
4 ఏటీఎంలలో భారీ చోరీ
లింగంపేట: నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలంలో ఏటీఎం దొంగల ముఠా కలకలం సృష్టిస్తోంది. మంగళవారం తెల్లవారుజాము సమయాల్లో నిజామాబాద్లో 4 ఏటీఎంలపై దొంగల ముఠా విజృభించింది. సుమారు 43 లక్షల రూపాయల వరకు చోరీ జరిగినట్లు తెలుస్తోంది. అదే విధంగా బుధవారం వేకువజామున మెదక్ ఆటోనగర్లోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నించారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎంను తెరిచేందుకు దుండగులు యత్నించగా ఏటీఎం నుంచి మంటలు చెలరేగాయి. దీంతో దొంగల ముఠా పరారయింది. బొలెరో వాహనంలో పారిపోతున్న దొంగలను పోలీసులు వెంబడించారు. అనంతరం లింగంపేట పోలీసులకు సమాచారం అందించారు. నాగిరెడ్డి పేట ఎస్సై దొంగల ముఠాను వెంబడించగా తప్పించుకున్నారు. దీంతో ఆయన మాకు ఫోన్ చేసి సమాచారం అందించారని నిజామాబాద్ జిల్లా లింగంపేట ఎస్సై రమేష్ రమేష్ తెలిపారు.
అప్రమత్తమైన ఆయన లింగంపేట మండలం మెంగారం వద్ద రోడ్డుకు అడ్డంగా వాహనాన్ని ఉంచగా దుండగులు తమ వాహనంలో వేగంగా వెళుతూ తప్పించుకోవడానికి యత్నించారు. దీంతో ఎస్సై రమేష్ నిందితులపై కాల్పులు జరిపారు. కానీ, నిందితులు చాకచక్యంగా పరారయ్యారు.పెట్రోలింగ్ పోలీసులు ఏటీఎం వద్దకు చేరుకుని చూడగా అప్పటికే దాదాపు రూ.10లక్షల విలువైన నోట్లు కాలి బూడిదయ్యాయి. అప్పటికే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. ఏటీఎంలో ఇంకా రూ.10 లక్షలు భద్రంగా ఉన్నట్లు సమాచారం. అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా పనేనని, మహారాష్ట్రకు చెందిన ముఠా ఈ దొంగతనానికి పాల్పడి ఉంటుందని ఎస్సై రమేష్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయా బ్యాంకు మేనేజర్ల ఫిర్యాదు మేరకు వర్నీ, కోటగిరి ఎస్సైలు కేసులను నమోదు చేసిన విషయం తెలిసిందే.