఫరా, దీపం కనెక్షన్ల మంజూరు, ఉపాధి భద్రత, జీవనోపాధి భద్రత ఇందుకు నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. వీటిలో ఏవీ ప్రజలకు సక్రమంగా దరి చేరలేదనడంలో సందేహం లేదు. ఈనేపథ్యంలో జన్మభూమిలో వీటిని ప్రజల వద్దకు తీసుకెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సమాజ వికాసం
రెండో అంశం సమాజ వికాసంలో పది ప్రాధాన్యతాంశాలు పెట్టారు. విద్య, వైద్యం, వ్యవసాయ అనుంబంధం, సేవారంగం, పారిశ్రామిక రంగం, 24గంటల విద్యుత్ సరఫరా, రోడ్లు మౌలికసదుపాయాలు, సమాచారం, పౌరసేవలు, సమగ్ర అభివృద్ధి ఇందులో ఉన్నాయి. వీటి కోసం మూడేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు అందరికీ తెలిసినవే. ఇందులో ఏరంగం ప్రస్తుతం బాగుందో పాలకులు చెప్పగలిగితే జన్మభూమి కార్యక్రమం విజయవంతమైనట్లే. సేవా రంగం చూస్తే ఉపాధి కల్పన భ్రమగా మారింది. ఇక్కడ ఉపాధి లేక హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాలకు వలస వెళ్లి అసువులు బాసిన సంగతి కళ్లముందే ఉంది.
విద్యార్థులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి లేక అల్లాడుతున్నారు. పరిశ్రమల గురించి చెప్పుకోకపోవడమే మేలు. కొత్త పరిశ్రమలు రాకపోగా పాత పరిశ్రమలు మూత పడి 24వేల మంది కార్మికులు కూలీలుగా మారారు. పేదలకు ఆరోగ్య భరోసా కల్పించే ఆరోగ్యశ్రీని, 108ని నిర్వీర్యం చేయడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చెప్పుకోవాల్సిన పని లేదు. ఇలా చెప్పుకుంటే పోతే అన్నింటిలో విఫలమైనా వాటినే ప్రచారం చేసుకోవాలని జన్మభూమిలో ముందుకు వెళ్తుండడంతో ప్రజలు ఎంతవరకు ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తారో చూడాలి.