'బాబుకు సిగ్గుంటే ...మాట నిలబెట్టుకోవాలి' | AP mrps state president takes on chandrababu | Sakshi
Sakshi News home page

'బాబుకు సిగ్గుంటే ...మాట నిలబెట్టుకోవాలి'

Published Sat, May 7 2016 6:39 PM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

AP mrps state president takes on chandrababu

విజయవాడ : సీఎం చంద్రబాబుకు సిగ్గున్నా, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వమున్నా.. వర్గీకరణ చేపట్టి పెద్దమాదిగనవుతానన్న మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉరుసుపాటి బ్రహ్మయ్య సవాల్ విసిరారు. విజయవాడలోని స్థానిక ప్రెస్క్లబ్‌లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబును డిమాండ్ చేశారు.  చంద్రబాబు తన నాయకత్వంలోనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఢిల్లీలో ధర్నా చేస్తుంటే టీడీపీ వర్గీకరణకు కట్టుబడి వుందని మంత్రి రావెల కిషోర్‌బాబు ప్రకటనలు చేశారని గుర్తుచేశారు. రావెల, చంద్రబాబుకు చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే వర్గీకరణను చేసి చూపించాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మాదిగలను మోసం చేసే పద్ధతిలో వ్యవహరిస్తోందన్నారు.

ఎన్నికల ముందు చంద్రబాబును తిట్టిన జూపూడి, కారెం శివాజీలకు ఉన్నత పదవులు కట్టబెట్టడం సిగ్గుమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. దీనిపై మాదిగ జాతికి మంత్రి రావెల సమాధానం చెప్పాలన్నారు. వర్గీకరణ కోరుతూ ఆదివారం ఢిల్లీలో కృష్ణమాదిగ రిలే నిరాహార దీక్ష చేపడుతున్నారన్నారు.

ఆయనకు మద్దతుగా ఈనెల 9 నుంచి 13 వరకు విజయవాడలోరిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. వర్గీకరణకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు, లేని పక్షంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కోట డానియేల్, అధికార ప్రతినిధి మానికొండ శ్రీధర్, నగర అధ్యక్షుడు లింగాల నర్సింహులు, రోజ్‌కుమార్, ఎలిషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement