బతుకు బండిపై గుదిబండ | Ìñæauto drivers fight aginast go 894 | Sakshi
Sakshi News home page

బతుకు బండిపై గుదిబండ

Published Tue, Jan 31 2017 11:35 PM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM

బతుకు బండిపై గుదిబండ

బతుకు బండిపై గుదిబండ

ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చలేదు సరికదా ఉన్న ఉపాధిని సైతం దూరం చేస్తోంది. ఉద్యోగాలు లేక ఆటోలు, ఇతర వాహనాలు నడుపుకుంటూ బతుకుబండిని లాగిస్తున్న యువతపై 894 జీవో పెను ప్రభావం చూపనుంది

వాహనాల చలానాలు, లైసెన్స్‌ ఫీజులు భారీగా పెంపు
 సొంత ఉపాధికీ ఎసరు పెట్టిన సర్కారు
 ఆందోళనలో ఆటోవాలాలు, ఇతర వాహనాల యజమానులు
 894 జీవో రద్దు చేయాలంటూ ఆందోళనలు 
ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చలేదు సరికదా ఉన్న ఉపాధిని సైతం దూరం చేస్తోంది. ఉద్యోగాలు లేక ఆటోలు, ఇతర వాహనాలు నడుపుకుంటూ బతుకుబండిని లాగిస్తున్న యువతపై 894 జీవో పెను ప్రభావం చూపనుంది. రవాణా శాఖ వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు, చలానాలు, ఫిట్‌నెస్‌ ఛార్జీలు అమాంతంగా పెంచేసింది. ఆటోలు, ఇతర వాహనాలు నడుపుకుంటూ జీవిస్తున్న వారు రోడ్డెక్కి ఆందోళనల బాట పట్టారు. 
 
ఏలూరు (సెంట్రల్‌)/తణుకు : రవాణాశాఖలో ఫీజుల మోత మోగింది. చలానాలు, ఫిటెనెస్, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఫీజులు అధిక మొత్తంలో పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌ 29న జీవో 894ను జారీ చేసింది. ఈ జీవోను దేశంలో మిగిలిన రాష్ట్రాలు అమలులోకి తీసుకురాకపోయినా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం నూతన రవాణా ఛార్జీలను అమలులోకి తెచ్చింది. దీంతో ఆటోలు, ఇతర ప్రైవేట్‌ వాహనాల ద్వారా ఉపాధి పొందుతున్న వారిపై పెనుభారం పడింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లాలోని ఆటో కార్మికులు, ప్రైవేట్‌ వాహనాల యజమానులు రెడ్డెక్కి ఆందోళనబాట పట్టారు. పెంచిన ఛార్జీలతో ముఖ్యంగా ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ఛార్జీలను అనుసరించి ఫిట్‌నెస్‌కు ఆలస్య రుసుం కింద రోజుకు రూ.50 చెల్లించాలని చెబుతుండటంతో ఎప్పుడు ఫిట్‌నెస్‌ చేయించుకున్నా డిసెంబర్‌ 29 నుంచి పరిగణనలోకి తీసుకుంటున్నారు.
జిల్లాలో లక్ష వాహనాలు
జిల్లాలో దాదాపు 90 వేల ఆటోలు నడుస్తున్నాయి. వీరిలో చదువుకుని ఉద్యోగాలు రాక ఆటోల ద్వారా ఉపాధి పొందుతున్న వారే ఎక్కువ. ఆటోలతో పాటు టాటా మేజిక్‌ వంటి లైట్‌ వెహికల్స్‌ ద్వారా ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో మరో 10 వేల కార్లు, లారీల వంటి ఇతర వాహనాలు ఉన్నాయి. వాహనాలు కాకుండా రవాణా రంగంపై ఆధారపడి మెకానిక్‌లు, వ్యాపారులు, కూలీలు దాదాపు 4 లక్షల మంది వరకు జీవిస్తున్నారు. ఇప్పటికే ప్రతి 15 రోజులకు ఒకసారి డీజిల్‌ ధరలను పెంచుతుండటంతో పాటు ఇన్సూరెన్స్, వాహనాల విడిభాగాలు, టైర్లపై పన్నులు పెంచడంతో రవాణారంగం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. 
రెట్టింపైన ఛార్జీలు
గతంతో పోల్చితే ఈసారి ఛార్జీలు రెట్టింపయ్యాయి. దీంతో వాహనదారుల జేబుకు చిల్లులు పడనున్నాయి. జిల్లావ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, ఫిట్‌నెస్‌లతో పాటు ఇతర సేవల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పోల్చితే రవాణాశాఖకు ఆదాయం పెరుగుతుంది. ఛార్జీలు పెరగకముందు నెలకు రూ.20 లక్షలు ఆదాయం ఉంటే ప్రస్తుతం పెరిగిన ఛార్జీలతో మరో రూ.10 లక్షలు అదనంగా వచ్చే అవకాశం ఉంది. డ్రైవింగ్‌ లైసెన్స్, చిరునామా మార్పు, ఓనర్‌షిప్‌ మార్పు ఇలా అనేక సేవల్లో గడువులోగా మార్చుకోనట్టయితే వాహనదారులు రవాణాశాఖకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ప్ర«ధాన కేటగిరీల్లో లైసెన్సుల ఫీజులు భారీగానే పెరిగాయి. 
 
పెరిగిన ఛార్జీలు ఇలా..
 
వాహనాలు ప్రస్తుతం పెరిగిన ఫీజు
 
ద్విచక్రవాహన రిజిస్ట్రేషన్‌ రూ.395 రూ.685
కార్లు రిజిస్ట్రేషన్‌ రూ. 590 రూ.1,135
క్యాబ్‌ రిజిస్ట్రేషన్‌ రూ.600 రూ.1,150
మీడియం గూడ్స్‌ రిజిస్ట్రేషన్‌ రూ.800 రూ.1,300
హెవీ గూడ్స్‌ రిజిస్ట్రేషన్‌ రూ.800 రూ.1,800
ఇంపోర్టెడ్‌ మోటార్‌ సైకిల్‌ రూ.1,200 రూ.2,885
ద్విచక్రవాహనం బదిలీ రూ. 330 రూ.535
 
ఫిట్‌నెస్‌ కోసం
లైట్‌ మోటార్‌ వెహికల్స్‌ రూ.360 రూ.720
మీడియం+హెవీ గూడ్స్‌ వెహికల్స్‌ రూ.500 రూ. 920
లెర్నింగ్‌ లైసెన్స్‌
లెర్నింగ్‌ లైసెన్స్‌ సింగిల్‌ క్లాస్‌ రూ.60 రూ.260
(ఒక్కో కేటగిరికి రూ.150 అదనం)
 
డ్రైవింగ్‌ లైసెన్స్‌
 
సింగిల్‌ క్లాస్‌ రూ.440 రూ.960
    (ఒక్కో కేటగిరీకి రూ.300 అదనం)
ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ రూ.850 రూ.1,350
 
ఛార్జీలు తగ్గించాలి
ప్రభుత్వాలు రవాణా శాఖ ద్వారా చెల్లించే ఛార్జీలను పెంచడం దారుణం. ఇప్పటికే డీజిల్‌ ధరలు తరచూ పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఆటోలకు ఫైనాన్స్‌ కట్టలేక అవస్థలు పడుతున్నాం. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలి.
 కె.ఉదయ్‌భాస్కర్, ఆటో కార్మికుడు
 
ఉపాధికి ఎసరు
ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి నెలకొంది. పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపుపై నియంత్రణ లేకపోవడంతో వాహన డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ఛార్జీలతో ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. 
 డీఎన్‌వీడీ ప్రసాద్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement