న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రతిపక్షాలు తనకు రెండు కళ్లని రాజ్యసభ ౖచైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ఇరుపక్షాలు సమష్టి బాధ్యతతో వ్యవహరిస్తేనే పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరుగుతాయన్నారు. రాజ్యసభలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో వెంకయ్య అభిప్రాయాలతో ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార, విపక్ష పార్టీల పరస్పర మొండి వైఖరితో ఉభయ సభలూ వాయిదాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
పెగసస్, వివాదాస్పద వ్యవసాయ చట్టాలుపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో పాటు నిరసన ప్రదర్శనలతో ఉభయ సభల్ని స్తంభింపజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు కళ్లతోనే సరైన దృష్టి కుదురుతుందని, ఇరుపక్షాలను తాను సమానంగా గౌరవిస్తాననని వెంకయ్య చెప్పినట్లు ప్రకటన తెలిపింది. చట్టసభలు చర్చలకోసం ఉద్దేశించినవని గుర్తు చేశారు. బయట చేసుకోవాల్సిన రాజకీయ పోరాటాలను సభలో చేయాలనుకోవడం సరికాదని ఆయన హితవు చెప్పారు.
రభస ఘటనలపై పరిశీలన
ఇటీవలి సమావేశాల్లో కొందరు అనుచితంగా ప్రవర్తించి సభా గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన విషయంలో చర్యలు తీసుకోవడంపై లోతుగా పరిశీలిస్తున్నట్టు వెంకయ్యనాయుడు చెప్పారని ప్రకటన తెలిపింది. బుధవారం సమావేశాల్లో విపక్ష సభ్యులు, పార్లమెంట్ సెక్యూరిటీ మధ్య తీవ్ర ఘర్షణ నెలకొన్న సంగతి తెలిసిందే! గురువారం సాయంత్రం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో జరిగిన సమావేశంలో కూడా పార్లమెంట్‌లో ఘటనలపైనే చర్చించారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment