సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే.. | assistant collector s.venkateswar with sakshi | Sakshi
Sakshi News home page

సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే..

Published Fri, Jun 2 2017 10:33 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే.. - Sakshi

సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే..

–  యువత తనకంటూ లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలి
– తగిన కృషి చేస్తే విజయం సొంతమవుతుంది
– సాక్షి ఇంటర్వ్యూలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌


‘అత్యున్నతమైన ఐఏఎస్‌ సాధించాలంటే దాని వెనుక ఎంతో కృషి ఉండాలి. లక్ష్యాన్ని సొంత చేసుకునేందుకు అంకుటిత దీక్షతో శ్రమించాలి. ఈ క్రమంలో ఆడ్డంకులు ఎదురైతే నిరాశ.. నిస్పృహకు లోనుకాకుండా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి. అప్పుడే మనం నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం.’ ఇది ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ‘ఐఏఎస్‌’ సాధనే లక్ష్యంగా నిర్ధేశించుకుని... పట్టుదలతో సొంతం చేసుకున్న సలిజమల వెంకటేశ్వర్‌ మనోగతం. యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఆయన... అసిస్టెంట్‌ కలెక్టర్‌గా జిల్లాలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను ఆయన వెల్లడించారు.
- అనంతపురం అర్బన్‌


