ఖజానాలో ‘సై’ ఆట | Audit officials to make a big issue of Treasury branch | Sakshi
Sakshi News home page

ఖజానాలో ‘సై’ ఆట

Published Mon, May 16 2016 8:56 AM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

ఖజానాలో ‘సై’ ఆట

ఖజానాలో ‘సై’ ఆట

ఉద్యోగ సంఘాల మధ్య ఆధిపత్య పోరు
 బిల్లుల్లో కమీషన్లే కారణం?
 పెరుగుతున్న వైరం
 పాలనాధికారి దృష్టికి వివాదం

 
 ‘‘స్టేషనరీ కొనుగోళ్లలో అధికారుల చేతివాటం బయటపడింది. 2014లో రూ.31 కోట్లకు సంబంధించిన విషయంలో ఓ ఎస్టీవో ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. ఆడిట్ అధికారులకు రెట్టింపు వేతనాలు ఇచ్చారు. ఫీజురీయింబర్స్ మెంట్ రూ. 60 కోట్లకుపైగా నిర్ణీత సమయంలో జమచేయలేదు’ ఇవన్నీ ఖజానా శాఖ ఘనకార్యం’’.
 
ముకరంపుర : జిల్లా ఖజానా శాఖలో రెండు ఉద్యోగ సంఘాల మధ్య సయ్యాట నడుస్తోంది.. ఎవరికి వారే తమ ఆధిపత్యం కోసం పాకులాడుతూ వివాదాన్ని మరింత జఠిలం చేస్తున్నారు. అంతర్గత కలహాలను.. ఉద్యోగుల మధ్య పంచాయితీని ఆశాఖ డీడీ తేల్చలేక సతమతమవుతుండడంతో ఈ వివాదం పాలనాధికారి దృష్టికి వెళ్లిన ట్లు సమాచారం. ఆ శాఖ ఉన్నతాధికారి చేతులెత్తేయడం, అంతర్గతపాలన వ్యవహారాలు చక్కదిద్దే పరిస్థితి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
 
ప్రభుత్వ యంత్రాంగం నుంచి మంజూరయ్యే నిధులు ట్రెజరీ ద్వారానే విడుదల కావడం.. ప్రతి బిల్లుకూ కమీషన్లు దండుకోవడమే కారణంగా.. ఖజానా శాఖలో సెక్షన్లకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. అందులోనూ ఎక్కువగా కమీషన్లు దండుకునే ప్రాధాన్య సెక్షన్లు.. కొద్దొగొప్పో కమీషన్లు వచ్చే సాధారణ సెక్షన్లనూ ఉద్యోగులే సృష్టించుకున్నారు. ఫలితంగా ఆ శాఖలో కీలకంగా ఉన్న సెక్షన్ల కోసం ఉద్యోగుల మధ్య జరిగిన పోరు ఉద్యోగ సంఘాల వద్దకు చేరి వర్గపోరుగా మారుతోంది.

ఆ సంఘాల మధ్య విభేదాలు ఆదినుంచీ అగ్గి రాజుకుంటూనే ఉన్నాయి. ఫలితంగా కొత్తగా వచ్చిన డీడీ ఈ రెండు సంఘాల రాజకీయాలతో విసిగిపోతున్నారు. ఇరు సంఘాలకు నచ్చజెప్పే సమయంలోనూ ఆయా నాయకులు ఆ శాఖ జిల్లా అధికారినే టార్గెట్ చేస్తుండడంతో పరిస్థితి చేయి దాటిపోతోంది. ఈ పంచాయితీలో ఇతర ఉద్యోగసంఘాలు, కులసంఘాలు జోక్యం చేసుకునే వరకూ వెళ్లింది.
 
పేరుకు తగ్గట్లే..
కలెక్టరేట్‌లోని ట్రెజరీ కార్యాలయంలో 11 మంది ఎస్టీవోలున్నారు. వారి పరిధిలో సూపరింటెండెంట్‌లు, అకౌంటెంట్లు, ఆడిటర్లు ఉంటారు. ప్రతిపనికీ ఈ సెక్షన్లలో కమీషన్లు లేనిదే పని పూర్తికాదన్న విమర్శలున్నాయి. ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన ప్రతి బిల్లూ ఎస్టీవో దగ్గరకే వస్తుంది. అక్కడి నుంచి ఆ సెక్షన్ల విభాగాలకు కనక వర్షమే కురిపిస్తుం ది. ప్రతి బిల్లులోనూ కొంత పర్సెంటేజీలుం టాయి. ఒక్క జీతాలకు తప్ప అలవెన్సులు, కాంట్రాక్టర్ల బిల్లులు, సంక్షేమ నిధులు తదితర బిల్లున్నింటినీ కమీషన్లు లేనిదే పొందే పరిస్థితి లేదు.

ప్రభుత్వ యంత్రాంగం నుంచి మంజూరైన సొమ్మును ఉద్యోగులు, శాఖలకు అందించడానికి ప్రభుత్వ ఖజానా శాఖనే సొమ్ముచేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ట్రెజరీలో నానా రాద్దాంతం జరుగుతున్న విషయం రాష్ట్రస్థాయిలో ఆ శాఖ డైరెక్టర్ దృష్టికి వెళ్లినా జిల్లాలో ఆ శాఖలో పనిచేస్తున్న సీనియర్ అధికారి ఒకరు చక్రం తిప్పుతూ తప్పుదోవ పట్టిస్తున్నట్లు తెలిసింది. ఫలితంగా తప్పుమీద తప్పు జరుగుతున్నా.. అక్రమాలు, అవినీతి తతంగాన్ని తొక్కిపెడుతున్నారని స్పష్టమవుతోంది.
 
 అక్రమాలు, ఆగడాలు, తప్పిదాలు
 జిల్లా ట్రెజరీ శాఖలో అక్రమాలు, తప్పిదాలు, అధికారుల ఆగడాలను పరిశీలిస్తే.. స్కాలర్‌షిప్‌లకు రూ.4.95 కోట్ల అదనపు చెల్లింపుల వ్యవహారం.. కమీషన్ల కోసం కక్కుర్తిపడి రూ.67 కోట్లు పీడీ ఖాతాకు తరలించిన వైనం.. లోకల్‌ఫండ్ అధికారులకు డబుల్ వేతనాల చెల్లింపు లు..  స్టేషనరీ కొనుగోళ్లలో జరిగిన మాయాజాలం.. పెద్దపల్లి సబ్‌ట్రెజరీ కార్యాలయంలో లేని డాటా ఎంట్రీ ఆపరేటర్ పేరిట 42 నెలల వేతనాలు స్వాహా చేసిన వైనం.. రాష్ట్ర ఉపసంచాలకుల అనుమతి లేకుండా పోస్టింగ్‌లు.. నిబంధనలకు విరుద్దంగా డెప్యూటేషన్ల వంటి బాగోతాలు అనేకం ఉన్నాయి.
 
 ట్రెజరీ శాఖకు సంబంధించిన స్టేషనరీ కొనుగోళ్లలో అధికారుల చేతివాటం బయటపడింది. జిల్లా ట్రెజరీతో పాటు ఉప ఖజానా కార్యాలయాల్లో స్టేషనరీ కొనుగోళ్ల కోసం ఏటా రూ.6 నుంచి రూ.10 లక్షల వరకు ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఆ మేరకు ఆయా కార్యాలయాల నుంచి నిధులివ్వాలి. కానీ ఓ అధికారి ఈ నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం నుంచి వచ్చే బడ్జెట్‌ను తీసుకోవడమే తప్ప ఆయా కార్యాలయాలకు ఇవ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగ పరిధిలో ఉండే స్టేషనరీ విభాగాన్ని సదరు అధికారి సుమారు ఐదేళ్లు తన ఆధీనంలో ఉంచుకుని చక్రం తిప్పడంతో ఆ వివాదమూ రాజుకుంది. ఈ వ్యవహారం రచ్చకెక్కడంతో సదరు అధికారి ఆ సెక్షన్‌ను వదిలేశారు.
 
 -    2014 మేలో ట్రెజరీలో రూ.31 కోట్లకు సంబంధించిన విషయంలో ఓ ఎస్టీవో ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. నిధులు లేకపోయినా రూ.31 కోట్ల చెల్లింపులకు అనుమతివ్వడంతో దుమారమే రేగింది.  
 -    ఎన్ని ఆదేశాలున్నా.. ఫిబ్రవరి నెలకు సంబంధించి లోకల్‌ఫండ్ ఆడిట్ అధికారులకు రెట్టింపు వేతనాలు వారి ఖాతాల్లో ట్రెజరీ అధికారులు జమ చేశారు. నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన దానికన్నా ఎనిమిది మంది సిబ్బందికి అదనంగా రూ.2,30,755 చెల్లించారు. తేరుకున్న అధికారులు వాటిని రికవరీ చేసి విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.
 
 -    విద్యార్థుల ఫీజురీయింబర్‌‌సమెంట్ కింద ప్రభుత్వం ఇటీవల రూ.60 కోట్లకు పైగా నిధులు విడుదల చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు పంపిన బిల్లులను ట్రెజరీ సిబ్బంది పరిశీలించి బ్యాంకుకు పంపిస్తారు. తర్వాత ట్రెజరీలో ఈ చెక్స్ జనరేట్ అవుతాయి. వీటిని డీడీ, ఎస్టీవో అథరైజ్ చేసి సంబంధిత ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలి. కానీ.. మార్చి 24 నుంచి 29 వరకు మెజార్టీ లబ్ధిదారుల డబ్బులను వారి ఖాతాలో జమ చేయలేదు. మార్చి ముగియడంతో నిధులు మిగిలిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వాటిని తన పర్సనల్ డిపాజిట్ ఖాతాలో వేసుకుంది.

Advertisement
Advertisement