assistant collector
-
సంగారెడ్డిలో కలకలం.. విష్ణువర్ధన్ అనుమానాస్పద మృతి!
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డిలో అదనపు కలెక్టర్ వద్ద పనిచేస్తున్న విష్ణువర్ధన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి వద్ద సీసీ (క్యాంప్ క్లర్క్)గా పనిచేస్తున్న గడిల విష్ణువర్ధన్ (44) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆదివారం ఉదయం కొండాపూర్ మండలం తెలంగాణ టౌన్షిప్ వద్ద పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కాగా శనివారం మధ్యాహ్నం నుంచి విష్ణువర్ధన్ ఇంటికి వెళ్లలేదు. ఇక, విష్ణువర్ధన్‌కు భార్య శివ కృష్ణ కుమారి, కుమార్తె వైష్ణవి (18), కుమారుడు హర్షవర్ధన్ (16) ఉన్నారు. రాత్రి భార్య ఫోన్ చేస్తే విష్ణు మాట్లాడినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో గత నెలరోజులుగా ఆయన సెలవుపై ఉన్నట్లు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. విష్ణువర్ధన్‌ది హత్యా? ఆత్మహత్యా? అనేకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? దాని కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇది కూడా చదవండి: భార్య దారుణ హత్య, కోమాలో భర్త.. ప్రేమ వ్యవహారమే కారణం! -
సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే..
– యువత తనకంటూ లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలి – తగిన కృషి చేస్తే విజయం సొంతమవుతుంది – సాక్షి ఇంటర్వ్యూలో అసిస్టెంట్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ‘అత్యున్నతమైన ఐఏఎస్ సాధించాలంటే దాని వెనుక ఎంతో కృషి ఉండాలి. లక్ష్యాన్ని సొంత చేసుకునేందుకు అంకుటిత దీక్షతో శ్రమించాలి. ఈ క్రమంలో ఆడ్డంకులు ఎదురైతే నిరాశ.. నిస్పృహకు లోనుకాకుండా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి. అప్పుడే మనం నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం.’ ఇది ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ‘ఐఏఎస్’ సాధనే లక్ష్యంగా నిర్ధేశించుకుని... పట్టుదలతో సొంతం చేసుకున్న సలిజమల వెంకటేశ్వర్ మనోగతం. యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఆయన... అసిస్టెంట్ కలెక్టర్‌గా జిల్లాలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను ఆయన వెల్లడించారు. - అనంతపురం అర్బన్ సాక్షి : మీ కుటుంబ నేపథ్యం... అసిస్టెంట్ కలెక్టర్ : మాది ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎడమకల్లు గ్రామం. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చాను. నాన్న ఎస్.వెంకటయ్య పొలం పనులు చూస్తుంటారు. గ్రామంలోని రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ఒకసారి సర్పంచ్‌గా కూడా పనిచేశారు. అమ్మ ఎస్.కాశమ్మ కూడా జెడ్పీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. సాక్షి : మీ విద్యాభ్యాసం... అ.క: ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు గుంటూరులోని లయోలా పబ్లిక్ స్కూల్లో చదివాను. అక్కడ ఐసీఎస్ఈ సిలబస్‌ను బోధిస్తుంటారు. 2004లో టెన్త్ పూర్తయ్యింది. విశాఖపట్నంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో బైపీసీ చదివాను. 2006లో ఎంసెట్‌లో 806 ర్యాంక్ రావడంతో ఆంధ్రా మెడికల్ కళాశాల (ప్రభుత్వ) మెడిసిన్ ఫ్రీ సీట్ వచ్చింది. 2012లో మెడిసిన్ పూర్తి చేశాను. సాక్షి : ఐఏఎస్ కావాలనే స్ఫూర్తి ఎలా పొందారు? అ.క: ఇంటర్లో ఉన్నప్పుడు సెలవులకు ఊరెళ్లేవాడిని. అప్పట్లో మా నాన్న సర్పంచ్‌గా ఉన్నారు. ఆయన వద్ద చాలా మంది వివిధ సమస్యలతో వచ్చేవారు. మా నాన్నతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేవాడిని. అక్కడికి సమస్యలతో ప్రజలు వచ్చి అధికారులను ప్రాధేయపడడం చూస్తే కొంచెం బాధ కలిగేది. మా కాలేజీ కింగ్ జార్జ్ ఆస్పతికి అనుసంధానంగా ఉండేది. రోగుల కష్టాలను దగ్గర నుంచి చూసినప్పుడు కడూఆ బాధపడ్డాను. వారికి నా వంతుగా ఏదైనా చేయాలని అనిపించేది. ఇక ఆస్పత్రిలో పరిస్థితి అలాగే ఉండేది. సిరంజీలు, కాటన్ ఉండేవి కాదు. మా కాలేజికి ఎదురుగా కలెక్టర్ ఆఫీసు ఉండేది. కలెక్టర్ జె.శ్యామలరావు ఆస్పత్రికి అకస్మిక సందర్శనకు వచ్చే వారు. ఆ సమయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ మొదలు అందరూ అప్రమత్తంగా ఉండడం. మెడికల్ సామగ్రిని సిద్ధం చేసేవారు. ఆస్పత్రి శుభ్రంగా ఉండేలా చూసేవారు. అటు ప్రజల కష్టాలు... ఇటు కలెక్టర్ హోదా చూసిన తరువాత ప్రజలకు మంచి చేయడానికి ఐఏఎస్ అత్యున్నత మార్గం అనేది అప్పుడు నాలో బలపడింది. సాక్షి : ఐఏఎస్ సాధించేందుకు మీరెలా కష్టపడ్డారు? అ.క: మెడిసిన్ పూర్తి చేసి ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పాను. ఐఏఎస్ కోచింగ్ తీసుకోవడమంటే ఖర్చుతో పని అన్నారు కానీ, వారు నన్ను నిరాశపర్చలేదు. మాకున్న ఎనిమిదెకాల పొలంలో ఒక ఎకరా అమ్మి డబ్బు మొత్తం నాచేతికి ఇచ్చి వీటితో సర్దుకో అన్నారు. 2012లో ఐదు నెలల పాటు హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకున్నాను. అటు తరువాత ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నారు. మొదటి సారిగా 2013లో ప్రిలిమ్స్ రాశాను. 889 ర్యాంక్ రావడంతో ఐఆర్ఏఎస్ (ఇండియన్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ సర్వీస్) వచ్చింది. అది చేస్తూనే 2014లో మరోసారి రాశాను. ఈ సారి 996 ర్యాంక్ వచ్చింది ఐడీఈఎస్ (డిఫెన్స్) వచ్చింది. అప్పుడే నాలో పట్టుదల పెరిగింది. ఐఆర్ఏఎస్ చేస్తూనే 2015 మూడో సారి ప్రిలిమ్స్ రాస్తే 216 ర్యాంక్ వచ్చింది. ఆ సంతోషం నుంచి కోలుకోవడానికి రెండు రోజులు పట్టింది. ఓబీసీ కేటగిరి కింద ఆంధ్ర కేడర్‌లో ఒక్కసీట్ మాత్రమే ఉంది. ఆ కేటగిరీలో నేను ఒక్కడినే ఉండడంతో నాకు ఇక్కడే అవకాశం వచ్చింది. 2016లో ముస్సోరిలో ట్రైనింగ్‌లో చేరాను సాక్షి : మీకు వెన్నంటి నిలిచింది... అ.క: మా అమ్మ, నా స్నేహితులు. ఐఏఎస్ సాధించలేక పోయిన సమయంలో నాలో తెలియని నిస్పృహ! ఆ సమయంలో మా అమ్మ ఫోన్ చేసి నిరుత్సాహం వద్దు... నీవు తప్పక సాధిస్తావంటూ నాకు ధ్యైర్యం చెప్పేది. ఇక మా స్నేహితుల్లో ముఖ్యంగా అభినవ్ చాలా తోడుగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన బెంగుళూరులో ఇన్‌కంట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. మేమిద్దరమూ గ్రూప్ స్టడీస్ చేసేవాళ్లం. చాలా అంశాలపై విశ్లేషణ జరిపేవారం. అది నా కెంతో తోడ్పడింది. సాక్షి : యువతకు మీరిచ్చే సందేశం... అ.క: మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. దాన్ని సాధించాలనే ధృఢ సంక్పలం ఉండాలి. ఒకసారి ఓటమికి కుంగిపోకూడదు. పట్టుదలతో ముందుకెళితే విజయం మనదవుతుంది. ప్రతి ఒక్కరూ వారిలోని నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవాలి. దేశానికి ఏదో ఒక విధంగా మనం ఉపయోగపడాలి. అప్పుడే మన లక్ష్యానికి సంపూర్ణత వస్తుంది. -
కలెక్టర్, ఏసీలపై హత్యాయత్నం
► ఉడుపి జిల్లాలో బరితెగించిన ఇసుక మాఫియా ►తనిఖీలకు వెళ్లిన కలెక్టర్, ఏసీపై మూకుమ్మడి దాడి ► పోలీసులకు జిల్లాధికారి ఫిర్యాదు ► పలువురు యూపీ, బీహార్‌వాసుల అరెస్టు సాక్షి, బెంగళూరు: అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న ఉడిపి జిల్లా కలెక్టర్ ప్రియాంక మేరి ఫ్రాన్సిస్, కుందాపుర అసిస్టెంట్ కలెక్టర్ (ఏ.సి) శిల్పా నాగ్‌లపై దుండగులు దాడి చేయడంతోపాటు హత్యాయత్నానికి పాల్పడడం సంచలనం సృష్టించింది. ఇసుక మాఫియా ఎంతగా బరితెగించిందో ఈ ఘటన చాటుతోంది. ఈ ఘటనలో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేయగా, మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుండగా, ఇంకొందరు పరారీలోనున్నారు. వివరాల్లోకెళ్తే... ఉడుపి జిల్లా కుందాపుర తాలూకాలో ఉన్న కండ్లూరి గ్రామం సమీపంలోనున్న వరాహి నదిలో భారీగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు తెలిసి కలెక్టర్ ప్రియాంక మేరి, ఏసీ శిల్పానాగ్, ఆమె భర్త శంకరలింగ, కలెక్టర్ గన్‌మెన్ పృథ్విరాజ్ జోగి, కండ్లూరి గ్రామం విలేజ్ అకౌంటెంట్‌తో కలిసి ఆదివారం రాత్రి 11.30 సమయంలో వెళ్లారు. వారి వాహనాలు అక్కడికి చేరగానే సుమారు 20 మంది యువకులు బైకులపైన వచ్చి అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అధికారులు వారికి బెదరకుండా ముందుకు వెళ్ళడంతో ఉత్తర్‌ప్రదేశ్, బీహార్‌లకు చెందిన కొందరు వ్యక్తులు అధికారులతో గొడవకు దిగారు. ఇసుక తవ్వకాలను వారే జరిపిస్తున్నారు. తమను ఎవరేం చేయలేరని అధికారులతో బెదిరింపులకుదిగారు. దుండగులు అధికారులను చుట్టుముట్టి దాడికి యత్నిస్తుండగా స్థానిక ప్రజలు అక్కడికి రావడంతో దుండగులు పరారైనారు. హత్యాయత్నం చేశారు: పోలీసులకు కలెక్టర్ ఫిర్యాదు పెద్ద సంఖ్యలో వచ్చిన దుండగులు దాడి చేయడంతో పాటు హత్యాయత్నం చేయబోయారని కలెక్టర్, ఏసీలు అప్పటికప్పుడే ఉడుపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టి ఏడుగురిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. అధికారులపైన దాడి చేసిన సమయంలో సుమారు 50 మంది ఇసుక రవాణాలో ఉన్నారని, వారి చేతిలో మరణాయుధాలు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇసుక దందా అడ్డుకట్టకు చర్యలు: ఏసీ శిల్ప ఏసీ శిల్పా నాగ్ మాట్లాడుతూ గతంలో కూడా ఈ ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా చేస్తు తహసీల్దార్‌పై దాడి చేశారని, నవంబర్ 21వ తేదీ నుంచి ఏసీగా బాధ్యతలను చేపట్టాక అక్రమాలను అడ్డుకోవడం కోసం అనేక చర్యలను తీసుకున్నట్లు తెలిపారు. అయినా దుండగులు అక్రమ రవాణా ఆపడం లేదని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు కండ్లూరి సమీపంలో షెడ్లు ఏర్పాటు చేసుకొని అక్రమ ఇసుక దందా జరిపిస్తున్నారని ఆమె తెలిపారు. ఆదివారం జరిగిన సంఘటన పైన పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసులు ఇక్కడ అక్రమంగా వేసిన గుడిసెలు, షెడ్లను తొలగించారని, కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని అన్నారు. అక్రమ ఇసుక దందాను అరికట్టాలని, తానే స్వయంగా దాడులకు వస్తానని కలెక్టర్ ఆదేశించడంతో ఆదివారం తాము ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు. ఉడుపి జిల్లాలో ఎక్కడా అక్రమ ఇసుక తవ్వకాలు జరగకుండా చూస్తామని చెప్పారు.