సాక్షి : మీ కుటుంబ నేపథ్యం...
అసిస్టెంట్‌ కలెక్టర్‌  : మాది ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎడమకల్లు గ్రామం. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చాను. నాన్న ఎస్‌.వెంకటయ్య పొలం పనులు చూస్తుంటారు. గ్రామంలోని రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ఒకసారి సర్పంచ్‌గా కూడా పనిచేశారు.
అమ్మ ఎస్‌.కాశమ్మ కూడా జెడ్పీటీసీ సభ్యురాలిగా పనిచేశారు.
సాక్షి : మీ విద్యాభ్యాసం...
అ.క: ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు గుంటూరులోని లయోలా పబ్లిక్‌ స్కూల్‌లో చదివాను. అక్కడ ఐసీఎస్‌ఈ సిలబస్‌ను బోధిస్తుంటారు. 2004లో టెన్త్‌ పూర్తయ్యింది. విశాఖపట్నంలోని శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాలలో బైపీసీ చదివాను. 2006లో ఎంసెట్‌లో  806 ర్యాంక్‌ రావడంతో ఆంధ్రా మెడికల్‌ కళాశాల (ప్రభుత్వ) మెడిసిన్‌ ఫ్రీ సీట్‌ వచ్చింది. 2012లో మెడిసిన్‌ పూర్తి చేశాను.
సాక్షి : ఐఏఎస్‌ కావాలనే స్ఫూర్తి ఎలా పొందారు?
అ.క: ఇంటర్‌లో ఉన్నప్పుడు సెలవులకు ఊరెళ్లేవాడిని. అప్పట్లో మా నాన్న సర్పంచ్‌గా ఉన్నారు. ఆయన వద్ద చాలా మంది వివిధ సమస్యలతో వచ్చేవారు. మా నాన్నతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేవాడిని. అక్కడికి సమస్యలతో ప్రజలు వచ్చి అధికారులను ప్రాధేయపడడం చూస్తే కొంచెం బాధ కలిగేది. మా కాలేజీ కింగ్‌ జార్జ్‌ ఆస్పతికి అనుసంధానంగా ఉండేది. రోగుల కష్టాలను దగ్గర నుంచి చూసినప్పుడు కడూఆ బాధపడ్డాను. వారికి నా వంతుగా ఏదైనా చేయాలని అనిపించేది. ఇక ఆస్పత్రిలో పరిస్థితి అలాగే ఉండేది.  సిరంజీలు, కాటన్‌ ఉండేవి కాదు. మా కాలేజికి ఎదురుగా కలెక్టర్‌ ఆఫీసు ఉండేది. కలెక్టర్‌ జె.శ్యామలరావు  ఆస్పత్రికి అకస్మిక సందర్శనకు వచ్చే వారు. ఆ సమయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మొదలు అందరూ అప్రమత్తంగా ఉండడం. మెడికల్‌ సామగ్రిని సిద్ధం చేసేవారు. ఆస్పత్రి శుభ్రంగా ఉండేలా చూసేవారు. అటు ప్రజల కష్టాలు... ఇటు కలెక్టర్‌ హోదా చూసిన తరువాత ప్రజలకు మంచి చేయడానికి ఐఏఎస్‌ అత్యున్నత మార్గం అనేది అప్పుడు నాలో బలపడింది.
సాక్షి : ఐఏఎస్‌ సాధించేందుకు మీరెలా కష్టపడ్డారు?
అ.క: మెడిసిన్‌ పూర్తి చేసి ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పాను. ఐఏఎస్‌ కోచింగ్‌ తీసుకోవడమంటే ఖర్చుతో పని అన్నారు కానీ, వారు నన్ను నిరాశపర్చలేదు.  మాకున్న ఎనిమిదెకాల పొలంలో ఒక ఎకరా అమ్మి డబ్బు మొత్తం నాచేతికి ఇచ్చి వీటితో సర్దుకో అన్నారు. 2012లో ఐదు నెలల పాటు హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకున్నాను. అటు తరువాత ఢిల్లీలో కోచింగ్‌ తీసుకున్నారు. మొదటి సారిగా  2013లో ప్రిలిమ్స్‌ రాశాను. 889 ర్యాంక్‌ రావడంతో ఐఆర్‌ఏఎస్‌ (ఇండియన్‌ రైల్వే అడ్మినిస్ట్రేషన్‌ సర్వీస్‌) వచ్చింది. అది చేస్తూనే 2014లో మరోసారి రాశాను. ఈ సారి 996 ర్యాంక్‌ వచ్చింది ఐడీఈఎస్‌ (డిఫెన్స్‌) వచ్చింది. అప్పుడే నాలో పట్టుదల పెరిగింది. ఐఆర్‌ఏఎస్‌ చేస్తూనే 2015 మూడో సారి ప్రిలిమ్స్‌ రాస్తే 216 ర్యాంక్‌ వచ్చింది. ఆ సంతోషం నుంచి కోలుకోవడానికి రెండు రోజులు పట్టింది.  ఓబీసీ కేటగిరి కింద ఆంధ్ర కేడర్‌లో ఒక్కసీట్‌ మాత్రమే ఉంది.  ఆ కేటగిరీలో నేను ఒక్కడినే ఉండడంతో నాకు ఇక్కడే అవకాశం వచ్చింది. 2016లో ముస్సోరిలో ట్రైనింగ్‌లో చేరాను
సాక్షి : మీకు వెన్నంటి నిలిచింది...
అ.క: మా అమ్మ, నా స్నేహితులు. ఐఏఎస్‌ సాధించలేక పోయిన సమయంలో నాలో తెలియని నిస్పృహ! ఆ సమయంలో మా అమ్మ ఫోన్‌ చేసి నిరుత్సాహం వద్దు... నీవు తప్పక సాధిస్తావంటూ నాకు ధ్యైర్యం చెప్పేది. ఇక మా స్నేహితుల్లో  ముఖ్యంగా అభినవ్‌ చాలా తోడుగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన బెంగుళూరులో ఇన్‌కంట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. మేమిద్దరమూ గ్రూప్‌ స్టడీస్‌ చేసేవాళ్లం. చాలా అంశాలపై విశ్లేషణ జరిపేవారం. అది నా కెంతో తోడ్పడింది.
సాక్షి : యువతకు మీరిచ్చే సందేశం...
అ.క: మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. దాన్ని సాధించాలనే ధృఢ సంక్పలం ఉండాలి. ఒకసారి ఓటమికి కుంగిపోకూడదు.  పట్టుదలతో ముందుకెళితే విజయం మనదవుతుంది. ప్రతి ఒక్కరూ వారిలోని నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవాలి. దేశానికి ఏదో ఒక విధంగా మనం ఉపయోగపడాలి. అప్పుడే మన లక్ష్యానికి సంపూర్ణత వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement