అధికారా ? టీడీపీ కార్యకర్తా ?
మదనపల్లె: మదనపల్లె హౌసింగ్ ఈఈ రాజేం ద్రకుమార్ అధికార పార్టీ తొత్తుగా వ్యవహరిస్తూ ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్, పట్టణ అధ్యక్షుడు జర్మన్‌రాజు మండిపడ్డారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన గృహనిర్మాణ పథకం (హౌస్ ఫర్ ఆల్) ప్రారంభ కార్యక్రమంలో ఆ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఫొటోలను ఫ్లెక్సీలో ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రొటోకాల్ ప్రకారం ప్రధాన మంత్రి, కేంద్రమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ ఫొటోలను ముద్రించాల్సి ఉండగా, ముఖ్యమంత్రితో పాటు కొంత మంది మంత్రుల ఫొటోలను మాత్రమే ఫ్లెక్సీలో ఏర్పాటు చేయడంపై వారు సీరియస్ అయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలను అధికారిలా కాకుండా టీడీపీ కార్యకర్తలా నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ ఈఈకి టీడీపీ కండువా కప్పేందుకు ప్రయత్నించారు. దీంతో సభలో కాస్త గందరగోళం ఏర్పడింది. దీంతో మున్సిపల్ చైర్మన్ చొరవ తీసుకుని అధికారులకు, నాయకులకు సర్దిచ్పెపడంతో వివాదం అప్పటికి సద్దుమణిగింది.
హౌసింగ్ ఈఈపై ఎమ్మెల్యే ఆగ్రహం
మదనపల్లె: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన ప్రచార ఫ్లెక్సీలలో నియోజకవర్గ ఎమ్మెల్యే ఫొటో ముద్రించడం తెలియదా? అంటూ మదనపల్లె హౌసింగ్ ఈఈ రాజేంద్రకుమార్‌పై ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమ పైలాన్ ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ప్రొటోకాల్‌పై అవగాహన లేకుంటే తెలుసుకోవాలని హిత వు పలికారు. స్పందించిన ఈఈ ఇందులో తన తప్పేమిలేదని ఉన్నతాధికారులనుంచి వచ్చిన ఫ్లెక్సీనే ఏర్పాటు చేశానని వివరణ ఇచ్చారు.