ఆంధ్రాబ్యాంకులో దోపిడీకి యత్నం | attempt to rob the andhra bank | Sakshi
Sakshi News home page

ఆంధ్రాబ్యాంకులో దోపిడీకి యత్నం

Published Mon, Aug 1 2016 11:37 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

ఆంధ్రాబ్యాంకులో దోపిడీకి యత్నం - Sakshi

ఆంధ్రాబ్యాంకులో దోపిడీకి యత్నం

  • ముసుగులతో వచ్చి సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన దుండగులు
  • మూడు గంటల పాటు బ్యాంకులోనే..
  • భద్రంగానే నగదు, రూ.4కోట్ల విలువైన బంగారం
  • కురవిలో సంచలనం సృష్టించిన ఘటన
  •  
    కురవి : మండల కేంద్రంలోని ఆంధ్రాబ్యాంకులో ఆదివా రం అర్ధరాత్రి కొందరు దుండుగులు దోపిడీకి యత్నిం చిన ఘటన సంచలనం సృష్టించింది. కురవి ఎస్సై జె.రామకృష్ణ, బ్యాంకు మేనేజర్‌ అజిజ్‌ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. కురవిలో ది ఆంధ్రాబ్యాంకు కర్షక సహకార సేవా సంఘం భవన సముదాయంలో ఆంధ్రాబ్యాంకు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే, ఆదివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో గుర్తు తెలి యని వ్యక్తులు ముసుగులు ధరించి చేతిలో రాడ్లు, టార్చి లైట్లతో వచ్చిఆంధ్రాబ్యాంకు వెనుక భాగంలో కర్షక సేవాసహకార సంఘం తలుపులను పగులగొట్టారు. అందులో నుంచి లోపలకు వెళ్లిన వారు గదిలోని బీరువాలను పగులగొట్టేందుకు యత్నించారు. అయితే, అది బ్యాంకు కాదని గుర్తించిన వారు ఆంధ్రాబ్యాంకు వెనుక భాగంలో ఉన్న తలుపు వద్దకు చేరుకుని గునపంతో పగులగొట్టారు. తలుపు వెనుక సిమెంట్‌ ఇటుకల గోడకు రంధ్రం చేసి ఆగంతకుల్లో ఒకరు బ్యాంకులోకి వెళ్లాడు. ఆ తర్వాత గదిలోని సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదు కాకుండా ఐదింటిని ధ్వంసం చేయడంతో పాటు మరో కెమెరాను పైకి లేపాడు. అదేగదిలోని హారన్‌ మోగకుండా తీగలు తెంచేశారు. అక్కడి నుంచి లాకర్లు ఉన్న గదిలోకి వెళ్లిన ఆగంతకుడు టార్చ్‌లైట్‌ వేసుకుని మరీ లాకర్లు తెరిచేందుకు యత్నించాడు. అలా లోపలకు ప్రవేశించినప్పటి నుంచి మూడు గంటల పాటు లోపలే ఉండగా దోపిడీ సాధ్యం కాకపోవడంతో సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు.
     
    కాపలాగా నైట్‌ వాచ్‌మెన్లు 
     
    సహకార సంఘంలో గంగరబోయిన సత్యం, ఆంధ్రాబ్యాంకు పక్కనే ఉన్న ఏటీఎంలో దయాకర్‌ అనే వ్యక్తులు రాత్రి పూట నైట్‌ వాచ్‌మన్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.  సొసైటీలోకి ప్రవేశించి తలుపు పగులకొట్టిన విషయాన్ని పక్క గదిలో నిద్రించిన నైట్‌ వాచ్‌మెన్‌ గ్రహించలేదు. సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి బయటకు వస్తుండగా దోపిడీ యత్నం జరిగిన విషయాన్ని గుర్తించి సొసైటీ అధికారులు, బ్యాంకు మేనేజర్, క్యాషియర్‌ రంజిత్‌కు తెలిపారు. దీంతో వారు పోలీసులు తెలపగా కురవి సీఐ శ్రీనివాస్‌నాయక్, ఎస్సై రామకృష్ణ చేరుకున్నారు. అలాగే, మానుకోట సీఐ నందిరాంనాయక్, క్లూస్‌టీం ఎస్సై రఘు ఆధ్వర్యంలోని బృందం వచ్చి ఫింగర్‌ప్రింట్లు సేకరించారు. ఆంధ్రాబ్యాంకు డీజీఎం శివప్రసాద్, ఏజీఎం సూర్యనారాయణ, సెక్యూరిటీ అధికారి గిరిష్‌ప్రసాద్‌కుమార్‌ వచ్చి వివరాలను తెలుసుకున్నారు. బ్యాంకులో సుమారు రూ.4కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని, అందులో ఏదీ దొంగతనం జరగలేదని ఆంధ్రాబ్యాంకు మేనేజర్‌ అబ్దుల్‌అజీజ్, పోలీసులు తెలిపారు.
     
    ఒక కన్ను మాత్రమే కనిపించేలా..
     
    ఆంధ్రాబ్యాంకులో దోపిడీకి యత్నించిన సంఘటన కురవిలో సంచలనం సృష్టించింది. సీసీ కెమెరాల ఫుటేజీలో ముసుగు ధరించిన వ్యక్తి కని పించాడు. తల నుంచి కాళ్ల వరకు తెల్లని దుస్తువులు ధరించి ఉండగా, గోడ పగులగొట్టేందుకు పెద్ద రాడ్‌ ఆయన చేతిలో ఉంది. అయితే, ఒకరిని బయట ఉంచి మరో ఇద్దరు లేదా ముగ్గురు లోనకు వెళ్లి దోపిడీకి యత్నించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఒక కన్ను మాత్రమే కనిపించేలా ముసుగు ధరించడం, సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదు కాకుండా ధ్వంసం చేయడాన్ని గమనిస్తే ఆరితేరిన దొంగల ముఠా అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కురవి పోలీసులు తెలిపారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement