ఈఓతో సమావేశమైన ఎస్‌పీఎఫ్ అధికారులు
-
నిర్థారించిన ఆలయ అధికారులు
-
కనిపించని నగలలో సీతమ్మ పుస్తెల తాడు, లక్ష్మణ స్వామి లాకెట్
-
పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈఓ రమేష్‌బాబు
-
ఆలయ అర్చకులపై కేసు నమోదు
-
ఆలయాన్ని పరిశీలించిన ప్రత్యేక భద్రతాధికారులు
-
అన్ని ఆభరణాలను నేడు తనిఖీ చేయనున్న జ్యూయలరీ అధికారి
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో రెండు బంగారు ఆభరణాలు మాయమైనట్టుగా అధికారులు నిర్థారించారు సీతమ్మ వారి పుస్తెల తాడు,లక్ష్మణస్వామి బంగారు లాకెట్ కనిపించడం లేదంటూ భద్రాద్రి పోలీసులకు దేవస్థానం ఈఓ రమేష్‌బాబు సోమవారం ఫిర్యాదు చేశారు. భద్రాద్రి రామాలయంలో నిత్య పూజాది కార్యక్రమాలు.. ఉత్సవాల సమయంలో స్వామి వారికి అలంకరించే బంగారు ఆభరణాలన్నీ ఇద్దరు ప్రధానార్చకులు, మరో తొమ్మిదిమంది అర్చకుల పర్యవేక్షణలో ఉంటాయి. వీటిలోని రెండు ఆభరణాలు కనిపించడం లేదు. దీనికి బాధ్యులైన అర్చకులపై శాఖాపరంగా కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ముందుగా పోలీసులకు ఆలయ ఈఓ ఫిర్యాదు చేశారు. ఆలయంలోని బంగారు ఆభరణాల లెక్క తేల్చాలంటూ ఆలయ అర్చకులకు సోమవారం సాయంత్రం వరకు ఈఓ గడువు ఇచ్చారు. ఆభరణాలన్నీ తనిఖీ చేసిన అర్చకులు.. సీతమ్మ పుస్తెల తాడు, లక్ష్మణ స్వామి బంగారు లాకెట్ కనిపించకడం లేదంటూ ఈఓకు నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా తదుపరి చర్యల కోసం ఇక్కడ జరిగిన మొత్తం పరిణామాలను దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఈఓ రమేష్‌బాబు నివేదించారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. సమగ్ర విచారణకు ఆదేశించించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక భద్రత దళం (ఎస్‌పీఎఫ్) అధికారుల బృందం సోమవారం సాయంత్రం భద్రాచలం రామాలయాన్ని సందర్శించి, ఈఓ రమేష్‌బాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బంగారు ఆభరణాల మాయం, అంతకు ముందు.. ఆ తరువాత జరిగిన మొత్తం పరిణామాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఈ బృందంలో ఎస్‌పీఎఫ్ కమాండెంట్ మాధవరావు, డీఎస్పీ భాస్కర్‌రావు, సీఐలు మోహన్‌రావు, రవీందర్‌రెడ్డి ఉన్నారు.
తేలనున్న ఆభరణాల లెక్క
అర్చకుల ఆధ్వర్యంలోగల ఆభరణాల్లో రెండు నగలు మాయమైన నేపథ్యంలో మిగతావన్నీ భద్రంగా ఉన్నాయో లేదో లెక్క తేల్చేందుకు దేవాదాయశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ దేవాదాయ శాఖ ఆభరణాల తనిఖీ అధికారి(జేవీఓ) భాస్కర్‌ను ఆదేశించారు. ఆయన సోమవారం సాయంత్రం ఇక్కడకు వచ్చి దేవస్థానం ఈఓతో చర్చించారు. ఆలయంలోని మొత్తం ఆభరణాలను మంగళవారం పూర్తిస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఈఓ తెలిపారు.
అర్చకులపై కఠిన చర్యలు
ఆలయంలోని బంగారు ఆభరణాలు మాయమవడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో బాధ్యులైన అర్చకులపై కఠిన చర్యలు తీసకుంటామని ఈఓ రమేష్‌బాబు తెలిపారు. ఆయన సోమవారం ఇక్కడ తన చాంబర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మాయమైన నగలలో సీతమ్మ పుస్తెల తాడు (70 గ్రామలు), లక్ష్మణ స్వామి బంగారు లాకెట్ (21 గ్రాములు) ఉన్నాయని; వీటి విలువ రూ.2.13 లక్షలు ఉంటుందని అన్నారు. వాటిని ఓ దాత స్వామి వారికి నిత్య కల్యాణోత్సవ అలంకారంలో వినియోగించేందుకు చేయించి ఇచ్చినట్టుగా ఉందన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న ఈ పరిణామాలపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తున్నామన్నారు. వారి ఆదేశానుసారంగా బాధ్యులైన అర్చకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే ఇద్దరు ప్రధానార్చకులకు మెమోలు జారీ చేసేందకు రంగం సిద్ధమైంది. ఈఓ ఫిర్యాదు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు భద్రాచలం సీఐ శ్రీనివాసులు, ఎస్సై కరుణాకర్ తెలిపారు.