ఒకటే లక్ష్యం.. ఒకటే గమనం
* కొనసాగుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
* గుంటూరు, చిత్తూరు జిల్లాల నుంచి 2800 మంది అభ్యర్థుల హాజరు
గుంటూరు రూరల్ : స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో నిర్వహిస్తోన్న ఆర్మీ రిక్రూట్ మెంట్ ఎంపికలు మంగళవారమూ కొనసాగాయి. గుంటూరు, చిత్తూరు జిల్లాల నుంచి 2800 మందికిపైగా అభ్యర్థులు ఎంపికల్లో పోటీపడ్డారు. తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన ఎంపికల్లో అభ్యర్థులను 200 మంది చొప్పున గ్రౌండ్‌లోకి అనుమతించారు. ఒక్కో బ్యాచ్‌కు 300 మంది చొప్పున పరుగు పోటీ నిర్వహించారు.
మొత్తం ఈవెంట్స్ పూర్తి చేసుకున్న 358 మంది మెడికల్ పరీక్షలకు ఎంపికయ్యారు. సోమవారం జరిగిన ఎంపికల్లో 245 మంది అభ్యర్థులు మెడికల్‌కు హాజరుకాగా వారిలో 89 మంది రాత పరీక్షకు అర్హత సాధించినట్లు గుంటూరు రిక్రూట్‌మెంట్ ఆఫీసర్ కల్నల్ ధృవ్‌చౌదరి తెలిపారు. బుధవారం కర్నూలు జిల్లా అభ్యర్థులకు జనరల్ డ్యూటీ ఎంపికలు జరుగనున్నట్లు వెల్లడించారు.