ఆశలు చెధరే
ఆశలు చెధరే
Published Mon, Apr 17 2017 12:24 AM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM
కొవ్వూరు/తణుకు : ప్రస్తుతం గృహ నిర్మాణాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. బ్యాంకులూ రుణాల మంజూరును సులభతరం చేశాయి. ఈ నేపథ్యంలో సామాన్యులు సొంతింటి కలను నిజం చేసుకునే బాట పట్టారు. అయితే వారి ఆశలు అంతలోనే చెదిరిపోయాయి. నిర్మాణ సామగ్రి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇటీవల వరుసగా సిమెంట్, ఐరన్, కంకర ధరలు పెరుగుతుండడంతో గృహనిర్మాణదారులు బెంబేలెత్తిపోతున్నారు. 25శాతం భారం
పదిరోజుల వ్యవధిలో సిమెంటు బస్తా ధర ఏకంగా రూ.100 నుంచి 120 వరకూ పెరిగింది. నెల రోజు వ్యవధిలో ఐరన్ ధర టన్నుకు రూ.8 వేల మేరకు పెరిగింది. దీంతో నిర్మాణ వ్యయం 20 నుంచి 25 శాతం పెరిగింది. ఫలితంగా రియల్ ఎస్టేట్‌తోపాటు భవన నిర్మాణదారులు కుదేలయ్యే పరిస్థితి తలెత్తింది. గతంలో ఓ ధరకు నిర్మాణ ఒప్పందాలు చేసుకున్న వారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ధరల పెరుగుదలతో ఎక్కడికక్కడ నిర్మాణాలు నిలిచిపోయాయి. వీటి నియంత్రణకు అధికారులు, సర్కారు చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సిమెంట్ బస్తా రూ.120
సిమెంటు వ్యాపారులు సిండికేట్‌గా మారి కృత్రిమ కొరత సృష్టించడంతో ధరలకు రెక్కలొచ్చాయి. పదిరోజుల వ్యవధిలో బస్తా సిమెంటు ధర సరాసరి రూ.100 నుంచి 120 వరకు పెంచేశారు. ఈనెల ఆరంభంలో లారీల సమ్మెకు ముందు రూ.220 నుంచి రూ.230 వరకూ ఉన్న బస్తా సిమెంటు ధర ఇప్పుడు ఏకంగా రూ.350 నుంచి 360 వరకూ పలుకుతోంది. చిన్న పట్టణాలు, పల్లెల్లో ఈ ధర రూ.380 నుంచి రూ.390 వరకూ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ ప్రభావం రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంపై తీవ్రంగా పడింది.
ఇటుకదీ అదే దారి
ఇటుక ధర కూడా అమాంతంగా పెరిగింది. ఈ సీజ¯ŒS ఆరంభంలో వెయ్యి ఇటుకల ధర రూ.3,500 నుంచి 3,800 మధ్య ఉండేది. ప్రస్తుతం డిమాండ్ భారీగా పెరగడంతో రూ.5,300 నుంచి రూ.5,500 వరకూ విక్రయిస్తున్నారు. కేవలం నెలరోజుల వ్యవధిలో ఏకంగా వెయ్యి ఇటుకల ధర సుమారు రూ.రెండు వేలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా వేసవిలో ఇటుక ధర స్వల్పంగా పెరగడం సహజం. ఈ సారి మాత్రం అనూహ్యంగా పెరగడంతో నిర్మాణదారులు బెంబేలెత్తుతున్నారు.
కంకర ధరకూ రెక్కలు
కంకర ధరలూ గత పదిరోజుల్లో యూనిట్‌కి రూ.500 వరకు పెరిగింది. ఈనెల ఆరంభంలో రూ.2,000 ఉన్న యూనిట్ కంకర ధర ప్రస్తుతం రూ.2,500 నుంచి రూ.2,600 వరకూ పలుకుతోంది. దీనిలో నాసిరకం కంకర ధరకు రూ.వంద వ్యత్యాసం ఉంటుంది. రెండు యూనిట్ల లారీ రూ.4వేల నుంచి రూ.5వేలకు పెరిగింది.
ఇనుము టన్ను రూ.8 వేలు
నెల రోజుల వ్యవధిలో ఇనుము ధర టన్ను రూ.8వేల వరకూ పెరిగింది. ఇటీవల ఇనుము ధర రోజువారీగా టన్ను రూ.200 నుంచి రూ.300 పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. నెల క్రితం టన్ను ఇనుము రూ.33 వేల నుంచి రూ.34,500 మధ్య ఉండేది. ప్రస్తుతం రూ.42 వేల నుంచి రూ.44,500 వరకు పలుకుతోంది. వైజాగ్ స్టీల్ టన్ను మరో రూ.రెండు వేలు అదనంగా పలుకుతోందని వ్యాపారులు చెబుతున్నారు.
కంపెనీల నుంచి ఒత్తిళ్లు
పెరుగుతున్న సిమెంట్ ధరలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. కంపెనీల నిర్ణయాలపైనే వ్యాపారం చేస్తుంటాం. అన్ని కంపెనీల నుంచి తక్కువ ధరకు సిమెంటు విక్రయించవద్దని ఒత్తిళ్లు వస్తున్నాయి. వారు నిర్ణయించిన ధరలకు అమ్మక తప్పడంలేదు.– టి.వెంకటేశ్వరరావు,
సిమెంట్ డీలర్, తణుకు
ధరలు అదుపు చేయాలి
ఒక్కసారిగా సిమెంట్ ధరలు పెరిగాయి. ఇసుక కొరత తీరినా ధరలు మాత్రం దిగి రావడంలేదు. ఇతర నిర్మాణ సామగ్రి ధరలూ పెరిగాయి. వీటిని భరించలేక నిర్మాణాలు నిలిపేసుకున్నాం. కంపెనీలు ఇష్టానుసారం ఇలా ధరలు పెంచుకుంటూ పోతే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. పెరిగిన ధరలను అదుపు చేయాలి.– ఎం.కోటేశ్వరరావు, గృహనిర్మాణదారుడు, తణుకు
Advertisement