కలెక్టర్, ఏసీలపై హత్యాయత్నం
► ఉడుపి జిల్లాలో బరితెగించిన ఇసుక మాఫియా
►తనిఖీలకు వెళ్లిన కలెక్టర్, ఏసీపై మూకుమ్మడి దాడి
► పోలీసులకు జిల్లాధికారి ఫిర్యాదు
► పలువురు యూపీ, బీహార్‌వాసుల అరెస్టు
సాక్షి, బెంగళూరు: అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న ఉడిపి జిల్లా కలెక్టర్ ప్రియాంక మేరి ఫ్రాన్సిస్, కుందాపుర అసిస్టెంట్ కలెక్టర్ (ఏ.సి) శిల్పా నాగ్‌లపై దుండగులు దాడి చేయడంతోపాటు హత్యాయత్నానికి పాల్పడడం సంచలనం సృష్టించింది. ఇసుక మాఫియా ఎంతగా బరితెగించిందో ఈ ఘటన చాటుతోంది. ఈ ఘటనలో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేయగా, మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుండగా, ఇంకొందరు పరారీలోనున్నారు.
వివరాల్లోకెళ్తే... ఉడుపి జిల్లా కుందాపుర తాలూకాలో ఉన్న కండ్లూరి గ్రామం సమీపంలోనున్న వరాహి నదిలో భారీగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు తెలిసి కలెక్టర్ ప్రియాంక మేరి, ఏసీ శిల్పానాగ్, ఆమె భర్త శంకరలింగ, కలెక్టర్ గన్‌మెన్ పృథ్విరాజ్ జోగి, కండ్లూరి గ్రామం విలేజ్ అకౌంటెంట్‌తో కలిసి ఆదివారం రాత్రి 11.30 సమయంలో వెళ్లారు. వారి వాహనాలు అక్కడికి చేరగానే సుమారు 20 మంది యువకులు బైకులపైన వచ్చి అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
అధికారులు వారికి బెదరకుండా ముందుకు వెళ్ళడంతో ఉత్తర్‌ప్రదేశ్, బీహార్లకు చెందిన కొందరు వ్యక్తులు అధికారులతో గొడవకు దిగారు. ఇసుక తవ్వకాలను వారే జరిపిస్తున్నారు. తమను ఎవరేం చేయలేరని అధికారులతో బెదిరింపులకుదిగారు. దుండగులు అధికారులను చుట్టుముట్టి దాడికి యత్నిస్తుండగా స్థానిక ప్రజలు అక్కడికి రావడంతో దుండగులు పరారైనారు.
హత్యాయత్నం చేశారు: పోలీసులకు కలెక్టర్ ఫిర్యాదు
పెద్ద సంఖ్యలో వచ్చిన దుండగులు దాడి చేయడంతో పాటు హత్యాయత్నం చేయబోయారని కలెక్టర్, ఏసీలు అప్పటికప్పుడే ఉడుపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టి ఏడుగురిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. అధికారులపైన దాడి చేసిన సమయంలో సుమారు 50 మంది ఇసుక రవాణాలో ఉన్నారని, వారి చేతిలో మరణాయుధాలు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇసుక దందా అడ్డుకట్టకు చర్యలు: ఏసీ శిల్ప
ఏసీ శిల్పా నాగ్ మాట్లాడుతూ గతంలో కూడా ఈ ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా చేస్తు తహసీల్దార్‌పై దాడి చేశారని, నవంబర్ 21వ తేదీ నుంచి ఏసీగా బాధ్యతలను చేపట్టాక అక్రమాలను అడ్డుకోవడం కోసం అనేక చర్యలను తీసుకున్నట్లు తెలిపారు. అయినా దుండగులు అక్రమ రవాణా ఆపడం లేదని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు కండ్లూరి సమీపంలో షెడ్లు ఏర్పాటు చేసుకొని అక్రమ ఇసుక దందా జరిపిస్తున్నారని ఆమె తెలిపారు.
ఆదివారం జరిగిన సంఘటన పైన పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసులు ఇక్కడ అక్రమంగా వేసిన గుడిసెలు, షెడ్లను తొలగించారని, కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని అన్నారు. అక్రమ ఇసుక దందాను అరికట్టాలని, తానే స్వయంగా దాడులకు వస్తానని కలెక్టర్ ఆదేశించడంతో ఆదివారం తాము ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు. ఉడుపి జిల్లాలో ఎక్కడా అక్రమ ఇసుక తవ్వకాలు జరగకుండా చూస్తామని చెప్పారు.